విశాఖ సహా మరో 14 విమానాశ్రయాల్లో డిజి యాత్ర

విశాఖపట్నం సహా మరో 14 విమానాశ్రయాల్లో డిజియాత్ర సేవలు ఈ నెలాఖరుకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విమాన ప్రయాణికులు సులభంగా రాకపోకలు చేసేందుకు వీలుగా ఈ విధానంలో మరిన్ని మార్పులు చేసినట్లు డిజియాత్ర ఫౌండేషన్‌ సీఈఓ సురేశ్‌ ఖడక్‌భవి పేర్కొన్నారు.

Updated : 12 Apr 2024 08:38 IST

దిల్లీ: విశాఖపట్నం సహా మరో 14 విమానాశ్రయాల్లో డిజియాత్ర సేవలు ఈ నెలాఖరుకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విమాన ప్రయాణికులు సులభంగా రాకపోకలు చేసేందుకు వీలుగా ఈ విధానంలో మరిన్ని మార్పులు చేసినట్లు డిజియాత్ర ఫౌండేషన్‌ సీఈఓ సురేశ్‌ ఖడక్‌భవి పేర్కొన్నారు. త్వరలో డిజియాత్ర సేవలు అందుబాటులోకి రానున్న విమానాశ్రయాల్లో విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూర్‌, శ్రీనగర్‌, త్రివేండ్రం బాగ్‌డోగ్రా, భువనేశ్వర్‌, చండీగఢ్‌, డబోలిమ్‌, ఇండోర్‌, మంగళూర్‌, పట్నా, రాయ్‌పూర్‌, రాంచీ ఉన్నాయి. ముఖ గుర్తింపు సాంకేతికత (ఎఫ్‌ఆర్‌టీ) ద్వారా పనిచేసే డిజియాత్రతో విమానాశ్రయాల్లో పలు చెక్‌ పాయింట్ల వద్ద ప్రయాణికులు సులభంగా ముందుకు వెళ్లొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌ సహా దేశంలోని 14 విమానాశ్రయాల్లో దేశీయ ప్రయాణికులకు ఈ సేవలు అందుబాటులో ఉండగా, ఈ సదుపాయాన్ని దాదాపు 50 లక్షల మంది వినియోగిస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ సేవలను కల్పించేందుకు భాగస్వాములతో చర్చలు జరుగుతున్నాయి. 2022లో డిజియాత్ర సేవలు ప్రారంభమయ్యాయి. డిజియాత్రకు ఆదరణ పెరుగుతున్నా, ప్రయాణికుల డేటా గోప్యతపై పలు వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, వినియోగదారుల డేటా మొత్తం వారి చేతిలోని మొబైల్‌ ఫోన్‌లో మాత్రమే ఉంటుందని సురేశ్‌ వెల్లడించారు.

ఇదీ అమలు ప్రక్రియ

డిజియాత్రలో ప్రయాణికులు ఇచ్చే డేటా ఎన్‌క్రిప్టెడ్‌ రూపంలో నిల్వ అవుతుంది. ఈ సేవలను పొందాలంటే ప్రయాణికులు ఆధార్‌ ధ్రువీకరణ, స్వీయ చిత్రం ద్వారా డిజియాత్ర యాప్‌పై వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం బోర్డింగ్‌ పాస్‌ను స్కాన్‌ చేస్తే, ఆ వివరాలు విమానాశ్రయానికి చేరతాయి. ప్రయాణికులు విమానాశ్రయం ఇ-గేట్‌ వద్దకు వచ్చి, బార్‌కోడ్‌ కలిగిన బోర్డింగ్‌ పాస్‌ను స్కాన్‌ చేస్తే, ముఖగుర్తింపు వ్యవస్థ సాయంతో ప్రయాణికుల గుర్తింపు, ప్రయాణ పత్రాలను ధ్రువీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఇ-గేట్‌ ద్వారా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు. సెక్యూరిటీ చెక్‌తో పాటు, విమానం ఎక్కేందుకు సాధారణ నియమావళిని ప్రయాణికులు పాటించాలి.

డిజియాత్ర ఫౌండేషన్‌లో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో పాటు హైదరాబాద్‌, కోచి, బెంగళూరు, దిల్లీ, ముంబయి విమానాశ్రయాల నిర్వహణ సంస్థలు సభ్యులుగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని