ఆర్థిక స్వావలంబనే మన ధ్యేయం

వచ్చే పదేళ్లలో భారత్‌ తన ఆర్థిక స్వావలంబనను మరింత పెంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తద్వారా అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావాన్ని పరిమితం చేసుకోగలమన్నారు. రూపాయిని మారక ద్రవ్యంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదించేలా ప్రయత్నించాలని సూచించారు.

Updated : 02 Apr 2024 06:46 IST

రూపాయికి ప్రపంచవ్యాప్త ఆమోదం సాధిద్దాం
ఆర్‌బీఐ 90 వసంతాల వేడుకల్లో ప్రధాని మోదీ

ముంబయి: వచ్చే పదేళ్లలో భారత్‌ తన ఆర్థిక స్వావలంబనను మరింత పెంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తద్వారా అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావాన్ని పరిమితం చేసుకోగలమన్నారు. రూపాయిని మారక ద్రవ్యంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదించేలా ప్రయత్నించాలని సూచించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 90వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం స్మారక నాణేన్ని విడుదల చేసిన అనంతరం మోదీ ఏమన్నారంటే..

ప్రపంచ వృద్ధికి భారతే ఇంజిన్‌..: ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంలో ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎమ్‌పీసీ) పాత్రను ప్రశంసించాల్సిందే. దేశీయంగా ధరలను ఎప్పటికప్పుడు గమనించడంతో పాటు కరోనా పరిణామాల్లోనూ ద్రవ్య స్థిరీకరణకు అడుగులు వేయడం ద్వారా, ఆర్థిక వ్యవస్థ ప్రగతిలో ఆర్‌బీఐ ఎంతో కీలకంగా వ్యవహరించింది. ప్రపంచ జీడీపీ వృద్ధిలో 15% వాటాతో భారత్‌ ఒక ఇంజిన్‌లా వ్యవహరిస్తోంది. చాలా దేశాలు ఇప్పటికీ కరోనా పరిణామాల ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటే.. మనదేశం మాత్రం వృద్ధి విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: ద్రవ్యోల్బణ నియంత్రణకు, వృద్ధికి మధ్య సమతౌల్యాన్ని పాటించడం ఏ దేశానికైనా అత్యంత ప్రధానం. ఆర్‌బీఐ ఈ విషయంలో ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచింది. రూపాయిని అన్ని దేశాలూ ఆమోదించే కరెన్సీగా తీర్చిదిద్దాలి. బ్యాంకులు, నియంత్రణ సంస్థలు.. అంతరిక్షం, పర్యాటకం వంటి సరికొత్త, సంప్రదాయ రంగాల అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉండాలి. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక కేంద్రంగా అయోధ్య మారనుందన్న నిపుణుల అంచనాలను గుర్తు చేస్తున్నాను. బలమైన బ్యాంకులుంటే, ఏ దేశంలో అయినా ప్రాజెక్టులకు నిధులు సమకూరుతాయి. ఇదే లక్ష్యంతో ఆర్‌బీఐ చర్యలున్నాయి. వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్‌ బ్యాంకింగ్‌లో సైబర్‌ భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి. కృత్రిమమేధ, బ్లాక్‌చైన్‌ వంటి సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి.

మొండి బకాయిలు తగ్గాయి: 2014లో ఆర్‌బీఐ 80 ఏళ్ల సంబరాల్లో పాల్గొన్నాను. అప్పట్లో మొండి బకాయిల తీవ్రతతో పాటు బ్యాంకింగ్‌ వ్యవస్థలో అస్థిరత ఉండేది. ఇపుడు ప్రపంచంలోనే బలమైన, స్థిరమైన బ్యాంకింగ్‌ వ్యవస్థను మనం చూస్తున్నాం. 2018లో 11.25 శాతం ఉన్న నిరర్థక ఆస్తులు 2023 సెప్టెంబరు నాటికి 3 శాతం దిగువకు వచ్చాయి. 

ఆర్‌బీఐ వల్లే అనిశ్చితికి దూరం: అంతర్జాతీయ అనిశ్చితులు, అసమతౌల్యాల నుంచి దేశం బయటపడటంలో ఆర్‌బీఐ పాత్ర ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సమావేశంలో పేర్కొన్నారు. బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్‌ సమస్యలను ఆర్‌బీఐ చాలా చక్కగా పరిష్కరిస్తోందని ప్రశంసించారు.

ఆర్థిక ప్రగతికి పునాదిగా ఉంటాం.. శక్తికాంత దాస్‌: ‘దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాది వేస్తున్నాం. వచ్చే పదేళ్లలో ఆర్‌బీఐ 100వ వార్షికోత్సవ సమయానికి మరింత స్థిరమైన, బలమైన ఆర్థిక వ్యవస్థను అందించడానికి ఆర్‌బీఐ కృషి చేస్తుంద’ని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. 1935 ఏప్రిల్‌ 1న కార్యకలాపాలు ప్రారంభించిన ఆర్‌బీఐ అప్పుడు, ఇప్పుడూ ప్రజల సంక్షేమానికే కట్టుబడి ఉందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని