ఈ వేసవి.. ఏసీలకు యమ గిరాకీ

దేశంలోని వాతావరణ పరిస్థితుల వల్ల ప్రస్తుత సీజన్‌లో ఏసీల విక్రయాలు, గత ఏడాదితో పోలిస్తే నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నా, ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా ఉక్కపోత రాలేదు.

Updated : 01 Apr 2024 07:45 IST

1.15 కోట్ల యూనిట్లు అమ్ముడవుతాయని అంచనా

దిల్లీ: దేశంలోని వాతావరణ పరిస్థితుల వల్ల ప్రస్తుత సీజన్‌లో ఏసీల విక్రయాలు, గత ఏడాదితో పోలిస్తే నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నా, ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా ఉక్కపోత రాలేదు. అయితే సీజన్‌ మొత్తంమీద ఎండలు మండుతాయనే అంచనాలు, ఎయిర్‌ కండీషనర్‌ (ఏసీ) కంపెనీలకు ఆశలు పెంచుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే, ఈసారి అమ్మకాల్లో రెండంకెల వృద్ధి లభిస్తుందని ఏసీ తయారీ సంస్థలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది 1.15 కోట్ల ఏసీలు విక్రయించొచ్చని అంచనా వేశాయి. గతేడాదితో పోలిస్తే, ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటం, ప్రజల చేతుల్లో మిగులు ఆదాయం ఎక్కువగా ఉండటం, మధ్యతరగతి ఆదాయ కుటుంబీకుల సంఖ్య పెరగడం వల్ల ఏసీల విక్రయాలు బాగా పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దైకిన్‌, పానసోనిక్‌, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, బ్లూస్టార్‌, గోద్రేజ్‌ అప్ల్లయెన్సెస్‌, లాయిడ్‌ వంటి సంస్థలు ఈ ఏడాది విక్రయాల్లో 20-25%  వృద్ధి నమోదు చేస్తామని ధీమాగా ఉన్నాయి. తృతీయ శ్రేణి పట్టణాలు, చిన్న ;ప్రాంతాల నుంచీ ఏసీలకు గణనీయంగా గిరాకీ లభిస్తుందని భావిస్తున్నాయి. విద్యుత్‌ను ఆదా చేసే     5-స్టార్‌ రేటింగ్‌, ఇన్వర్టర్‌-సాంకేతికత కలిగిన మోడళ్లకు మెట్రో నగరాలు, ఇతర పెద్ద మార్కెట్ల నుంచి గిరాకీ ఎక్కువగా ఉండగా,  పట్టణ శివార్లు, గ్రామీణ విపణుల నుంచి అందుబాటు ధరల్లో లభించే 3-స్టార్‌ ఏసీలకు ఆదరణ బాగున్నట్లు తెలుస్తోంది.

విలువ పరంగా 10-12% వృద్ధి

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి స్మార్ట్‌ ఫీచర్లు, తక్కువ నిర్వహణ వ్యయంతో పాటు విద్యుత్‌ ఆదా చేసే మోడళ్లను వివిధ బ్రాండ్లు పరిచయం చేస్తున్నాయి.  ఫైనాన్స్‌ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఇన్‌స్టలేషన్‌లో రాయితీల వంటివి వినియోగదార్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ వేసవి సీజన్‌లో 20% వృద్ధిని పరిశ్రమ అంచనా వేస్తోందని బ్లూస్టార్‌ ఎండీ బి.త్యాగరాజన్‌ వెల్లడించారు. దైకిన్‌ ఇండియా ఛైర్మన్‌, ఎండీ కేజే జావా మాట్లాడుతూ ఇళ్లలో ఏర్పాటు చేసుకునే ఏసీల విపణి దేశ దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో బాగుందని తెలిపారు. విలువపరంగా పరిశ్రమ అమ్మకాల్లో 10-12% వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పానసోనిక్‌ ఇండియా బిజినెస్‌ హెడ్‌, ఎయిర్‌ కండిషనర్స్‌ గ్రూప్‌ అభిషేక్‌ వర్మ, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ చిట్కారా, గోద్రేజ్‌ అప్లయెన్సెస్‌ బిజినెస్‌ హెడ్‌, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది, హావెల్స్‌ ఇండియా (కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ బ్రాండ్‌ లాయిడ్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ యోగేశ్‌ కుమార్‌ గుప్తా తదితరులు కూడా ఈ ఏడాది వేసవి సీజన్‌లో ఏసీల విపణి బాగుంటుందని వివరించారు.

  • 2023లో ఏసీల అమ్మకాలు 4.4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.36,500 కోట్ల) మేర జరిగాయని టెక్‌ఎస్‌సీఐ రీసెర్చ్‌ అంచనా వేసింది.
  • ఈసారి బెంగళూరులో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల, అక్కడా ఏసీల విక్రయాలు అధికమవుతున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ప్లాంటు ఏర్పాటుతో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు కంటే పెంచుకున్నట్లు హావెల్స్‌ తెలిపింది. ఏప్రిల్‌ నుంచి అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని