సంక్షిప్త వార్తలు

పైలట్ల సమస్యల పరిష్కారానికి బుధవారం విస్తారా ఉన్నతాధికారులు సమావేశమై కొత్త కాంట్రాక్టులు, రోస్టరింగ్‌ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

Published : 04 Apr 2024 01:46 IST

పైలట్ల సమస్య పరిష్కారానికి విస్తారా యాజమాన్యం చర్చలు!

దిల్లీ: పైలట్ల సమస్యల పరిష్కారానికి బుధవారం విస్తారా ఉన్నతాధికారులు సమావేశమై కొత్త కాంట్రాక్టులు, రోస్టరింగ్‌ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సవరించిన వేతన విధానాన్ని వ్యతిరేకిస్తూ.. కొంత మంది పైలట్లు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. తగినంత సంఖ్యలో పైలట్లు అందుబాటులో లేకపోవడంతో గత రెండు రోజుల్లోనే 100కి పైగా విమానాలను విస్తారా రద్దు చేసింది. బుధవారం సుమారు 26 విమానాలను రద్దు చేసినట్లు ఈ పరిణామాన్ని దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలు తెలిపాయి. మరోవైపు విమానాల రద్దు, ఆలస్యంపై రోజువారీ నివేదికను సమర్పించాల్సిందిగా విస్తారాకు విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ సూచించింది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి పైలట్లతో విస్తారా సీఈఓ వినోద్‌ కన్నన్‌ సహా ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మానవ వనరుల విభాగం, ఇతర విభాగం అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే సమావేశ వివరాలకు సంబంధించి కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. విమాన సర్వీసుల నిర్వహణ తిరిగి సాధారణ స్థితికి వస్తోందని, విమానాల రద్దు సంఖ్య కూడా తగ్గుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.


సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ అరుదైన ఘనత

దిల్లీ: జపాన్‌ వాహన దిగ్గజం సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ దేశీయంగా 3 కోట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించింది. ఈ ఘనత సాధించిన రెండో విపణిగా భారత్‌ నిలిచింది. 2024 మార్చికి సుజుకీ అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా దేశంలో 3 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. 1983 డిసెంబరులో కంపెనీ దేశంలో ఉత్పత్తిని ప్రారంభించగా.. 40 ఏళ్ల నాలుగు నెలల్లో 3 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది.  జపాన్‌ రికార్డు అయిన 55 ఏళ్ల 2 నెలలను భారత్‌ బద్దలు కొట్టింది. సుజుకీ, భారత ప్రభుత్వం సంయుక్త సంస్థ మారుతీ ఉద్యోగ్‌ దేశంలో మారుతీ 800 మోడల్‌తో ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రస్తుతం మారుతీ సుజుకీ ఇండియాకు గురుగ్రామ్‌, మనేసర్‌ (హరియాణా), హన్సల్‌పుర్‌ (గుజరాత్‌)ల్లో ప్లాంట్‌లు ఉన్నాయి.


ఇండిగోతో మలేసియా ఎయిర్‌లైన్స్‌ కోడ్‌షేర్‌ ఒప్పందం

ఇండిగోతో కోడ్‌షేర్‌ భాగస్వామ్యం కోసం ప్రాథమిక ఒప్పందాన్ని మలేసియా ఎయిర్‌లైన్స్‌ కుదుర్చుకుంది. భారత్‌, మలేసియాల మధ్య విమాన ప్రయాణ అనుసంధానం పెరిగేందుకు ఇది దోహదం చేయనుంది. అలాగే ఇరు విమానయాన సంస్థలకూ ఈ ఒప్పందం ప్రయోజనం కలుగుతుందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌తో విమానయాన అనుసంధానాన్ని మలేసియా ఎయిర్‌లైన్స్‌ బలోపేతం చేసుకుంటుందని పేర్కొంది. మలేసియా ఎయిర్‌లైన్స్‌కు ఉన్న విస్తృత నెట్‌వర్క్‌ ద్వారా ఆగ్నేయాసియాలోని మరిన్ని గమ్యస్థానాలను ఇండిగో తన ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చే వీలుంటుందని పేర్కొంది. ప్రస్తుతం మలేసియా ఎయిర్‌లైన్స్‌ భారత్‌లోని తొమ్మిది ప్రధాన నగరాలు- దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, అమృత్‌సర్‌, త్రివేండ్రం-కు వారంలో 71 విమాన సర్వీసులను నడుపుతోంది.


ఆసుపత్రి బిల్లులకు రుణం: కెనరా బ్యాంక్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆసుపత్రి బిల్లును చెల్లించేప్పుడు ఎదురయ్యే నిధుల కొరతను తీర్చేందుకు ప్రత్యేక రుణ పథకాన్ని కెనరా బ్యాంక్‌ తీసుకొచ్చింది. ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి ఉన్న బీమా పాలసీకి మించి బిల్లు అయినప్పుడు మిగతా మొత్తాన్ని ‘కెనరా హీల్‌’ రుణం రూపంలో సమకూరుస్తుంది. పాలసీదారుడు, అతనిపై ఆధారపడిన వారికీ ఈ రుణం అందుబాటులో ఉంటుందని కెనరా బ్యాంక్‌ వెల్లడించింది. ఈ అప్పుపై వార్షిక చలన వడ్డీ రేటు 11.25 శాతం, స్థిర వడ్డీ రేటు 12.30 శాతంగా ఉంటుందని తెలిపింది. మహిళల కోసం ప్రత్యేకంగా ‘కెనరా ఏంజెల్‌’ పేరుతో పొదుపు ఖాతానూ తీసుకొచ్చింది. క్యాన్సర్‌ కేర్‌ పాలసీ, ముందస్తుగా మంజూరైన వ్యక్తిగత రుణం కెనరా రెడీక్యాష్‌, టర్మ్‌ డిపాజిట్లపై ఆన్‌లైన్‌లోనే రుణం తీసుకునే వెసులుబాటుతో కెనరా మై మనీలాంటివి ఇందులో అందిస్తోంది. పొదుపు ఖాతాను ప్రారంభించేందుకు ఎలాంటి రుసుములూ ఉండవని పేర్కొంది. ఇప్పటికే ఖాతా ఉన్న మహిళలూ దీనికి మారొచ్చని తెలిపింది. దీంతోపాటు యూపీఐ చెల్లింపులను సులభంగా చేసేందుకు ‘123పే ఏఎస్‌ఐ’ని ప్రారంభించింది. ఆర్‌బీఐ ఇన్నోవేషన్‌ హబ్‌ సహకారంతో స్వయం సహాయక బృందాలకు ఇంటివద్దే డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను అందిస్తోన్న తొలి బ్యాంకుగా కెనరా బ్యాంకు నిలిచిందని వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని