ఐటీ, ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లలో లాభాల స్వీకరణ

మూడు రోజుల సూచీల వరుస లాభాలకు మంగళవారం అడ్డుకట్ట పడింది. బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో కొన్ని ఐటీ, ప్రైవేట్‌ బ్యాంకులు, వాహన షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు.

Published : 03 Apr 2024 02:01 IST

సమీక్ష

మూడు రోజుల సూచీల వరుస లాభాలకు మంగళవారం అడ్డుకట్ట పడింది. బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో కొన్ని ఐటీ, ప్రైవేట్‌ బ్యాంకులు, వాహన షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. విదేశీ అమ్మకాలు ఇందుకు తోడయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు తగ్గి 83.42 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 1.61% లాభంతో 88.83 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ ఉదయం 74,022.30 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. ఒకదశలో 73,743.77 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరి, చివరకు 110.64 పాయింట్ల నష్టంతో 73,903.91 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 8.70 పాయింట్లు తగ్గి 22,453.30 దగ్గర స్థిరపడింది.

  • మార్చిలో విక్రయాలు 25% పెరగడంతో బజాజ్‌ ఆటో షేరు ఇంట్రాడేలో 3.48% పెరిగి రూ.9,356 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2.61% లాభంతో రూ.9,276.65 వద్ద ముగిసింది.
  • దేశవ్యాప్తంగా సిమెంట్‌ బస్తా ధరలను రూ.10-15 మేర కంపెనీలు పెంచడంతో ఆయా కంపెనీల షేర్లు మెరిశాయి. ఏసీసీ 4.09%, దాల్మియా భారత్‌ 1.51%, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.84%, శ్రీ సిమెంట్‌ 0.12% చొప్పున పెరిగాయి.
  • మధురా ఫ్యాషన్‌ను ప్రత్యేక కంపెనీగా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయనున్నట్లు ప్రకటించడంతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ షేరు 11.55% దూసుకెళ్లి రూ.236.15 వద్ద ముగిసింది.
  • రెండో రోజూ అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల జోరు కొనసాగింది. అదానీ పవర్‌ 5%, అదానీ విల్మర్‌ 4.15%, ఏసీసీ 4.09%, ఎన్‌డీటీవీ 2.81%, అంబుజా 2.09%, అదానీ పోర్ట్స్‌ 2.02%, అదానీ టోటల్‌ 0.65%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 0.51%, అదానీ గ్రీన్‌ 0.30% పెరిగాయి.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 16 నష్టపోయాయి. కోటక్‌ బ్యాంక్‌ 1.84%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.82%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.63%, ఇన్ఫోసిస్‌   0.84%, టీసీఎస్‌ 0.83% మేర డీలాపడ్డాయి. ఎం అండ్‌ ఎం 2.95%, నెస్లే 1.42%, టాటా మోటార్స్‌ 1.23%, ఎస్‌బీఐ 1.21%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌    1.19% లాభపడ్డాయి.
  • ఆస్తుల నగదీకరణపై రూ.40,314 కోట్ల సమీకరణ: 2023-24 ఆర్థిక సంవత్సరంలో పలు పద్ధతుల్లో ఆస్తుల నగదీకరణ ప్రక్రియ ద్వారా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ     రూ.40,314 కోట్లు సమీకరించింది. ప్రభుత్వం విధించుకున్న రూ.28,968 కోట్ల లక్ష్యం కంటే ఇది అధికం. 2022-23లో ఇలా సమీకరించిన మొత్తం రూ.32,855 కోట్లుగా ఉంది.  
  • దేశంలో విస్తరణ ప్రణాళికల్లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఫ్లేవర్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు రూ.1,266 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పెప్సికో ఇండియా వెల్లడించింది. ప్లాంట్‌ నిర్మాణం ఈ ఏడాదిలో మొదలై, 2026 మొదటి త్రైమాసికంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
  •  గతేడాది విమానాల లీజు సంస్థ నార్డిక్‌ ఏవియేషన్‌ క్యాపిటల్‌తో కుదిరిన సెటిల్‌మెంట్‌లో భాగంగా త్వరలో క్యూ400 విమానాన్ని అందుకోనున్నట్లు  స్పైస్‌జెట్‌ తెలిపింది.
  • టీఏసీ ఇన్ఫోసెక్‌ ఐపీఓ చివరి రోజు ముగిసేసరికి 392.56 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 20,23,200 షేర్లను ఆఫర్‌ చేయగా, 79,42,29,600 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.  
  • అమెరికా కంపెనీ, సంయుక్త సంస్థ భాగస్వామి స్టేట్‌ స్ట్రీట్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌తో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అనుబంధ సంస్థ హెచ్‌సీఎల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ యూకే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సంయుక్త సంస్థలో మొత్తం 49% వాటాను విక్రయించనుంది.
  • అల్ట్రాటెక్‌ 2 కొత్త ప్లాంట్‌లు: రెండు గ్రే సిమెంట్‌ తయారీ ప్లాంట్‌లను ప్రారంభించినట్లు అల్ట్రాటెక్‌ సిమెంట్‌ వెల్లడించింది. దీంతో కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 151.6 మిలియన్‌ టన్నులకు చేరింది. తమిళనాడు కరూర్‌లో 2.70 మి.టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌ను, ఛత్తీస్‌గఢ్‌ కుకురిడ్‌లో 2.70 మి.టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన సమీకృత సిమెంట్‌ ప్లాంట్‌ను కంపెనీ ప్రారంభించింది.

నిఫ్టీ లాట్‌ పరిమాణం తగ్గింపు

నిఫ్టీ 50 డెరివేటివ్‌ కాంట్రాక్టుల లాట్‌ పరిమాణాన్ని ఎన్‌ఎస్‌ఈ సగానికి తగ్గించింది. ప్రస్తుతం ఉన్న నిఫ్టీ 50 లాట్‌ పరిమాణాన్ని 50 నుంచి 25 చేసింది. ఫిన్‌నిఫ్టీ లాట్‌ పరిమాణం 40 నుంచి 25కు, మిడ్‌క్యాప్‌ నిఫ్టీ లాట్‌ పరిమాణం 75 నుంచి 50కు చేరింది. బ్యాంక్‌ నిఫ్టీ లాట్‌ 15 లో మార్పులు చేయలేదు. నిఫ్టీ-50 లాట్‌ పరిమాణంలో మార్పులు ఏప్రిల్‌ 26 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఫిన్‌ నిఫ్టీలో మార్పులు ఈ ఏడాది జులై 30 నుంచి, మిడ్‌క్యాప్‌ నిఫ్టీలో మార్పులు జులై 29 నుంచి అమలు కానున్నాయి.


కంపెనీలకు వరుస పన్ను డిమాండ్‌లు

  •  నాందేడ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్‌ నుంచి రూ.5.51 కోట్ల పన్ను డిమాండ్‌ను యునైటెడ్‌ స్పిరిట్స్‌ అందుకుంది. ఇందులో రూ.2.99 కోట్ల వడ్డీ కలిపి ఉంది.
  •  సేవా పన్ను డిమాండ్‌, జరిమానా ఆదేశాల కింద రూ.184 కోట్లు చెల్లించాల్సిందిగా జొమాటో నోటీసులు అందుకుంది. 2014 అక్టోబరు-2017 జూన్‌ మధ్య కాలానికి ఈ నోటీసులు వచ్చాయి.
  •  ఆదాయపు పన్ను విభాగం నుంచి రూ.46 కోట్ల డిమాండ్‌ నోటీసులు అందుకున్నట్లు స్థిరాస్తి సంస్థ శోభా వెల్లడించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని