మన స్టాక్‌ మార్కెట్‌పై మదుపర్లలో ఆశావాదం

మన స్టాక్‌ మార్కెట్లపై విదేశీ మదుపర్లకు ఉన్న ఆశావాదం, విశ్వాసం కారణంగానే క్యాపిటల్‌ మార్కెట్లు అధిక విలువలు కలిగి ఉన్నాయని సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌ మంగళవారం వెల్లడించారు.

Published : 03 Apr 2024 01:56 IST

సెబీ ఛైర్‌పర్సన్‌ మాధవి పురి బచ్‌

ముంబయి: మన స్టాక్‌ మార్కెట్లపై విదేశీ మదుపర్లకు ఉన్న ఆశావాదం, విశ్వాసం కారణంగానే క్యాపిటల్‌ మార్కెట్లు అధిక విలువలు కలిగి ఉన్నాయని సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌ మంగళవారం వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సూచీల సగటు కంటే మన మార్కెట్‌లో పీఈ (ప్రైస్‌ టు ఎర్నింగ్‌) నిష్పత్తి అధికంగా (22.2%) ఉందని తెలిపారు. ‘కొంతమంది మన మార్కెట్‌ అధిక విలువల వద్ద ఉందని అంటున్నారు. అయినా పెట్టుబడులు ఎందుకొస్తున్నాయి చెప్పండి? మన మార్కెట్లపై ఆశావాదంతో పాటు నమ్మకం కూడా అంతర్జాతీయ మదుపర్లలో ఉంద’ని కార్పొరేట్‌ పాలనపై భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సెబీ ఛైర్‌పర్సన్‌ వెల్లడించారు. కొన్ని వారాల కిందట మన మార్కెట్లలో చిన్న, మధ్య స్థాయి షేర్ల విలువలు మరీ అధిక స్థాయులకు చేరాయని, ఇవి నీటి బుడగలా మారొచ్చని మాధబి ఆందోళన వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. తన వృత్తి ధర్మంలో భాగంగా విదేశీ మదుపర్లతో తరచూ సమావేశాల్లో పాల్గొంటానని, వారు భారత్‌పై అమితాసక్తి ప్రదర్శిస్తున్నారని, మన దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి సాధిస్తుండటం వారికి బాగా నచ్చుతోందని మాధబి తెలిపారు. దీంతో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మన మార్కెట్‌ విలువ  రూ.378 లక్షల కోట్లకు పైగా చేరిందన్నారు. సరిగ్గా పదేళ్ల కిందట ఇది రూ.74 లక్షల కోట్లుగా ఉండగా, ఇప్పుడు జీడీపీ స్థాయికి చేరిందని వివరించారు. భారతీయ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ, బాండ్ల జారీతో మార్కెట్ల నుంచి రూ.10.5 లక్షల కోట్లు సమీకరించాయని తెలిపారు.

పారదర్శకతే నమ్మకానికి పునాది: ‘క్యాపిటల్‌ మార్కెట్ల భవితవ్యం అంతా నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. వ్యవస్థల్లో పారదర్శకతే దానికి పునాది’ అని మాధబి అభిప్రాయపడ్డారు. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థగా సెబీ, వాటాదార్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటుందని పేర్కొన్నారు. మార్కెట్లనే కాదు... మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా నమ్మకంపైనే ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. నమ్మకం అనేది రెండు వైపులా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని