రెండో రోజూ నష్టాలే

వరుసగా రెండో రోజూ సూచీలు నష్టాలు చవిచూశాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్‌, వాహన షేర్లకు లాభాల స్వీకరణ ఎదురైంది.

Published : 04 Apr 2024 01:52 IST

సమీక్ష

వరుసగా రెండో రోజూ సూచీలు నష్టాలు చవిచూశాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్‌, వాహన షేర్లకు లాభాల స్వీకరణ ఎదురైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు తగ్గి 83.45 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.31% లాభంతో 88.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ ఉదయం 73,757.23 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా ఒడుదొడుకుల మధ్య కదలాడిన సూచీ, 73,540.27 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు 27.09 పాయింట్ల నష్టంతో 73,876.82 వద్ద ముగిసింది. నిఫ్టీ 18.65 పాయింట్లు తగ్గి 22,434.65 దగ్గర స్థిరపడింది.

  • గుజరాత్‌లో 2000 మెగావాట్‌ల సౌరశక్తి ప్లాంట్‌ను ప్రారంభించడంతో అదానీ పవర్‌ షేరు 5 శాతం దూసుకెళ్లి 52 వారాల గరిష్ఠమైన రూ.617.75 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.11,339.4 కోట్లు పెరిగి రూ.2.38 లక్షల కోట్లకు చేరింది.
  • ఎస్‌ఆర్‌ఎమ్‌ కాంట్రాక్టర్స్‌ షేర్లు సూచీల్లో శుభారంభం చేశాయి. బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.210తో పోలిస్తే 7.14% లాభంతో రూ.225 వద్ద నమోదైంది. చివరకు  12.48% లాభంతో రూ.236.20 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ  రూ.541.94 కోట్లుగా నమోదైంది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 16 డీలాపడ్డాయి. నెస్లే 2.73%, కోటక్‌ బ్యాంక్‌ 1.43%, టైటన్‌ 1.16%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.14%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.08%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.06% నష్టపోయాయి. ఎన్‌టీపీసీ 1.97%, టీసీఎస్‌ 1.67%, టెక్‌ మహీంద్రా   1.56%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.51%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.41%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.40% లాభపడ్డాయి.  
  • సెక్యూరిటీల జారీ ద్వారా రూ.20,000 కోట్ల వరకు సమీకరించాలన్న ప్రతిపాదనకు వొడాఫోన్‌ ఐడియా వాటాదార్లు ఆమోదం తెలిపారు.
  • ఈ ఏడాది సెప్టెంబరుకు జిందాల్‌ కోక్‌లో ఉన్న మొత్తం 26 శాతం వాటాను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ వెల్లడించింది. మొదటి విడతలో 4.87 శాతం షేర్లను రూ.36.49 కోట్లకు జేఎస్‌ఎల్‌ ఓవర్‌సీస్‌కు విక్రయించింది. ఇదే సమయంలో స్పెయిన్‌ సంస్థ ఇబెర్‌జిందాల్‌లో మెజారిటీ వాటాను జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ కొనుగోలు చేసింది.
  • భారత్‌లో వృద్ధి చెందేందుకు బడ్జెట్‌, ఎకానమీ బ్రాండ్‌లను తీసుకొచ్చేందుకు అమెరికా సంస్థ వైంధామ్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ సన్నాహాలు చేస్తోంది. 2025కు దేశంలో 150 ఆస్తులను కూడగట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
  • వినియోగదారుల కోసం మార్పులు చేసిన లాయల్టీ పథకం ‘ఫ్లైయింగ్‌ రిటర్న్స్‌’ను ఎయిరిండియా తీసుకొచ్చింది. సులభమైన విధానం, మరిన్ని ఆకర్షణీయమైన ప్రోత్సాహాకాలు, ప్రయోజనాలు అందిస్తున్నట్లు తెలిపింది.
  • 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి రూ.2,033 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ చెల్లించినట్లు పీఎఫ్‌సీ వెల్లడించింది.  
  • భారత్‌ ఫోర్జ్‌ వైస్‌ ఛైర్మన్‌, సంయుక్త ఎండీగా అమిత్‌ కల్యాణీ నియమితులయ్యారు. ప్రస్తుత కంపెనీ ఛైర్మన్‌, ఎండీ బాబాసాహెబ్‌ ఎన్‌ కల్యాణీకి ఆయన కుమారుడు.
  • ఏప్రిల్‌ 8 నుంచి క్యాష్‌, ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ విభాగాల్లో నాలుగు కొత్త సూచీలను తీసుకురానున్నట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) వెల్లడించింది. ఈ కొత్త సూచీలు నిఫ్టీ టాటా గ్రూప్‌ 25% క్యాప్‌, నిఫ్టీ500 మల్టీక్యాప్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ 50:30:20, నిఫ్టీ500 మల్టీక్యాప్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 50:30:20, నిఫ్టీ మిడ్‌స్మాల్‌ హెల్త్‌కేర్‌గా ఉన్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని