సీపీఎస్‌ఈల్లో వాటాల విక్రయంతో రూ.16,507 కోట్లు

గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్‌ఈ)ల్లో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.16,507.29 కోట్లు సమీకరించింది.

Published : 02 Apr 2024 01:59 IST

2023-24 బడ్జెట్‌ అంచనా కంటే తక్కువే వచ్చింది

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్‌ఈ)ల్లో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.16,507.29 కోట్లు సమీకరించింది. మొత్తంగా 10 సీపీఎస్‌ఈల్లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌సీ) ద్వారా వాటాలను ప్రభుత్వం విక్రయించింది. కోల్‌ ఇండియాలో వాటా విక్రయం ద్వారా రూ.4,186 కోట్లు రాగా.. ఎన్‌హెచ్‌పీసీ నుంచి రూ.2,488 కోట్లు, ఎన్‌సీఎల్‌ నుంచి రూ.2,129 కోట్లు ఖజానాకు వచ్చాయి. ఐఆర్‌ఈడీఏ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రూ.858 కోట్లు సమీకరించింది. ఆర్‌వీఎన్‌ఎల్‌, ఎస్‌జేవీఎన్‌, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌, హడ్కో, సూటీలలో కొన్ని షేర్లను ప్రభుత్వం విక్రయించింది.

గత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.51,000 కోట్లు సమీకరించగలమని బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1న సవరించిన అంచనాల్లో.. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించే నిధుల వివరాలను వేరే విభాగం కింద ప్రభుత్వం చూపించింది. ఈ ప్రకారం.. కేపిటల్‌ రిసీట్స్‌ కింద రూ.30,000 కోట్లు లభిస్తాయని పేర్కొంది. వీటిల్లో పెట్టుబడుల ఉపసంహరణ కింద సమీకరించే నిధులు రూ.20,000 కోట్లు కాగా.. ఆస్తుల నగదీకరణతో రూ.10,000 కోట్లు రావొచ్చని తెలిపింది. అంటే 2023-24లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించిన రూ.16,507 కోట్లు.. ప్రభుత్వ అంచనా రూ.20,000 కోట్ల కంటే తక్కువే. 2018-19, 2017-18 మినహా.. దాదాపుగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రభుత్వం అందుకోలేదు. 2017-18లో రూ.1 లక్ష కోట్లను ప్రభుత్వం అంచనా వేయగా.. రూ.1,00,056 కోట్లను సమీకరించింది. 2018-19లో రూ.80,000 కోట్లను అంచనా వేయగా.. రూ.84,972 కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని