సంక్షిప్త వార్తలు

తమ అనుబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఎడ్యుకేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మొత్తం 100% వాటాను విక్రయించాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నిర్ణయించింది.

Published : 01 Apr 2024 01:51 IST

అమ్మకానికి హెచ్‌డీఎఫ్‌సీ ఎడ్యుకేషన్‌

దిల్లీ: తమ అనుబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఎడ్యుకేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మొత్తం 100% వాటాను విక్రయించాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నిర్ణయించింది. స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో ఈ లావాదేవీ జరుగుతుందని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఆసక్తి కలిగిన పార్టీతో తప్పనిసరిగా అమలు చేయాల్సిన షరతులపై ఒప్పందం చేసుకున్నామని, ఆసక్తి కలిగిన ఇతర పార్టీలు కూడా ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. స్విస్‌ ఛాలెంజ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. హెచ్‌డీఎఫ్‌సీ ఎడ్యుకేషన్‌ను ఎవరు కొనుగోలు చేసేదీ నిర్ణయిస్తామని వివరించింది. మూడు ఎడ్యుకేషన్‌ స్కూళ్లకు సేవలు అందించే కార్యకలాపాలను హెచ్‌డీఎఫ్‌సీ ఎడ్యుకేషన్‌ నిర్వహిస్తోంది.


రూ.1.48 లక్షల కోట్ల షేర్లకు పూర్తికానున్న లాకిన్‌ గడువు

దిల్లీ: వచ్చే 4 నెలల్లో రూ.1.48 లక్షల కోట్ల విలువైన 66 కంపెనీల షేర్లకు లాకిన్‌ కాలవ్యవధి పూర్తికానుంది. దీంతో ఈ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. లాకిన్‌ పూర్తయితే ఆయా షేర్ల నుంచి యాంకర్‌, ఇతర మదుపర్లు వైదొలిగే అవకాశం ఉంటుంది. లాకిన్‌ గడువు పూర్తికానున్న షేర్లలో టాటా టెక్నాలజీస్‌, హోనాసా కన్జూమర్‌, సెల్లో వరల్డ్‌, జనస్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఉన్నాయి. ఏప్రిల్‌ 1న గ్లోబల్‌ సర్ఫేసెస్‌, సాయి సిల్క్స్‌, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ప్లాటినం ఇండస్ట్రీస్‌, ఎక్సికామ్‌ టెక్నాలజీస్‌ షేర్ల లాకిన్‌ ముగియనుంది. ఐపీఓలో షేర్లు పొందిన యాంకర్‌ మదుపర్లు 90 రోజుల పాటు విక్రయించడానికి వీలు లేకపోవడమే లాకిన్‌.


దేశీయంగా సిలిండ్రికల్‌ లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీ

ఐఓసీతో పానసోనిక్‌ భాగస్వామ్యం

దిల్లీ: సిలిండ్రికల్‌ లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీ నిమిత్తం దేశీయ అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌)తో పానసోనిక్‌ గ్రూప్‌ భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. జపాన్‌కు చెందిన పానసోనిక్‌ గ్రూప్‌ సంస్థ పానసోనిక్‌ ఎనర్జీ కంపెనీ ఇందుకు సంబంధించి ఐఓసీతో జట్టు కడుతోంది. భారత విపణిలో ద్వి-త్రిచక్ర వాహన బ్యాటరీలతో పాటు ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్‌కు గిరాకీ మరింత విస్తృతం అవుతుందనే అంచనాతో దేశీయంగా బ్యాటరీలు తయారు చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించాయి. ఇవి తయారు చేయబోయే సిలిండ్రికల్‌ లిథియం అయాన్‌ బ్యాటరీలను  ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలు, పవర్‌ టూల్స్‌, విద్యుత్తు వాహనాల్లో వినియోగిస్తారు. 2046 కల్లా నికర కర్బన ఉద్గారాల్లో శూన్య స్థితికి చేరాలన్న ఐఓసీ లక్ష్యంలో భాగంగా ఈ ఒప్పందం చేసుకుంది.


బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రుణరేటు స్వల్పంగా పెంపు

దిల్లీ: ఏప్రిల్‌ 1 నుంచి రుణరేటును 10 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) ప్రకటించింది. ఇందువల్ల రిటైల్‌ రుణాలు సహా ఇతర విభాగ రుణాల వడ్డీ పెరగనుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ఏప్రిల్‌ 5న వెలువడనున్న నేపథ్యంలో బీఓఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రెపో రేటు ఆధారిత వడ్డీరేటు 9.35 శాతం అవుతుందని తెలిపింది.

బేస్‌రేటు, బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును 5 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ఇండియన్‌ బ్యాంక్‌ వెల్లడించింది. కొత్తరేట్లు ఏప్రిల్‌ 3 నుంచి అమల్లోకి రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని