కార్యాలయాల స్థలాలకు పెరుగుతున్న గిరాకీ

వ్యాపారాల విస్తరణ నిమిత్తం కార్పొరేట్ల నుంచి గిరాకీ పెరగడంతో దేశ వ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయ స్థలాల నికర అద్దె లావాదేవీలు 44 శాతం వరకూ పెరిగాయి.

Updated : 31 Mar 2024 03:09 IST

అద్దె లావాదేవీల్లో 44 శాతం వృద్ధి

దిల్లీ: వ్యాపారాల విస్తరణ నిమిత్తం కార్పొరేట్ల నుంచి గిరాకీ పెరగడంతో దేశ వ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయ స్థలాల నికర అద్దె లావాదేవీలు 44 శాతం వరకూ పెరిగాయి. స్థిరాస్తి సేవల సంస్థ కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ శనివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ మూడు నెలల కాలంలో నికరంగా 1.15 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్థలం అద్దెకు వెళ్లింది. 2023లో ఇదే కాలానికి 80.09 లక్షల చ.అడుగులుగా ఉంది. అయిదేళ్ల కాలంలో మూడో అత్యధిక స్థాయి ఇది. వ్యాపార సంస్థలు కార్యాలయాల స్థలాలకు మొగ్గు చూపిస్తుండటంతోనే ఇది సాధ్యమవుతోందని నివేదిక వెల్లడించింది. బెంగళూరు, ముంబయి, దిల్లీ-ఎన్‌సీఆర్‌, చెన్నైలలో నికర అద్దె లావాదేవీలు పెరిగాయి. పుణె, హైదరాబాద్‌, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో కొంత క్షీణత కనిపించిందని పేర్కొంది. భారతీయ ఆఫీస్‌ మార్కెట్‌ బలంగా కొనసాగుతోంది. వరుసగా రెండు త్రైమాసికాల్లో 2 కోట్ల చదరపు అడుగుల స్థూల అద్దె (కొత్త, పునరుద్ధరణ) లావాదేవీలు నమోదయ్యాయని, ఇటీవలి కాలంలో ఇలాంటిది కనిపించలేదని వెల్లడించింది. ఈ బలమైన పనితీరు భారతీయ మార్కెట్‌కు కొత్త ప్రమాణంగా మారే అవకాశం ఉందని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ ఇండియా హెడ్‌ అన్షుల్‌ జైన్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని