3 రోజుల్లో రూ.10.58 లక్షల కోట్ల లాభం

కొత్త ఆర్థిక సంవత్సరాన్ని స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్‌, నిఫ్టీ సోమవారం ఇంట్రాడేలో తాజా గరిష్ఠాలకు చేరాయి. స్థిరాస్తి, లోహ షేర్లు రాణించాయి.

Updated : 02 Apr 2024 03:29 IST

సమీక్ష
కొత్త గరిష్ఠాలకు సెన్సెక్స్‌, నిఫ్టీ

కొత్త ఆర్థిక సంవత్సరాన్ని స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్‌, నిఫ్టీ సోమవారం ఇంట్రాడేలో తాజా గరిష్ఠాలకు చేరాయి. స్థిరాస్తి, లోహ షేర్లు రాణించాయి. బ్యాంకుల వార్షిక ఖాతాల ముగింపు కారణంగా సోమవారం ఫారెక్స్‌ మార్కెట్లు పనిచేయలేదు. బ్యారెల్‌ ముడిచమురు 87 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో టోక్యో మినహా మిగతావి మెరిశాయి.

సూచీల వరుస లాభాలతో, మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత మూడు ట్రేడింగ్‌ రోజుల్లో రూ.10.58 లక్షల కోట్లు పెరిగి రూ.393.15 లక్షల కోట్ల (4.74 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది. ఈ 3 రోజుల్లో సెన్సెక్స్‌ 1544.25 పాయింట్ల మేర లాభపడింది.

సెన్సెక్స్‌ ఉదయం 73,968.62 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అనంతరం అదే జోరు కొనసాగిస్తూ, 74,254.62 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అక్కడ లాభాల స్వీకరణతో వెనక్కి వచ్చి, 363.20 పాయింట్ల లాభంతో 74,014.55 వద్ద ముగిసింది. నిఫ్టీ 135.10 పాయింట్లు పెరిగి 22,462 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,529.95 పాయింట్ల వద్ద తాజా రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది.

అదానీ షేర్ల జోరు: మార్కెట్లు పరుగులు తీయడంతో అదానీ గ్రూప్‌ షేర్లు మెరిశాయి. బీఎస్‌ఈలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌  8.40%, ఎన్‌డీటీవీ 6.16%, అదానీ విల్మర్‌ 5.92%, అదానీ పవర్‌ 4.99%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 4.81%, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 2.93%, అదానీ పోర్ట్స్‌ 2.56%, ఏసీసీ 2.38%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 1.80%, అంబుజా సిమెంట్స్‌ 1.49% చొప్పున లాభాలు నమోదుచేశాయి. అదానీ గ్రూప్‌ సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.16.30 లక్షల కోట్లుగా నమోదైంది. రూ.10000 కోట్ల విలువైన కాపర్‌ ప్లాంట్‌ను ప్రారంభించడం, ఒడిశాలో పోర్ట్‌ను కొనుగోలు చేయడం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో ఒప్పందం వంటి అంశాలు కలిసొచ్చాయని విశ్లేషకులు తెలిపారు.

  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 19 లాభపడ్డాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 4.81%, టాటా స్టీల్‌ 4.62%, అల్ట్రాటెక్‌ 2.17%, ఎన్‌టీపీసీ 1.88%, ఎల్‌ అండ్‌ టీ 1.66%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.52%, పవర్‌గ్రిడ్‌ 1.06%, విప్రో 1.03%, ఏషియన్‌ పెయింట్స్‌ 0.89% రాణించాయి. టైటన్‌, నెస్లే, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ 1.76% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో స్థిరాస్తి 4.18%, టెలికాం 3.44%, లోహ 3.39%, కమొడిటీస్‌ 2.91%, యుటిలిటీస్‌ 2.62%, పరిశ్రమలు 2.16% పెరిగాయి. మన్నికైన వినిమయ వస్తువులు, వాహన నీరసపడ్డాయి.  
  • సెబీ స్కోర్స్‌ కొత్త వెర్షన్‌: మదుపర్ల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సెబీ కంప్లైంట్‌ రిడ్రెస్‌ సిస్టమ్‌ (స్కోర్స్‌) కొత్త వెర్షన్‌ను సోమవారం విడుదల చేసింది. వెబ్‌ యూఆర్‌ఎల్‌ లేదా యాప్‌ ద్యారా సెక్యూరిటీల మార్కెట్‌లో మదుపర్లు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా స్కోర్స్‌ ఆన్‌లైన్‌ వ్యవస్థను 2011 జూన్‌లో సెబీ తీసుకొచ్చింది. తాజాగా ప్రారంభించిన వెర్షన్‌తో ఫిర్యాదులు నేరుగా సంబంధిత విభాగాలకు చేరుతుందని, పరిష్కార సమయం తగ్గుతుందని సెబీ తెలిపింది. పాత యాప్‌ స్థానంలో కొత్త యాప్‌ తీసుకురానున్నట్లు వివరించింది.
  • అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (ఏడీఐఏ), కోటక్‌ ఏఐఎఫ్‌ నుంచి రూ.2001 కోట్లు సమీకరించినట్లు ప్రెస్టీజ్‌ ఏస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌ వెల్లడించింది. 4 ప్రధాన నగరాల్లో గృహ ప్రాజెక్టుల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనుంది.
  • సూపర్‌మార్కెట్‌లను నిర్వహించే పటేల్‌ రిటైల్‌, తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద దరఖాస్తు చేసుకుంది. ఇష్యూలో భాగంగా 90.18 లక్షల తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)లో 10.02 లక్షల వరకు షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. మర్చంట్‌ బ్యాంకింగ్‌ వర్గాల ప్రకారం.. ఐపీఓ పరిమాణం రూ.250- 325 కోట్లుగా ఉండనుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని