అంబానీ 9.. అదానీ 17

ప్రపంచంలో అగ్రగామి 10 మంది సంపన్నుల్లో రిలయన్స్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చోటు దక్కించుకున్నారు. భారత్‌లో అత్యంత ధనవంతుడిగా మరోసారి నిలిచారు. ఫోర్బ్స్‌ 2024 ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం.. 116 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో ముకేశ్‌ అంబానీ ప్రపంచంలో 9వ స్థానంలో నిలిచారు.

Updated : 04 Apr 2024 08:15 IST

ఫోర్బ్స్‌ 2024 సంపన్నుల జాబితా
డబుల్‌ సెంచరీకి చేరిన భారత ధనవంతులు

దిల్లీ: ప్రపంచంలో అగ్రగామి 10 మంది సంపన్నుల్లో రిలయన్స్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చోటు దక్కించుకున్నారు. భారత్‌లో అత్యంత ధనవంతుడిగా మరోసారి నిలిచారు. ఫోర్బ్స్‌ 2024 ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం.. 116 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో ముకేశ్‌ అంబానీ ప్రపంచంలో 9వ స్థానంలో నిలిచారు. 2023లో ఆయన సంపద 83.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక భారత్‌లో రెండో సంపన్నుడైన గౌతమ్‌ అదానీ 17వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 47.2 బిలియన్‌ డాలర్ల నుంచి 84 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. అమెరికా షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక తర్వాత గతేడాది అదానీ సంపద 47.2 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది.

  • జాబితాలో 2,781 మంది సంపన్నులు చోటు దక్కించుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 141 పెరిగింది. వీరి మొత్తం సంపద 2023తో పోలిస్తే 2 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 2024లో 14.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. జాబితాలో మూడింట రెండొంతుల మంది సంపద వృద్ధి చెందగా, నాలుగింట ఒక వంతు సంపన్నుల ఆస్తి తగ్గింది.
  • ఫ్రాన్స్‌ విలాస వస్తువుల దిగ్గజం ఎల్‌వీఎంహెచ్‌ అధిపతి బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 233 బిలియన్‌ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. మస్క్‌ (195 బి.డాలర్లు), అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ (194 బి.డాలర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌(177 బి.డాలర్లు) నాలుగో స్థానంలో ఉన్నారు.
  • ఫోర్బ్స్‌ 2024 జాబితాలో 813 మంది అమెరికన్‌లు చోటు దక్కించుకున్నారు. చైనా నుంచి 473 మంది ఉన్నారు. భారత సంపన్నుల సంఖ్య 31 పెరిగి 200కి చేరింది.
  • హెచ్‌సీఎల్‌ టెక్‌ సహవ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌  36.9 బిలియన్‌ డాలర్లతో 39వ స్థానంలో ఉన్నారు. జిందాల్‌ గ్రూప్‌ సావిత్రి జిందాల్‌-కుటుంబం (33.5     బి.డాలర్లు) 46వ స్థానంలో, సన్‌ఫార్మా దిలీప్‌ సంఘ్వి (26.7 బి.డాలర్లు) 69వ స్థానంలో నిలిచారు. సైరస్‌ పూనావాలా (21.3 బి.డాలర్లు) 90వ స్థానం, కుషాల్‌ పాల్‌ సింగ్‌ (20.9 బి.డాలర్లు) 92వ స్థానం, కుమార్‌ బిర్లా (19.7 బి.డాలర్లు) 98వ స్థానం దక్కించుకున్నారు.

(1 బిలియన్‌ డాలర్లు= సుమారు రూ.8,300 కోట్లు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని