200 స్టోర్లు.. రూ.2000 కోట్ల టర్నోవర్‌

‘‘పాతికేళ్ల క్రితం.. ఒక పెద్ద రిటెయిల్‌ సంస్థలో స్టోర్‌ ఇన్‌ఛార్జి ఉద్యోగం. నెల జీతం రూ.750. ‘ఆ మాత్రం దానికి హైదరాబాద్‌లో ఎందుకురా..ఊళ్లో మన పొలం చేసుకున్నా ఇంకా ఎక్కువే వస్తుంది కదా’ అంటూ వారానికోసారి నాన్న నుంచి ఫోను.

Updated : 31 Mar 2024 17:18 IST

వచ్చే పదేళ్లకు ఇదే మా లక్ష్యం
నాణ్యత, నమ్మకమైన సేవలే విజయ రహస్యం
ఈనాడు ఇంటర్వ్యూ
ఎం.జగన్మోహనరావు
ఎండీ, విజేత సూపర్‌ మార్కెట్స్‌
ఈనాడు - హైదరాబాద్‌

‘‘పాతికేళ్ల క్రితం.. ఒక పెద్ద రిటెయిల్‌ సంస్థలో స్టోర్‌ ఇన్‌ఛార్జి ఉద్యోగం. నెల జీతం రూ.750. ‘ఆ మాత్రం దానికి హైదరాబాద్‌లో ఎందుకురా..ఊళ్లో మన పొలం చేసుకున్నా ఇంకా ఎక్కువే వస్తుంది కదా’ అంటూ వారానికోసారి నాన్న నుంచి ఫోను. ఇలా కాదనుకుని, సొంతంగానే సూపర్‌ మార్కెట్‌ వ్యాపారం ప్రారంభించాలనే స్థిరమైన నిర్ణయానికి వచ్చాను. అప్పటికి అయిదేళ్ల పాటు సూపర్‌ మార్కెట్‌లో బిల్లింగ్‌ నుంచి స్టోర్‌ ఇన్‌ఛార్జి వరకు చేసిన అనుభవం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో ధైర్యం చేసి రంగంలోకి దిగాను. చిన్నతనం నుంచి అలవడిన కష్టపడే తత్వం, క్రమశిక్షణకు తోడు నాణ్యమైన సరకులను సహేతుక ధరలకు అందించడం ద్వారా వినియోగదార్ల నమ్మకాన్ని సంపాదించగలిగాం’’- అని విజేత సూపర్‌ మార్కెట్స్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురకొండ జగన్మోహనరావు వివరించారు. 1999 మార్చిలో హైదరాబాద్‌లోని చందానగర్‌లో రూ.22.50 లక్షల పెట్టుబడితో తొలి స్టోర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. రిటెయిల్‌ రంగంలో ఉన్న తీవ్రమైన పోటీని తట్టుకుంటూ 110 స్టోర్లు, రూ.840 కోట్ల టర్నోవరు స్థాయికి విజేత సూపర్‌ మార్కెట్స్‌ను విస్తరించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఉమ్మడి జిల్లాల ప్రధాన కేంద్రాలన్నింటిలో తమ శాఖలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సాగుతున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన తాను, గుంటూరు జిల్లాలోని నిమ్మగడ్డవారి పాలెం నుంచి ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చి... అనుకోకుండా వ్యాపారవేత్తను అయ్యానని ఆయన అన్నారు. విజేత సూపర్‌మార్కెట్స్‌ పాతికేళ్ల ప్రస్థానంపై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే...

అలా మొదలైంది...

మూడేళ్ల పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తి చేశాక, ఉద్యోగం కోసం తొలుత విశాఖపట్నం వెళ్లా. అక్కడ అవకాశాలు పెద్దగా లేవని అర్థమై, హైదరాబాద్‌ వచ్చాను. అప్పటికే పేరున్న ఒక పెద్ద రిటెయిల్‌ సంస్థలో చిక్కడపల్లి స్టోర్‌లో 1993లో ఉద్యోగం వచ్చింది. అయిదేళ్లు పనిచేసినా, పైకొస్తామనే భరోసా రాలేదు. అందుకే ఉద్యోగం వదిలేసి సొంతంగా సూపర్‌ మార్కెట్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నా. గిరాకీ ఉండే ప్రాంతం కోసం 6 నెలలు అన్వేషించి, చివరికి బీహెచ్‌ఈఎల్‌ ఉద్యోగులు అధికంగా ఉన్న చందానగర్‌లో ‘విజేత’ సూపర్‌ మార్కెట్స్‌ మొదటి స్టోర్‌ ప్రారంభించా. నేను ఆ సమయంలో దిల్‌షుక్‌నగర్‌లో ఉండేవాడిని. అక్కడ పోటీ పరీక్షలకు సంబంధించిన విజేత సిరీస్‌ గైడ్లు షాపుల ముందు వేలాడుతూ కనిపించేవి. అలా విజేత అనే పేరు నాకు బాగా గుర్తుండిపోయింది, ఎంతో నచ్చింది కూడా. అందుకే మా సంస్థకు ఆ పేరునే ఎంచుకున్నాం. అలా ‘విజేత’ ప్రస్థానం మొదలైంది. 2005లో జేఎన్‌టీయూ రోడ్లో రెండో స్టోర్‌ ప్రారంభించాం. 2008 నుంచి వేగంగా విస్తరించడం మొదలైంది. తాడేపల్లిగూడెంలో తాజాగా ప్రారంభించిన స్టోర్‌తో ఈ సంఖ్య 110కి చేరింది.

ఉమ్మడి జిల్లా కేంద్రాలన్నింటిలో..

‘విజేత’ టర్నోవర్‌ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.840 కోట్లకు చేరింది. వచ్చే పదేళ్లలో       రూ. 2,000 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలని, అప్పటికి 200 స్టోర్లు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్టోర్లు ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. మా సంస్థలో ఇప్పుడు 3,500 మంది ఉద్యోగులున్నారు. పదేళ్లలో ఈ సంఖ్య 7,000కు చేరుతుంది. సరకును శరవేగంగా గణించడం, ఆఫర్లు వెల్లడించడం... వంటి పనులు చేసేందుకు ‘విరో’ అనే కృత్రిమ మేధ సాంకేతికతతో నడిచే రోబో అసిస్టెంట్‌ను వినియోగిస్తున్నాం. టెక్నాలజీని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకుంటున్నాం.

నిధులు సమీకరించే ఆలోచన

ఇన్నాళ్లు సొంతంగానే వృద్ధి సాధించాం. ఇక్కడి నుంచి విస్తరించాలంటే నిధులు అధికంగా వెచ్చించాలి. ఇప్పుడు అద్దెలు, జీతభత్యాలు, ఇతర వ్యయాలు బాగా పెరిగాయి. కొత్తగా ఒక స్టోర్‌ పెట్టాలంటే రూ.6 కోట్ల వరకు పెట్టుబడి కావాలి. వచ్చే రెండు, మూడేళ్లలోనే 20 కొత్త స్టోర్లు ప్రారంభించాలనే ప్రణాళిక ఉంది. దానికి అవసరమైన నిధులను సంస్థాగత మదుపరుల నుంచి సమీకరించాలని నిర్ణయించాం. దాదాపు 20% వాటా విక్రయించేందుకు సంప్రదింపులు మొదలు పెట్టబోతున్నాం. వచ్చే ఏడాది వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఇప్పుడే పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లాలని అనుకోవటం లేదు. రెండు, మూడేళ్ల తర్వాత ఆలోచిస్తాం.


పోటీని ఎలా తట్టుకున్నామంటే..

ఎంతో పోటీ ఉన్న వ్యాపారం ఇది. ఏమాత్రం తప్పటడుగు పడినా కోలుకోవటం కష్టం. నాణ్యమైన సరకు అందించటానికి తోడు వినియోగదార్ల అవసరాలు గుర్తించటం... ఈ వ్యాపారంలో ప్రధానం. కష్టపడే తత్వం కూడా ఉండాలి. ఒక్కో రోజు 15- 16 గంటలు పని చేయాల్సి వస్తుంది. నమ్మకమైన సిబ్బంది ఎంతో అవసరం. మా ఉద్యోగుల్లో ఎంతో మంది ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నావారే. ఒకసారి ‘విజేత’ స్టోర్‌కు వచ్చిన వినియోగదార్లు మళ్లీ మళ్లీ రావాలని అనుకుంటాం. వారు ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తాం. దీనివల్ల వినియోగదార్లు మాకు బాగా దగ్గరవుతున్నారు. ఊరు మారినా, ప్రాంతం మారినా విజేత సూపర్‌ మార్కెట్‌ ఎక్కడైనా ఉందా అని చూస్తున్నారు. అంతటి బలమైన అనుబంధం ఏర్పడుతోంది. గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌ విక్రయాలు పెరుగుతున్నాయి. ఈ విభాగంలో లేకపోతే వెనుకబడిపోయినట్లే. అందువల్ల ‘విజేత’ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఆర్డర్‌ ఇచ్చిన తర్వాత ఎంతో తక్కువ సమయంలో సరుకులను ‘డెలివరీ’ చేస్తున్నాం. ఫోన్‌ ద్వారా కూడా ఆర్డర్లు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని