దుమ్మురేపిన పబ్లిక్‌ ఇష్యూలు

గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) పబ్లిక్‌ఇష్యూలు దుమ్మురేపాయి. ప్రధాన ఫ్లాట్‌ఫామ్‌పై 76 కంపెనీలు తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు రాగా.. రూ.62,000 కోట్లు సమీకరించాయి.

Published : 03 Apr 2024 01:52 IST

2023-24లో రూ.62,000 కోట్ల సమీకరణ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్ల అంచనా!

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) పబ్లిక్‌ఇష్యూలు దుమ్మురేపాయి. ప్రధాన ఫ్లాట్‌ఫామ్‌పై 76 కంపెనీలు తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు రాగా.. రూ.62,000 కోట్లు సమీకరించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23)లో పబ్లిక్‌ ఇష్యూల ద్వారా సమీకరించిన రూ.52,115 కోట్లతో పోలిస్తే ఈ విలువ 19% ఎక్కువ. ఆ ఏడాది 37 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. స్టాక్‌ మార్కెట్ల రాణింపు, చిన్న మదుపర్ల నుంచి విశేష స్పందన వల్లే గత ఆర్థిక సంవత్సరంలో ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ పెరిగిందని పంటోమత్‌ ఫైనాన్షియల్‌ గ్రూపు తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2024-25) ఇదే జోరు కొనసాగొచ్చనే అంచనాలు ఉన్నాయని పేర్కొంది. ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ రూ.1 లక్ష కోట్లను మించొచ్చని పంటోమత్‌ ఫైనాన్షియల్‌ గ్రూపు మేనేజింగ్‌ డైరెక్టరు మహావీర్‌ లునావత్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రతికూలతల ప్రభావం లేకుంటే, ఈ విలువ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పంటోమత్‌ నివేదిక ప్రకారం.నీ 2023-24లో పలు రంగాల కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. సాధారణంగా ఐపీఓల్లో ఆర్థిక రంగం హవా ఉంటుంది. కానీ ఈసారి ఈ రంగం నుంచి ఐపీఓకు వచ్చిన కంపెనీలు రూ.9,655 కోట్లే సమీకరించాయి. 2023-24లో మొత్తం నిధుల సమీకరణలో ఈ విలువ ఐదొంతులు లోపే ఉండటం గమనార్హం. 2022-23లో ఇది 51 శాతంగా ఉంది.

  •  కొత్త తరం సాంకేతికత రంగం నుంచి 3 కంపెనీలే- యాత్రా, మామాఎర్త్‌, జాగిల్‌- పబ్లిక్‌ ఇష్యూకు వచ్చాయి.
  • ఐపీఓ అనంతరం స్టాక్‌ మార్కెట్లో కంపెనీల షేర్లు నమోదయ్యాక... తొలి రోజు అవి సగటున 29%  ప్రతిఫలం పంచాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రతిఫలం 9 శాతమే. కొత్త షేర్లలో 70% లేదా 55 కంపెనీల షేర్లు ఇప్పటికే ఇష్యూ ధరకు ఎగువనే ట్రేడవుతుండటం గమనార్హం.
  • ఐపీఓలకు చిన్న మదుపర్ల నుంచి వచ్చిన దరఖాస్తుల సంఖ్య సగటున 13 లక్షలకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 60 లక్షలే. స్టాక్‌ మార్కెట్లలో నమోదు అనంతరం షేర్లు ఆకర్షణీయ పనితీరు కనబర్చడం వల్లే చిన్న మదుపర్ల నుంచి ఐపీఓలకు బలమైన మద్దతు లభించడానికి కారణమైంది.
  • ప్రైమ్‌డేటా బేస్‌ గణాంకాల ప్రకారం.. చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్‌ఎమ్‌ఈ) ప్లాట్‌ఫామ్‌పై 200 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చాయి. ఇవి మొత్తంగా రూ.5,838 కోట్లు సమీకరించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 125 కంపెనీలు రూ.2,235 కోట్లు సమీకరించాయి. అంటే దాదాపుగా రెట్టింపునకు పైగానే ఎస్‌ఎమ్‌ఈ ప్లాట్‌ఫామ్‌పై నిధుల సమీకరణ జరగడం గమనార్హం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని