74,245 ఎగువన మరిన్ని లాభాలు!

సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా రెండో వారం సూచీలు లాభాల్లో ముగిశాయి.

Published : 01 Apr 2024 01:55 IST

సమీక్ష: సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా రెండో వారం సూచీలు లాభాల్లో ముగిశాయి. మార్చి డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు కలిసొచ్చాయి. దేశీయంగా చూస్తే.. కీలక పరిణామాలు లేకపోవడంతో కార్పొరేట్‌ వార్తలు దిశానిర్దేశం చేశాయి. హోలీ, గుడ్‌ఫ్రైడే సెలవుల కారణంగా గతవారం మార్కెట్లు మూడు రోజులే పనిచేశాయి. వచ్చే కొన్నేళ్లలో భారత్‌ 7% కంటే ఎక్కువ వృద్ధిరేటును స్థిరంగా సాధిస్తుందని, వచ్చే దశాబ్దంలో 10% వృద్ధి కూడా సాధ్యమేనని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరులో దేశ కరెంట్‌ ఖాతా లోటు 10.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.87,000 కోట్ల)కు చేరింది. కొన్ని షేర్లకు టీ+0 సెటిల్‌మెంట్‌ విధానాన్ని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ప్రారంభించాయి. బ్యారెల్‌ ముడిచమురు ధర 87 డాలర్లకు చేరింది. ఒపెక్‌+ దేశాలు ఉత్పత్తి కోతలు పొడిగించడం, రష్యా చమురు సదుపాయాలపై ఉక్రెయిన్‌ దాడులు చమురు ధరపై ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.38 వద్ద స్తబ్దుగా ముగిసింది. అంతర్జాతీయంగా.. వరుసగా రెండు త్రైమాసికాల పాటు ప్రతికూల వృద్ధి నమోదుచేయడంతో, బ్రిటన్‌ సాంకేతికంగా మాంద్యంలోకి అడుగుపెట్టింది. అమెరికా నాలుగో త్రైమాసిక జీడీపీని 3.4 శాతానికి సవరించారు. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 1.1% లాభంతో 73,636 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1% పెరిగి 22,327 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో యంత్ర పరికరాలు, స్థిరాస్తి, విద్యుత్‌ షేర్లు లాభపడగా..ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ, బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.2,369 కోట్ల  విలువైన షేర్లను, డీఐఐలు రూ.8,913 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. మార్చిలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ.35,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 8:9గా నమోదు కావడం..
పెద్ద షేర్లలో అప్రమత్తత కొనసాగడాన్ని సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: గతవారం లాభాల్లో ముగిసిన సెన్సెక్స్‌, జీవనకాల గరిష్ఠమైన 74,245 పాయింట్లకు చేరువైంది. ఈ స్థాయిని అధిగమిస్తే.. స్వల్పకాలంలో మరింత లాభపడే అవకాశం ఉంది. మరోవైపు 72,000- 72,400 పాయింట్ల శ్రేణిలో మద్దతు లభించొచ్చు. ఈ స్థాయిని కోల్పోతే బలహీనతలకు ఆస్కారం ఉంటుంది. కార్పొరేట్‌ సంస్థల త్రైమాసిక ఫలితాలు వెలువడ నున్నందున ఎంపిక చేసిన చిన్న, మధ్య షేర్లకు కొనుగోళ్ల మద్దతు దక్కొచ్చు.

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దేశీయ సూచీలు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. మార్చి వాహన విక్రయాలు, జీఎస్‌టీ వసూళ్లు, పీఎంఐ గణాంకాలపై దృష్టి పెట్టొచ్చు. ఏప్రిల్‌ 3-5 తేదీల్లో జరగనున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశం కీలకం కానుంది. ఈసారి కూడా కీలక రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. ఆర్‌బీఐ, సెబీ కొత్త నియమావళి/నిబంధనల అమలుపై మదుపర్లు కన్నేయొచ్చు. అంతర్జాతీయంగా.. అమెరికా, చైనా సహా పలు దేశాలు పీఎంఐ గణాంకాలు ప్రకటించనున్నాయి. అమెరికా నిరుద్యోగం, యూరోజోన్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. ఏప్రిల్‌ 3న జరగనున్న ఒపెక్‌+ కమిటీ సమావేశంపై దృష్టిపెట్టొచ్చు. రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడులు, చమురు ధరల నుంచి ఈక్విటీ మార్కెట్లు సంకేతాలు తీసుకోవచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 73,120, 72,600, 72,172
తక్షణ నిరోధ స్థాయులు: 74,245, 74,600, 75,200
సెన్సెక్స్‌ 74,245 ఎగువన మరింత లాభపడొచ్చు.

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని