సంక్షిప్త వార్తలు(6)

కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజడ్‌)లో నిర్మించిన 4 కొత్త ప్లాంట్లలో అరబిందో ఫార్మా ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించింది.

Published : 02 Apr 2024 01:49 IST

కాకినాడ ఎస్‌ఈజడ్‌లో 4 యూనిట్లు ప్రారంభించిన అరబిందో ఫార్మా

ఈనాడు, హైదరాబాద్‌: కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజడ్‌)లో నిర్మించిన 4 కొత్త ప్లాంట్లలో అరబిందో ఫార్మా ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించింది. పెన్సిలిన్‌-జీ, 6- అమినో పెనిసిల్లానిక్‌ యాసిడ్‌ (6-ఏపీఏ), ఇంజెక్టబుల్‌ ఔషధాలు, గ్రాన్యులేషన్‌ ఔషధాల ఉత్పత్తి కోసం 4 అనుబంధ కంపెనీల ద్వారా ఈ యూనిట్లు ఏర్పాటు చేశారు. పెన్సిలిన్‌-జీ యూనిట్‌కు 15,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం; 6-ఏపీఏ ప్లాంటుకు 3,600 టన్నుల వార్షిక సామర్థ్యం ఉందని అరబిందో ఫార్మా వెల్లడించింది. పెన్సిలిన్‌-జీ యూనిట్‌ను కేంద్ర ప్రభుత్వం పీఎల్‌ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక) పథకం కింద ఎంపిక చేయడం గమనార్హం.


వాణిజ్య సిలిండరు ధర రూ.32 తగ్గింది

హైదరాబాద్‌: హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించే 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరను చమురు సంస్థలు హైదరాబాద్‌లో రూ.32.50 మేర తగ్గించాయి. ఇప్పటివరకు ఈ సిలిండర్‌ ధర రూ.2027 కాగా, సోమవారం నుంచి రూ.1994.50కు లభిస్తోంది. గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌ (14.2 కిలోలు) ధరలో ఎలాంటి మార్పు లేదు.
స్వల్పంగా తగ్గిన విమాన ఇంధన ధర:  విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరను 0.49% (కిలోలీటరుకు రూ.502.91) మేర తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ప్రకటించాయి. దిల్లీలో కిలో లీటరు ఏటీఎఫ్‌ ధర రూ.1,00,893.63కు, ముంబయిలో రూ.94,466.41కు చేరింది. స్థానిక పన్నుల ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో ఈ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.


జేబీ ఫార్మాలో వాటా విక్రయానికి టొరెంట్‌ ఫార్మాతో కేకేఆర్‌ చర్చలు

దిల్లీ: జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ (జేబీ ఫార్మా)లో మెజారిటీ వాటా విక్రయించేందుకు టొరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌తో అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్‌ ప్రాథమిక చర్చలు జరుపుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2020 జులైలో జేబీ ఫార్మాలో 54% వాటాను ప్రమోటర్ల నుంచి దాదాపు రూ.3,100 కోట్లకు కేకేఆర్‌ కొనుగోలు చేసింది. జేబీ ఫార్మా వ్యవస్థాపకులైన మోదీ కుటుంబం నుంచి ఒక్కో షేరుకు రూ.745 వెచ్చించి, ఈ వాటా దక్కించుకుంది. సోమవారం బీఎస్‌ఈలో జేబీ ఫార్మా షేరు 2.29% లాభపడి రూ.1,687.30 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.26,186.02 కోట్లుగా ఉంది. ఈ ప్రకారం కేకేఆర్‌ వాటా విలువ రూ.14,000 కోట్లుగా ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. టొరెంట్‌ ఫార్మాతో చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, పెట్టుబడి సంస్థల నుంచి కూడా ఆసక్తి వస్తోందని తెలుస్తోంది. టొరెంట్‌తో చర్చలు నడుస్తున్నప్పటికీ, మెరుగైన ధర కోసం బిడ్డింగ్‌ ప్రక్రియను కేకేఆర్‌ నిర్వహించే అవకాశం ఉంది. కేకేఆర్‌ వాటా విక్రయం వల్ల కంపెనీలో ప్రజలకు ఉన్న 26% వాటా కోసం కొనుగోలు సంస్థ ఓపెన్‌ ఆఫర్‌ కూడా నిర్వహించొచ్చు.  


ఇన్ఫోసిస్‌కు రూ.341 కోట్ల పన్ను నోటీసు

దిల్లీ: 2020-21 మదింపు సంవత్సరానికి ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం నుంచి రూ.341 కోట్ల పన్ను డిమాండ్‌ అందుకున్నట్లు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. ఈ నోటీసుపై అప్పీలుకు చూస్తున్నట్లు తెలిపింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికం, పూర్తి ఆర్థిక సంవత్సర ఖాతాలపై ఈ ఆదేశాల ప్రభావాన్ని మదింపు చేసే పనిలో ఉన్నట్లు సంస్థ పేర్కొంది. 2014-15 మదింపు సంవత్సరానికి రూ.15 కోట్ల రిఫండ్‌ను కంపెనీ అనుబంధ సంస్థ అందుకున్నట్లు వివరించింది.


ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లో ఫిన్‌కేర్‌ విలీనం

దిల్లీ: ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లో ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ విలీనమైంది. ఈ రంగంలో ఇదే మొదటి విలీనం కావడం గమనార్హం. పూర్తిగా షేర్ల విలీన పద్ధతిలో జరిగే ఈ లావాదేవీని 2023 అక్టోబరు 29న తొలుత ప్రకటించారు. దీని ప్రకారం ఫిన్‌కేర్‌ బ్యాంక్‌లో 2000 ఈక్విటీ షేర్లు కలిగిన వాటాదార్లకు 579 ఏయూ స్మాల్‌ బ్యాంక్‌ షేర్లు లభిస్తాయి. ఈ విలీనం 2024 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.


2023-24లో రూ.5,000 కోట్ల లాభం!

ఏఏఐ ఛైర్మన్‌ సంజీవ్‌ కుమార్‌ అంచనా

దిల్లీ: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.5,000 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసే అవకాశం ఉందని ఏఏఐ ఛైర్మన్‌ సంజీవ్‌ కుమార్‌ అంచనా వేశారు. గతంలో ఎన్నడూ ఇంత భారీమొత్తాన్ని సంస్థ నమోదు చేయలేదు. ప్రాంతీయ అనుసంధాన పథకం వల్ల, దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నందున, కొన్నేళ్లుగా విమానాశ్రయాల సంఖ్య పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ.5,250 కోట్ల మూలధన వ్యయాల లక్ష్యాన్ని అధిగమించామని సంజీవ్‌ తెలిపారు. 2023-24లో ఏఏఐ టర్నోవర్‌ రూ.15,000 కోట్లు, నికర లాభం రూ.5,000 కోట్లు నమోదు కావొచ్చని ఏఏఐ 29వ వార్షికోత్సవంలో సంజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు