సంక్షిప్త వార్తలు(8)

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) అసోచామ్‌ అధ్యక్షుడిగా సంజయ్‌ నాయర్‌ బాధ్యతలు చేపట్టారు. సోరిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌కు ఛైర్మన్‌ ఈయన.

Published : 03 Apr 2024 01:47 IST

అసోచామ్‌ అధ్యక్షుడిగా సంజయ్‌ నాయర్‌

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) అసోచామ్‌ అధ్యక్షుడిగా సంజయ్‌ నాయర్‌ బాధ్యతలు చేపట్టారు. సోరిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌కు ఛైర్మన్‌ ఈయన. అసోచామ్‌ అధ్యక్షుడిగా స్పైస్‌జెట్‌ ఛైర్మన్‌, ఎండీ అజయ్‌ సింగ్‌ పదవీ కాలం ముగియడంతో.. ఆయన స్థానంలోకి సంజయ్‌ నాయర్‌ వచ్చారు. ‘సిటీ గ్రూపులో 25 ఏళ్లు, కేకేఆర్‌లో 14 ఏళ్లు సహా అంతర్జాతీయ ఆర్థిక, కేపిటల్‌ మార్కెట్లలో నాలుగు దశాబ్దాల పని అనుభవం నాయర్‌కు ఉంది. ఆయన భార్య ఫల్గుణి నాయర్‌తో కలిపి స్థాపించిన నైకాలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా కూడా నాయర్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించేందుకు ప్రధాని మోదీ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు నేను, నా అసోచామ్‌ సహచరులు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామ’ని నాయర్‌ తెలిపారు.


దాచేపల్లిలో శ్రీ సిమెంట్‌ ప్లాంటు ప్రారంభం

హైదరాబాద్‌: శ్రీ సిమెంట్‌ లిమిటెడ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద నూతన సిమెంటు కర్మాగారాన్ని ప్రారంభించింది. రూ.2,500 కోట్ల పెట్టుబడితో 3 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. దీంతో శ్రీ సిమెంట్‌ లిమిటెడ్‌కు దేశీయంగా ఉన్న వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 56.4 మిలియన్‌ టన్నులకు పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఈ యూనిట్‌ నుంచి సిమెంటు సరఫరా చేయగలుగుతామని శ్రీ సిమెంట్‌ ఎండీ నీరజ్‌ అఖైరీ పేర్కొన్నారు. ఈ ప్లాంటులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించామని, వ్యర్థాలు, విషవాయువులను నియంత్రించే ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఇంధన పొదుపునకు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేశామన్నారు. ఈ ప్లాంటు వల్ల స్థానిక యువతకు ప్రత్యక్షంగా 700, పరోక్షంగా 1300 ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. 2028 నాటికి దేశీయంగా 80 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని శ్రీ సిమెంట్‌ నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 కొత్త ప్లాంట్లు ప్రారంభించాలనేది సంస్థ ప్రణాళిక.


వాహన సాఫ్ట్‌వేర్‌ కేంద్రం కోసం బీఎమ్‌డబ్ల్యూ, టాటా టెక్‌ జట్టు 

దిల్లీ: మన దేశంలో వాహన సాఫ్ట్‌వేర్‌, ఐటీ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోసం సంయుక్త సంస్థ(జేవీ)ను నెలకొల్పుతున్నట్లు జర్మనీకి చెందిన బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్‌, మన దేశానికి చెందిన టాటా టెక్నాలజీస్‌ ప్రకటించాయి. ఈ రెండు కంపెనీలు జేవీ ఏర్పాటు నిమిత్తం ఒప్పందంపై సంతకాలు చేశాయి. సంయుక్త సంస్థ నేతృత్వంలో పుణె, బెంగళూరు, చెన్నైలలో సాఫ్ట్‌వేర్‌, ఐటీ అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ కంపెనీలు తెలిపాయి. ప్రధాన అభివృద్ధి-కార్యకలాపాలు బెంగళూరు, పుణెల్లో ఏర్పాటు చేస్తామని.. చెన్నైలో బిజినెస్‌ ఐటీ సొల్యూషన్లపై దృష్టి సారిస్తామని వివరించాయి.  ఈ భాగస్వామ్య ఒప్పందానికి సంబంధిత అధికార వర్గాల నుంచి అనుమతులు లభించాల్సి ఉంది.  బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన సాఫ్ట్‌వేర్‌, ఐటీ కేంద్రాల అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో భాగంగా సంయుక్త సంస్థ ఉండనుంది.


రూ.20,000 కోట్ల సమీకరణకు వొడాఫోన్‌ ఐడియా ప్రయత్నాలు

వాటాదార్ల అనుమతి కోసం ఈజీఎం

దిల్లీ: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వొడాఫోన్‌ ఐడియా, సెక్యూరిటీల జారీ ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం వాటాదార్ల అనుమతి తీసుకునేందుకు అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని (ఈజీఎం) మంగళవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ)/ఇతర ఆడియో విజువల్‌ మీన్స్‌ (ఓఏవీఎం) ద్వారా నిర్వహించింది. ఓటింగ్‌ వివరాలను ప్రత్యేకంగా తెలియజేస్తామని బీఎస్‌ఈకి సమాచారం అందించింది. వొడాఫోన్‌ ఐడియాకు రూ.2.1 లక్షల కోట్ల అప్పులున్నాయి. మనుగడ కోసం భారీ యుద్ధమే చేస్తోంది. త్రైమాసికంగా భారీ నష్టాలను నమోదు చేస్తున్నా, నెల నెలా చందాదార్లు తగ్గిపోతున్నా సంస్థను నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ట్రాయ్‌ గణాంకాల ప్రకారం, గత జనవరిలో వొడాఫోన్‌ ఐడియా 15.2 లక్షల మంది వైర్‌లెస్‌ చందాదార్లను కోల్పోగా, ఇంకా 22.15 కోట్ల మంది మొబైల్‌ చందాదార్లను కలిగి ఉంది. పోటీ సంస్థలయిన జియో, ఎయిర్‌టెల్‌లతో పోలిస్తే నిర్వహణ, వినియోగదారు సగటు ఆదాయాల (ఆర్పు) మధ్య పొంతన లేని గణాంకాలను నమోదు చేస్తోంది.


దేశీయ విమాన ప్రయాణికులు 15.34 కోట్లకు

2023-24పై కాపా అంచనా

ముంబయి: దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 15.34 కోట్లకు చేరి ఉండొచ్చని విమానయాన కన్సల్టెన్సీ సంస్థ కాపా ఇండియా అంచనా వేసింది. 2023-24లో 16 కోట్ల మంది ప్రయాణించొచ్చని గతేడాది మార్చిలో అంచనా వేయగా.. దానిని 15.5 కోట్లకు గతేడాది అక్టోబరులో సవరించింది. అంతర్జాతీయ ప్రయాణికుల విషయానికొస్తే.. 2023-24లో 7 కోట్ల మంది ప్రయాణించొచ్చని గతేడాది అక్టోబరులో కాపా అంచనా వేసింది. కిందటేడాది మార్చిలో అంచనా వేసిన 7.2-7.4 కోట్లతో పోలిస్తే ఇది తక్కువే. తాజాగా ఆ సంఖ్యను మరింత తగ్గించి 6.97 కోట్లకు  పరిమితం చేసింది.


వేతనాన్ని 20% తగ్గించుకున్న పునిత్‌ గోయెంకా

దిల్లీ: కంపెనీ ఎండీ, సీఈఓ పునిత్‌ గోయెంకా తన వేతనాన్ని 20% తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మంగళవారం వెల్లడించింది. సంస్థలో చేపడుతున్న వ్యూహాత్మక, పొదుపు చర్యల్లో భాగంగా గోయెంకా ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని విభాగాల్లోనూ వ్యయాలను తగ్గించుకుని, ఉత్పాదకత పెంచుకోవాలని భావిస్తున్నట్లు ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో జీ తెలిపింది. కంపెన వార్షిక నివేదికల ప్రకారం.. 2022-23లో గోయెంకా రూ.35.07 కోట్ల వేతనం అందుకున్నారు. తన టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ సెంటర్‌(టీఐసీ)లో సిబ్బందిని సగం మేర తగ్గించినట్లు గత వారం కంపెనీ ప్రకటించింది. ఈ సెంటర్‌లో 650 మంది వరకు ఇంజినీర్లున్నట్లు సమాచారం.


స్వతంత్ర పబ్లిక్‌ కంపెనీగా జీఈ ఏరో స్పేస్‌

దిల్లీ: జీఈ ఏరోస్పేస్‌ స్వతంత్ర పబ్లిక్‌ కంపెనీగా మారింది. మంగళవారం నుంచి న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ‘జీఈ’ పేరుతో ట్రేడ్‌ కానుంది. జీఈ వెర్నోవాను విభజించిన అనంతరం జీఈ ఏరోస్పేస్‌ స్వతంత్ర పబ్లిక్‌ కంపెనీగా మారింది.  కొన్నేళ్ల నుంచీ చేపడుతూ వచ్చిన మార్పులను జీఈ విజయవంతంగా ముగించినట్లయింది. 1982 నుంచీ జీఈ ఏరోస్పేస్‌ భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌తో ఎఫ్‌414 ఇంజిన్‌ను స్థానికంగా తయారు చేయనున్నట్లు గతేడాది జూన్‌లో జీఈ ఏరోస్పేస్‌ ప్రకటించింది కూడా. తాజా పరిణామాలతో జీఈకి జీఈ ఏరోస్పేస్‌, జీఈ వెర్నోవా, జీఈ హెల్త్‌కేర్‌ టెక్నాలజీస్‌ అనే మూడు స్వతంత్ర, పబ్లిక్‌ కంపెనీలు ఉన్నట్లయింది.


ఆసియా సొసైటీ ఇండియా ఛైర్‌పర్సన్‌గా సంగీతా జిందాల్‌

హైదరాబాద్‌: ఆసియా సొసైటీ ఇండియా సెంటర్‌ బోర్డు కొత్త ఛైర్‌పర్సన్‌గా సంగీతా జిందాల్‌ నియమితులయ్యారు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చింది. జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్‌కు ఛైర్‌పర్సన్‌గా ఉన్న సంగీత, దేశంలోని పలు ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, జీవనోపాధి ఏర్పాటు తదితరాల కోసం కృషి చేశారు. ఆసియా సొసైటీని దేశంలో మరింత విస్తరించేందుకు సంగీత తోడ్పడతారని ఆసియా సొసైటీ ఇండియా సెంటర్‌ సీఈఓ ఐనాక్షి సోబ్తి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని