ద్విచక్ర వాహన విక్రయాలు భళా

హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) మార్చిలో దేశీయంగా 3,58,151 ద్విచక్ర వాహనాలు టోకుగా విక్రయించింది.

Published : 03 Apr 2024 01:51 IST

దిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) మార్చిలో దేశీయంగా 3,58,151 ద్విచక్ర వాహనాలు టోకుగా విక్రయించింది. 2023 ఇదే నెలలో కంపెనీ డీలర్లకు సరఫరా చేసిన 1,97,542 వాహనాలతో పోలిస్తే, ఇవి 81% ఎక్కువ. వాహన ఎగుమతులు 14,460 నుంచి 95%  పెరిగి 28,304కు చేరాయి. మొత్తం విక్రయాలు 2,12,002 నుంచి 3,86,455కు చేరాయి. 2022-23లో సంస్థ 43,50,967 వాహనాలను విక్రయించగా, 2023-24లో 48,93,522 వాహనాలను అమ్మింది.

  • బజాజ్‌ ఆటో: బజాజ్‌ ఆటో గత నెలలో ఎగుమతులతో కలిపి మొత్తం 3,65,904 వాహనాలను టోకుగా విక్రయించింది. 2023 మార్చిలో అమ్మిన 2,91,567 వాహనాలతో పోలిస్తే ఇవి 25% అధికం. మొత్తం దేశీయ విక్రయాలు (వాణిజ్య వాహనాలతో కలిపి) 1,86,522 నుంచి 18% వృద్ధితో 2,20,393కు చేరాయి. మొత్తం ఎగుమతులు 1,05,045 నుంచి 39% పెరిగి 1,45,511 వాహనాలకు చేరాయి. 2023-24లో మొత్తం 43,50,933 వాహనాలను సంస్థ విక్రయించింది. 2022-23లో విక్రయించిన 39,27,857 వాహనాలతో పోలిస్తే ఇవి 11% అధికం. దేశీయంగా డీలర్లకు సరఫరాలు 21,06,617 నుంచి 29% పెరిగి 27,14,723 వాహనాలకు చేరాయి. ఎగుమతులు 18,21,240 నుంచి 10% తగ్గి 16,36,210కు పరిమితమయ్యాయి.
  • ఆడి ఇండియా: విలాస కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 7,027 రిటైల్‌ వాహన విక్రయాలను నమోదు చేసింది. 2022-23లో  కంపెనీ విక్రయించిన 5,275 వాహనాలతో పోలిస్తే ఈ సంఖ్య 33% అధికం. 2024 జనవరి-మార్చిలో 1,046 వాహనాలను సంస్థ విక్రయించింది. 2023 ఇదే సమయంలో కంపెనీ 1,950 వాహనాలను అమ్మింది. సరఫరా చైన్‌లో అంతరాయాల వల్లే, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విక్రయాలపై ప్రభావం పడిందని కంపెనీ వెల్లడించింది.
  • 7% తగ్గిన అశోక్‌ లేలాండ్‌ అమ్మకాలు: హిందుజా గ్రూప్‌ సంస్థ అశోక్‌ లేలాండ్‌ వాహన విక్రయాలు ఈ ఏడాది మార్చిలో 7% తగ్గి 21,317కు పరిమితమయ్యాయి. 2023 ఇదే నెలలో సంస్థ 22,885 వాహనాలను విక్రయించింది. గత నెలలో విక్రయించిన వాటిలో 14,517 వాహనాలు మధ్య, భారీ వాణిజ్య వాహనాలు కాగా, 6,800 తేలికపాటి వాణిజ్య వాహనాలని కంపెనీ పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి చూస్తే మొత్తం విక్రయాలు 1,80,916 నుంచి 1% పెరిగి 1,82830కు చేరాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని