ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌ నుంచి మధురా ఫ్యాషన్‌ విభజన!

ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌) నుంచి మధురా ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ వ్యాపారాన్ని విభజించి.. ప్రత్యేక కంపెనీగా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయనున్నారు.

Published : 02 Apr 2024 01:50 IST

ప్రత్యేక నమోదు సంస్థగా ఏర్పాటు

దిల్లీ: ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌) నుంచి మధురా ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ వ్యాపారాన్ని విభజించి.. ప్రత్యేక కంపెనీగా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయనున్నారు. మధురా ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ (ఎంఎఫ్‌ఎల్‌) వ్యాపార విభజన అంశాన్ని మదింపు చేసే బాధ్యతను కంపెనీ యాజమాన్యానికి అప్పగిస్తూ సోమవారం జరిగిన సమావేశంలో ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. ‘ప్రతిపాదిత వ్యాపార విభజనతో రెండు వేర్వేరు నమోదిత కంపెనీలు ఏర్పడతాయి. విడివిడిగా మూలధన వ్యవస్థ, సమాంతర విలువ సృష్టి అవకాశాలను కలిగి ఉండి, స్వతంత్ర వృద్ధి చోదకాలుగా ఇవి పనిచేస్తాయ’ని కంపెనీ తెలిపింది. మధురా ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌లో 4 ప్రఖ్యాత ఫ్యాషన్‌ బ్రాండ్లు - లూయీ ఫిలిప్‌, వాన్‌ హ్యూజన్‌, అలెన్‌ సోలీ, పీటర్‌ ఇంగ్లండ్‌ ఉన్నాయి. వీటితో పాటు అమెరికన్‌ ఈగల్‌, ఫరెవర్‌ 21 లాంటి క్యాజువల్‌ దుస్తుల బ్రాండ్లు కూడా ఉన్నాయి. స్పోర్ట్స్‌వేర్‌ బ్రాండు రీబక్‌, వాన్‌ హ్యూజన్‌ కింద లోదుస్తుల వ్యాపారానికి బ్రాండు లైసెన్సులు కూడా కలిగి ఉంది. ఈ విభాగాన్ని కూడా వేరే సంస్థగా విభజించి నమోదు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. మధురా ఫ్యాషన్‌ వ్యాపార విభజన ప్రతిపాదనకు ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌ డైరెక్టర్ల బోర్డు, వాటాదార్లు, రుణ సంస్థలు, నియంత్రణ సంస్థల నుంచి  అనుమతులు లభిస్తే ఎన్‌సీఎల్‌టీ షేర్ల బదలాయింపు పథకం కింద ఎంఎఫ్‌ఎల్‌ విభజనను అమలు చేస్తారు. ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌లో వాటాదార్లు ఎంతైతే వాటా కలిగి ఉన్నారో, అదే పరిమాణంలో కొత్తగా ఏర్పాటయ్యే సంస్థలోనూ వాటాలు ఉంటాయని కంపెనీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని