బలమైన భారత్‌ నిర్మాణ బాధ్యత వ్యాపార వర్గాలదే: ముకేశ్‌ అంబానీ

వచ్చే దశాబ్దాల్లో పూర్తి అభివృద్ధి చెందిన భారతదేశం(వికసిత భారత్‌) అనే మన ప్రధాని మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చడానికి బలమైన, మరింత సమగ్రమైన భారతదేశాన్ని నిర్మించాల్సిన బాధ్యత వ్యాపార వర్గాలపై ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీ అన్నారు.

Published : 31 Mar 2024 02:37 IST

ముంబయి: వచ్చే దశాబ్దాల్లో పూర్తి అభివృద్ధి చెందిన భారతదేశం(వికసిత భారత్‌) అనే మన ప్రధాని మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చడానికి బలమైన, మరింత సమగ్రమైన భారతదేశాన్ని నిర్మించాల్సిన బాధ్యత వ్యాపార వర్గాలపై ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీ అన్నారు. రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఈ పరిశ్రమ 100 బిలియన్‌ డాలర్ల (రూ.8.3 లక్షల కోట్లు) ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రత్నాలు, వజ్రాల పరిశ్రమ 40 బి.డాలర్ల ఎగుమతులకు చేరుకోవడానికి, దేశంలో 50 లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి గత కొన్ని దశాబ్దాలుగా చేసిన కృషికి అంబానీ అభినందనలు తెలిపారు. చాలా నిరాడంబరంగా ప్రారంభమై.. పలన్‌పూర్‌కు చెందిన వ్యక్తుల నేతృత్వంలో ఈ పరిశ్రమ భారీ పురోగతిని సాధించిందన్నారు. అంబానీ కుటుంబానికి కతియావాడ్‌లో మూలాలున్నాయని, పలన్‌పూర్‌ వాసులతో కలిసి పని చేసే అవకాశాలూ ఉన్నాయని తెలిపారు. తన కోడలు శ్లోకా మెహతా కూడా రోజీబ్లూ అధినేత రస్సెల్‌ మెహతా కుమార్తె అని, ఆమె అంబానీ కుటుంబంలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెహతాకు మహారాష్ట్ర గవర్నర్‌ రమేశ్‌ చేతుల మీదుగా జీవన సాఫల్య పురస్కారం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని