42 లక్షల కార్ల రికార్డు విక్రయాలు

స్పోర్ట్స్‌ వినియోగ వాహనాల (ఎస్‌యూవీల)కు బలమైన గిరాకీ ఏర్పడటంతో, దేశీయంగా ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) టోకు సరఫరాలు గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రికార్డు గరిష్ఠమైన 42.3 లక్షలకు చేరాయి.

Updated : 02 Apr 2024 04:15 IST

16.6 లక్షల ఈవీల అమ్మకాలు
2023-24 ఘనత ఇదీ

దిల్లీ: స్పోర్ట్స్‌ వినియోగ వాహనాల (ఎస్‌యూవీల)కు బలమైన గిరాకీ ఏర్పడటంతో, దేశీయంగా ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) టోకు సరఫరాలు గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రికార్డు గరిష్ఠమైన 42.3 లక్షలకు చేరాయి. 2022-23లో కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా అయిన 38.9 లక్షల పీవీలతో పోలిస్తే ఈ సంఖ్య 9% అధికం. మొత్తం పీవీల అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా 50 శాతానికి మించింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ మోటార్‌, టయోటా వంటి దిగ్గజ సంస్థలు రికార్డు స్థాయి విక్రయాలను నమోదు చేశాయి. మార్చి నెల విక్రయాలు కూడా రికార్డుస్థాయుల్లో నమోదయ్యాయి.

ఈవీల అమ్మకాలు భళా

గత ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు వాహన (ఈవీ) అమ్మకాలు కూడా దుమ్ము రేపాయి. అన్ని విభాగాల వాహనాలు కలిసి 16.6 లక్షల మేర అమ్ముడయ్యాయి. ఇందులో ద్విచక్ర వాహనాలు 9.35 లక్షలు, ఆటోలు 6.30 లక్షలు, కార్లు సహా ప్రయాణికుల వాహనాలు 90,000 ఉన్నాయి. భారత ప్రభుత్వ వాహన్‌ వెబ్‌సైట్‌ ప్రకారం గత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద 16,65,270 ఈవీలు రిటైల్‌గా విక్రయమయ్యాయి. 2022-23లో ఈ సంఖ్య 11.8 లక్షలు మాత్రమే. ఈ ఏడాది మార్చి నెలలలోనే 1.98 లక్షల విద్యుత్తు వాహనాలు విక్రయం అవ్వడం గమనార్హం.

2024-25లో నెమ్మదించనున్న వృద్ధి

ప్రయాణికుల వాహన విక్రయాలు 2022-23లో 26% వృద్ధి చెందాయి. 2023-24లో ఇది 9 శాతానికి దిగి వచ్చింది. 2024-25లో ఈ వృద్ధి మరింత నెమ్మదిస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాదిలోనే వాహన విక్రయాలు అధికంగా జరగడం (బేస్‌ అధికంగా ఉండటం), చిన్న కార్లకు గిరాకీ మరింతగా తగ్గిపోవడం, రుణ వ్యయాలు అధికమవ్వడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు.

  • మారుతీ సుజుకీ ఈ ఏడాది మార్చిలో మొత్తం 1,87,196 వాహనాలను విక్రయించింది. 2023 మార్చిలో విక్రయించిన 1,70,071 వాహనాలతో పోలిస్తే ఇవి 10% అధికం. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ మొత్తం విక్రయాలు 20 లక్షల మైలురాయిని అధిగమించాయి. ఇందులో 17,93,644 దేశీయంగా విక్రయమయ్యాయి. దేశీయ విక్రయాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. 2,83,067 వాహనాలను సంస్థ ఎగుమతి చేసింది.
  • 2024 మార్చిలో దేశీయంగా మారుతీ విక్రయాలు 1,52,718కు చేరాయి. 2023 మార్చినాటి 1,32,763 కంటే ఇవి 15% అధికం. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్‌-ప్రెసో మోడళ్ల విక్రయాలు 11,582 నుంచి 11,829కు చేరాయి. కాంపాక్ట్‌ కార్లయిన బాలెనో, సెలెరియో, డిజైర్‌, ఇగ్నిస్‌, స్విఫ్ట్‌, టూర్‌ ఎస్‌, వ్యాగన్‌ఆర్‌ల విక్రయాలు 71,832 నుంచి 69,844కు తగ్గాయి. యుటిలిటీ వాహనాలైన బ్రెజా, ఎర్టిగా, ఫ్రాంక్స్‌, గ్రాండ్‌ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, ఎస్‌-క్రాస్‌, ఎక్స్‌ఎల్‌6ల విక్రయాలు 37,054 నుంచి 58,436కు చేరాయి. మధ్య స్థాయి సెడాన్‌ సియాజ్‌ విక్రయాలు 300 నుంచి 590కి చేరాయి. గత నెలలో ఎగుమతులు 30,119 నుంచి 25,892కు తగ్గాయి.
  • 2023-24లో మారుతీ మొత్తం విక్రయాలు 19,66,164 నుంచి 8.6% వృద్ధితో 21,35,323కు చేరాయి. ఇందులో దేశీయ అమ్మకాలు 16,06,870 నుంచి 9.52% పెరిగి 17,59,881కు చేరాయి. ఎగుమతులు 2,59,333 నుంచి 9.15% వృద్ధితో 2,83,067కు పెరిగాయి.
  • టాటా మోటార్స్‌ దేశీయ విక్రయాలు గత నెలలో 90,822కు చేరాయి. 2023 మార్చిలో నమోదైన 89,351 వాహనాలతో పోలిస్తే ఇవి 2% ఎక్కువ. ప్రయాణికుల వాహన విక్రయాలు (విద్యుత్‌ వాహనాలతో కలిపి) 44,225 నుంచి 14% వృద్ధితో 50,297కు చేరాయి. వాణిజ్య వాహన సరఫరాలు 45,307 నుంచి 10% తగ్గి 40,712కు పరిమితమయ్యాయి. 2023-24లో దేశీయ విపణిలో మొత్తం టోకు విక్రయాలు 9,49,015కు చేరాయి. ఏడాది క్రితం నాటి 9,31,957 కంటే ఇవి 2% అధికం. వాణిజ్య వాహన సరఫరాలు 3,93,317 నుంచి 4% తగ్గి 3,78,060కు పరిమితమయ్యాయి.
  • మహీంద్రా అండ్‌ మహీంద్రా విక్రయాలు మార్చిలో 66,041 నుంచి 4% పెరిగి 68,413కు చేరాయి. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా విక్రయాలు 61,500 నుంచి 7% వృద్ధితో 65,601కు చేరాయి. టయోటా 25% వృద్ధితో అత్యధిక నెలవారీ టోకు విక్రయాలు (27,180) నమోదు చేసింది. 2023-24 మొత్తంమీద 2,63,512 వాహనాలను విక్రయించింది. ఏడాది క్రితం నాటి 1,77,683 కంటే ఇవి 48% అధికం.
  • ద్విచక్ర వాహన విభాగంలో టీవీఎస్‌ మోటార్‌ 2023-24లో 41.91 లక్షల రికార్డు విక్రయాలను నమోదు చేసింది. 2022-23లో నమోదు చేసిన 36.82 లక్షల వాహనాలతో పోలిస్తే ఇవి 14% అధికం. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ దేశీయ విక్రయాలు 7,34,840 నుంచి 14% పెరిగి 8,34,795కు చేరాయి.
  • హీరో మోటోకార్ప్‌ గత ఆర్థిక సంవత్సరంలో 56,21,455 వాహనాలను విక్రయించింది. 2022-23లో విక్రయించిన 53,28,546 వాహనాలతో పోలిస్తే ఇవి 5.5 శాతం అధికం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని