పోలియో టీకా కోసం భారత్‌ బయోటెక్‌, బెల్తోవెన్‌ బయోలాజికల్స్‌ భాగస్వామ్యం

పోలియో టీకాల ఉత్పత్తి, పంపిణీ నిమిత్తం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌,  నెదర్లాండ్స్‌లోని  సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అనుబంధ సంస్థ బిల్తోవెన్‌ బయోలాజికల్స్‌ సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Published : 03 Apr 2024 01:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: పోలియో టీకాల ఉత్పత్తి, పంపిణీ నిమిత్తం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌,  నెదర్లాండ్స్‌లోని  సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అనుబంధ సంస్థ బిల్తోవెన్‌ బయోలాజికల్స్‌ సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా మనదేశంలో పోలియో టీకా ఉత్పత్తికి అనుమతులు తీసుకుని, ప్రపంచ మార్కెట్లకు సరఫరా చేస్తాయి. బిల్తోవెన్‌ బయోలాజికల్స్‌ నెదర్లాండ్స్‌ నుంచి టీకా ముడిపదార్థాలు (డ్రగ్‌ సబ్‌స్టన్సెస్‌) అందిస్తుంది. మనదేశంలో ఎన్నో దశాబ్దాలుగా జాతీయ టీకాల కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా పోలియో టీకాలు ఇస్తోంది. ఈ టీకాను మనదేశ అవసరాలకే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలకు భారత్‌ బయోటెక్‌ అందిస్తోందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల వివరించారు. బిల్తోవెన్‌ బయోలాజికల్స్‌తో ఒప్పందం వల్ల పోలియో టీకాను అన్ని దేశాలకు స్థిరంగా సరఫరా చేసే అవకాశం ఏర్పడుతుందన్నారు. పోలియో వ్యాధిని పూర్తిగా నివారించాలనేది తమ లక్ష్యమని, దానికి అనుగుణంగా టీకాను ప్రపంచ వ్యాప్తంగా అందించడానికి అవసరమైన మద్దతు ఈ భాగస్వామ్యంతో తమకు లభిస్తుందని  సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని