45 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి: ఎన్‌ఎండీసీ

ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 45.1 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తిని అధిగమించింది. ఇంతటి ఉత్పత్తి సాధించిన తొలి ‘మైనింగ్‌ కంపెనీ’గా గుర్తింపు దక్కించుకుంది.

Published : 02 Apr 2024 01:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 45.1 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తిని అధిగమించింది. ఇంతటి ఉత్పత్తి సాధించిన తొలి ‘మైనింగ్‌ కంపెనీ’గా గుర్తింపు దక్కించుకుంది. 2023-24లో అమ్మకాలు 44.8 మిలియన్‌ టన్నులుగా ఉన్నట్లు ఎన్‌ఎండీసీవెల్లడించింది. 2022-23తో పోల్చితే ఉత్పత్తి 10%, అమ్మకాలు 16% పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (2024 జనవరి- మార్చి) లో 13.31 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి, 12.54 మిలియన్‌ టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కిరండేల్‌, బచేలీ గనులతో పాటు కర్ణాటకలోని దోనిమలై గనుల్లో అధిక ఉత్పత్తి వల్ల ఈ ఘనత సాధ్యమైనట్లు వెల్లడించింది. పెల్లెట్ల ఉత్పత్తిలో ఎదురయ్యే అవరోధాలను ముందుగా గుర్తించి, తగిన పరిష్కారాలు చేయడమూ కలిసొచ్చినట్లు వివరించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1769 కోట్ల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించగా, దీనికి మించి రూ.2,014 కోట్లు వ్యయం చేసింది. సమీప భవిష్యత్తులో 100 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు సంస్థ ఉద్యోగులు, అధికారులు సిద్ధం కావాలని ఎన్‌ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని