కోరుకున్న వెంటనే కారు.. ఎదురుచూపులు తగ్గుతున్నాయ్‌

డబ్బులున్నా.. కావాల్సిన మోడల్‌ కారును కొనుగోలు చేసేందుకు నెలల తరబడి వేచి ఉండాల్సిన స్థితి ఇటీవలి వరకు ఉండేది.

Updated : 31 Mar 2024 17:21 IST

ఉత్పత్తి పెరగడమే కారణం

ఈనాడు, హైదరాబాద్‌: డబ్బులున్నా.. కావాల్సిన మోడల్‌ కారును కొనుగోలు చేసేందుకు నెలల తరబడి వేచి ఉండాల్సిన స్థితి ఇటీవలి వరకు ఉండేది. కొన్ని మోడళ్ల కోసం 3-4 నెలలు, మరికొన్నింటికి ఏడాది సమయమూ పట్టేది. కొవిడ్‌ పరిణామాల్లో.. వేర్వేరు కారణాలతో కార్ల ఉత్పత్తి తగ్గడం; అదే సమయంలో ఒక్కసారిగా వాహనాలకు గిరాకీ పెరగడం ఇందుకు కారణం. కొన్ని రోజుల్లో ఈ పరిస్థితులు మారబోతున్నాయి. చిప్‌సెట్లతో పాటు ఇతర విడిభాగాల సరఫరా మెరుగు పడటంతో, కార్ల ఉత్పత్తిని పెంచేందుకు వాహన సంస్థలు సిద్ధం అవుతున్నాయి. అందువల్ల కారు కోసం ఆర్డర్‌ ఇచ్చి, ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం ఉండదని నివేదికలు చెబుతున్నాయి.

  పరిమిత వృద్ధి

మూడేళ్లుగా కార్ల మార్కెట్‌లో వృద్ధి 9 శాతానికి పైగానే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 43 లక్షల కార్లు విక్రయమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం బుకింగ్‌లు పెద్దగా ఉండటం లేదు. మరోవైపు కార్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఫలితంగా విక్రయాల్లో వృద్ధి పరంగా చూస్తే, 2024-25లో నెమ్మదించే వీలుందని అంటున్నారు. పాత కార్ల మార్కెట్‌ విస్తృతమవుతున్నందున, కొత్త వాహనాల అమ్మకాలపై ప్రభావం పడుతుందనే అంచనాలున్నాయి.

  సెమీ కండక్లర్ల లభ్యత పెరిగాకే

కొవిడ్‌ పరిణామాల్లో వాహనాల తయారీకి అవసరమైన కొన్ని కీలక విడిభాగాల సరఫరాలో కొరత ఏర్పడింది. ముఖ్యంగా సెమీకండక్లర్లు లభించలేదు. మనదేశంలో చూస్తే ఒక దశలో 7 లక్షలకు పైగా కార్ల డెలివరీలు నిలిచిపోయిన సందర్భాలున్నాయి. సెమీకండక్టర్ల లభ్యత పెరిగాక, కంపెనీలు క్రమంగా ఉత్పత్తిని అధికం చేస్తూ వస్తున్నాయి. ఫలితంగా కార్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం అంతగా ఉండకపోవచ్చని స్పష్టం చేస్తున్నాయి.

 రాయితీలు కూడా లభ్యం

డీలర్ల వద్ద నిల్వలు పెరుగుతున్నందున, కార్లను వేగంగా విక్రయించేందుకు కంపెనీలు రాయితీలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. సాధారణంగా ఏడాది చివర లేదా పండగల వేళల్లో కంపెనీలు రాయితీలను అందిస్తుంటాయి. ఈసారి నిల్వలను వదిలించుకునేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు డీలర్లు కూడా కొన్ని ఉచితాలు అందించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సంవత్సరంలో ఈ పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని