రక్షణ రంగ తయారీ కళకళ

రక్షణ రంగానికి చెందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌), గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,350 కోట్ల టర్నోవర్‌ సాధించింది.

Published : 03 Apr 2024 02:05 IST

ఉత్పత్తులకు అనూహ్య గిరాకీ
పెరుగుతున్న ఎగుమతులు
కంపెనీలకు అధిక ఆదాయాలు, లాభాలు
ఈనాడు - హైదరాబాద్‌

క్షణ రంగానికి చెందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌), గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,350 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఈ సంస్థ చేతిలో ప్రస్తుతం రూ.19,468 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. ఇందులో ఎగుమతి ఆర్డర్లే రూ.2,500 కోట్ల వరకు ఉండటం గమనార్హం. కేవలం బీడీఎల్‌ మాత్రమే కాదు.. రక్షణ రంగానికి చెందిన పలు సంస్థలు ఇటీవల కాలంలో అధికంగా ఆదాయాలు, లాభాలు నమోదు చేస్తున్నాయి. పెద్దఎత్తున ఆర్డర్లు సంపాదించడమే ఇందుకు నేపథ్యం. ఇటువంటి సానుకూలత గతంలో లేదు. మనదేశం రక్షణ పరికరాల కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడేది. కొన్ని దశాబ్దాల పాటు మన సైన్యానికి అవసరమైన ఆయుధాలు, ఆయుధ సామగ్రి, యుద్ధ విమానాలు, ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాలు, యుద్ధ నౌకలను రష్యా, ఇజ్రాయెల్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ వచ్చాం. దీనికి భిన్నమైన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది.

రూ.21,000 కోట్లకు పైగా ఎగుమతులు

నాలుగైదేళ్లుగా రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతులు వేగంగా పెరుగుతున్నాయి. 2023-24లో మనదేశం నుంచి రూ.21,083 కోట్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయి. 2022-23లో రక్షణరంగ ఎగుమతులు రూ.15,918 కోట్లు కావడం గమనార్హం. రక్షణ దళాలకు అవసరమైన పరికరాల కోసం దిగుమతులపై  అధికంగా ఆధారపడిన మనదేశం, ఈ విధంగా ఎగుమతులు చేసేలా మారుతుందని ఎవరూ ఊహించి ఉండరు. రక్షణ రంగానికి చెందిన దేశీయ సంస్థలు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, విదేశీ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడానికి తోడు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఈ మార్పునకు వీలుకల్పించాయని సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి.

వివిధ దేశాలకు సరఫరా

మనదేశం నుంచి రక్షణ ఉత్పత్తులు వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈజిప్టు, ఇటలీ, యూఏఈ, భూటాన్‌, ఇథియోపియా, సౌదీ అరేబియా తదితర దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. సమీప భవిష్యత్తులో గల్ఫ్‌ దేశాలకు మనదేశం నుంచి రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్లు జెఫ్రీస్‌ అనే అగ్రశ్రేణి కన్సల్టెన్సీ సేవల సంస్థ తాజాగా వివరించింది. అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్‌.. వంటి దేశాల నుంచి గల్ఫ్‌ దేశాలు ఏటా 11 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 91,500 కోట్ల)కు పైగా ఆయుధాలు, ఆయుధ సామగ్రి దిగుమతి చేసుకుంటున్నాయి. భవిష్యత్తులో ఆ దేశానికి రక్షణ పరికరాలు భారతదేశం నుంచీ ఎగుమతి అయ్యే అవకాశం ఉందని జెఫ్రీస్‌ పేర్కొంది. దేశీయ అవసరాలు తీర్చుతూనే, ఎగుమతులపై దృష్టి సారించడం వల్లే మనదేశంలోని రక్షణ రంగ సంస్థలకు అనూహ్య వృద్ధి అవకాశాలు అందివస్తున్నాయి. ప్రస్తుతం ఆయుధ సామగ్రి, క్షిపణులు, గస్తీ నౌకలను ఎగుమతి చేస్తుండగా, భవిష్యత్తులో యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను సైతం ఎగుమతి చేసే పరిస్థితి వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ సంస్థలకు భారీ ఆర్డర్లు

ఈ నేపథ్యంలో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌, బీఈఎల్‌, మజ్‌గావ్‌ షిప్‌యార్డ్‌, బీడీఎల్‌, కొచిన్‌ షిప్‌యార్డ్‌, ఎల్‌అండ్‌టీ, భారత్‌ ఫోర్జ్‌ .. వంటి అగ్రశ్రేణి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలతో పాటు చిన్న, మధ్యస్థాయి రక్షణ రంగ సంస్థలకూ ఆర్డర్లు పెరుగుతున్నాయి. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థలు అధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. మిధాని, బీడీఎల్‌తో పాటు, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, బీఈఎల్‌ యూనిట్లతో ప్రైవేటు రంగంలో అస్త్ర మైక్రోవేవ్‌, భారత్‌ ఫోర్జ్‌ అనుబంధ సంస్థలు, ఎన్నో అంకుర సంస్థలు ఇక్కడ ఉన్నాయి. రక్షణ ఉత్పత్తుల రంగం విస్తరించడం, ఎగుమతి అవకాశాలు పెరగడం వల్ల ఈ సంస్థలకు అధిక ఆదాయాలు, లాభాలు నమోదు చేసే అవకాశం లభిస్తోంది. కొన్నేళ్ల పాటు రక్షణ రంగ సంస్థలు ఆకర్షణీయ వృద్ధి నమోదు చేస్తాయని జెఫ్రీస్‌ విశ్లేషించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని