ఎల్‌ఎన్‌జీ దిగుమతులు తగ్గొచ్చు

గత కొన్నేళ్లుగా ద్రవరూప సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) దిగుమతి తగ్గుతోందని.. దేశీయ ఉత్పత్తి పెరగడమే ఇందుకు కారణమని కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ పేర్కొంది.

Published : 31 Mar 2024 02:39 IST

2025-26 కల్లా దేశీయ అవసరాల్లో 45 శాతమే
కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ అంచనా

దిల్లీ: గత కొన్నేళ్లుగా ద్రవరూప సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) దిగుమతి తగ్గుతోందని.. దేశీయ ఉత్పత్తి పెరగడమే ఇందుకు కారణమని కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ పేర్కొంది. 2020-21లో దేశీయ ఎల్‌ఎన్‌జీ వినియోగంలో 53 శాతాన్ని దిగుమతులే తీర్చేవి. 2025-26 కల్లా ఇది 45 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేసింది. దేశంలో సహజ వాయువుకు అధిక గిరాకీ ఉంది. దేశీయంగా గ్యాస్‌ ఉత్పత్తిలో ఎంచదగ్గ రీతిలో వృద్ధి కనిపిస్తుండడం కలిసివచ్చే అంశం. దేశీయంగా రోజుకు సుమారు 30 మిలియన్‌ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎమ్‌ఎమ్‌ఎస్‌సీఎమ్‌డీ) గ్యాస్‌ ఉత్పత్తి, గత మూడేళ్లలో జత అయింది. 2024-25లో రోజుకు మరో 15 ఎమ్‌ఎమ్‌ఎస్‌సీఎమ్‌డీ గ్యాస్‌ ఉత్పత్తి జరగొచ్చని అంచనా. ‘స్వచ్ఛ ఇంధనం వైపు మారాలన్న ప్రభుత్వ దృఢ సంకల్పంతో, 2019-20 వరకు సహజ వాయువు వినియోగంలో స్థిర వృద్ధి కనిపించింది. అయితే కరోనా పరిణామాల అనంతరం ఎల్‌ఎన్‌జీ దిగుమతి ధరలు భారీగా పెరిగాయి. దీంతో 2020-21, 2022-23 సంవత్సరాల్లో దేశీయంగా ఎల్‌ఎన్‌జీ వినియోగం తగ్గింద’ని కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ హార్దిక్‌ షా పేర్కొన్నారు. ‘2021-22 నుంచి దేశీయ గ్యాస్‌ ఉత్పత్తి పెరిగింది. 2023-24, 2024-25లోనూ గ్యాస్‌ ఉత్పత్తి మరింత పెరిగి.. దిగుమతులపై ఆధారపడడం తగ్గొచ్చు. దేశీయ గ్యాస్‌ ధరలను సవరించడానికి నియంత్రణపరమైన అడుగులు వేయడం, దిగుమతి గ్యాస్‌ ధరల స్థిరీకరణ, భారత్‌లో తగినంత సామర్థ్యం ఉండడం, గొట్టపు గ్యాస్‌ మౌలిక వసతుల విస్తరణ.. తదితరాలు కలిసి 2025-26 కల్లా మొత్తం గ్యాస్‌ వినియోగంలో దిగుమతుల వాటా 45 శాతానికి పరిమితం కావొచ్చ’ని షా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని