దేశీయంగా తొలి వాణిజ్య చమురు నిల్వ కేంద్రం!

చమురు దిగుమతి, వినియోగపరంగా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న భారత్‌.. తన మొట్టమొదటి వాణిజ్య ముడి చమురు వ్యూహాత్మక నిల్వ కేంద్రాన్ని అభివృద్ధి చేసుకునే యోచనలో ఉంది.

Published : 04 Apr 2024 01:51 IST

బిడ్‌లను ఆహ్వానించిన ఐఎస్‌పీఆర్‌ఎల్‌

దిల్లీ: చమురు దిగుమతి, వినియోగపరంగా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న భారత్‌.. తన మొట్టమొదటి వాణిజ్య ముడి చమురు వ్యూహాత్మక నిల్వ కేంద్రాన్ని అభివృద్ధి చేసుకునే యోచనలో ఉంది. చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ముందస్తు జాగ్రత్త కోసం ఈ నిల్వ కేంద్రాలను భారత్‌ ఏర్పాటు చేసుకుంటోంది. ఇందుకోసం ఇండియన్‌ స్ట్రాటజిక్‌ పెట్రోలియమ్‌ రిజర్వ్స్‌ లిమిటెడ్‌ (ఐఎస్‌పీఆర్‌ఎల్‌) అనే ప్రత్యేక సంస్థను నెలకొల్పింది. దేశంలో పెట్రోలియమ్‌ నిల్వ కేంద్రాల అభివృద్ధి, నిర్వహణ బాధ్యతను ఇది చూసుకుంటోంది. ఇప్పటికే తొలి విడతలో మొత్తంగా 5.33 మిలియన్‌ టన్నుల నిల్వ సామర్థ్యమున్న మూడు భూగర్భ వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలను ఐఎస్‌పీఆర్‌ఎల్‌ అభివృద్ధి చేసింది. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (1.33 మిలియన్‌ టన్నులు), కర్ణాటకలోని మంగళూరు (1.5 మిలియన్‌ టన్నులు), పాడూర్‌లో (2.5 మిలియన్‌ టన్నులు) ఉన్నాయి. ఇప్పుడు రెండో విడతలో వాణిజ్య వ్యూహత్మక పెట్రోలియమ్‌ నిల్వ కేంద్రాన్ని అభివృద్ధి చేసే యోచనలో  ఉంది. పాడూర్‌ వద్ద 2.5 మి.టన్నుల చమురు నిల్వ సామర్థ్యమున్న భూగర్భ (అండర్‌గ్రౌండ్‌) నిల్వ కేంద్రాన్ని రూ.5,514 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు బిడ్‌లను ఆహ్వానించింది.

పీపీపీ విధానంలో అభివృద్ధి..: మొదటి విడతలో ప్రభుత్వ వ్యయంతో నిల్వ కేంద్రాలను నిర్మించగా.. రెండో విడతలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో ఈ వాణిజ్య పెట్రోలియమ్‌ నిల్వ కేంద్రాన్ని నిర్మించనుంది. పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలే నిల్వ కేంద్రం డిజైన్‌, అభివృద్ధి, రుణం, నిర్వహణ బాధ్యతలు చూస్తాయి. నిల్వ కేంద్రం అభివృద్ధికి ఎంత మేర రుణం గ్రాంట్‌ కింద అవసరం అవుతుందో లేదా ప్రభుత్వానికి ఆఫర్‌ చేసే ప్రీమియం/ రుసుము ఎంతో తెలియజేస్తూ బిడ్‌ వేయాల్సిందిగా బిడ్డర్‌లకు ఐఎస్‌పీఆర్‌ఎల్‌ తెలిపింది. అత్యధిక ప్రీమియంను బిడ్‌గా వేసిన వారికి ప్రాజెక్టును అప్పగిస్తారు. ఒకవేళ ఎవరూ ప్రీమియంను ఆఫర్‌ చేయకుంటే.. తక్కువ గ్రాంటును కోరిన వారికి ప్రాజెక్టు వెళ్తుంది. ప్రాజెక్టు కోసం గరిష్ఠంగా రూ.3,308 కోట్ల వరకు మాత్రమే గ్రాంటు కోసం బిడ్‌ వేయొచ్చు. గ్రాంటు కోరుకునే వాళ్లు ప్రీమియంను ఆఫర్‌ చేయకూడదు. ఈ నిల్వ కేంద్రాన్ని చమురు నిల్వ కోసం ఏ చమురు కంపెనీ అయినా అద్దెకు తీసుకోవచ్చు. ఇందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో నిల్వ చేసే ముడి చమురును దేశీయ రిఫైనరీలకూ విక్రయించొచ్చు. అత్యవసర సమయంలో చమురు వినియోగంపై భారత్‌కే తొలి హక్కు ఉంటుంది. బిడ్‌ల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్‌ 22 కాగా.. జూన్‌ 27 కల్లా ప్రాజెక్టును అప్పగిస్తారు. పాడూర్‌లో ఏర్పాటు చేయనున్న ఈ నిల్వ కేంద్రం కోసం ఐఎస్‌పీఆర్‌ఎల్‌ సుమారు 215 ఎకరాలను కొనుగోలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని