సంక్షిప్త వార్తలు

యెస్‌ బ్యాంక్‌లో మెజార్టీ వాటా కొనుగోలు చేసేందుకు జపాన్‌కు చెందిన మిత్సుబిషీ యూఎఫ్‌జే ఫైనాన్షియల్‌ గ్రూపు (ఎంయూఎఫ్‌జే), సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్‌ కార్ప్‌ (ఎస్‌ఎంబీసీ) ఆసక్తి కనబర్చినట్లు తెలుస్తోంది.

Published : 13 Apr 2024 03:04 IST

యెస్‌ బ్యాంక్‌పై జపాన్‌ సంస్థల ఆసక్తి!

దిల్లీ: యెస్‌ బ్యాంక్‌లో మెజార్టీ వాటా కొనుగోలు చేసేందుకు జపాన్‌కు చెందిన మిత్సుబిషీ యూఎఫ్‌జే ఫైనాన్షియల్‌ గ్రూపు (ఎంయూఎఫ్‌జే), సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్‌ కార్ప్‌ (ఎస్‌ఎంబీసీ) ఆసక్తి కనబర్చినట్లు తెలుస్తోంది. ఇందు కోసం బిడ్‌ వేసే అంశాన్ని ఆ సంస్థలు పరిశీలిస్తున్నట్లు ఈ పరిణామాన్ని దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలు తెలిపాయి. మధ్యప్రాచ్య ప్రాంతానికి చెందిన మరో కంపెనీ కూడా యెస్‌బ్యాంక్‌పై ఆసక్తి కనబర్చినట్లు చెబుతున్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా నేతృత్వంలోని బృందం యెస్‌బ్యాంక్‌లో తన వాటాను విక్రయించేందుకు మార్గాలు అన్వేషిస్తున్న నేపథ్యంలో ఈ వార్తలు వచ్చాయి. వీటిపై  యెస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఎస్‌ఎంబీసీ స్పందించలేదు. ఎంయూఎఫ్‌జే ప్రతినిధి కూడా స్పందించేందుకు నిరాకరించారు.


మరో రెండు ‘స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌’ దరఖాస్తుల తిరస్కరణ

ముంబయి: స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎఫ్‌బీ) ఏర్పాటుకు అనుమతి కోరుతూ దాఖలైన వాటిలో మరో 2 దరఖాస్తులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తిరస్కరించింది. ద్వారా క్షేత్రీయ గ్రామీణ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, టాలీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఎస్‌ఎఫ్‌బీ ఏర్పాటుకు సూత్రప్రాయ అంగీకారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు శుక్రవారం ఆర్‌బీఐ తెలిపింది. 2023 జులైలో 3 దరఖాస్తులను ఆర్‌బీఐ పక్కనపెటింది. 2022 మేలో 6 దరఖాస్తులపై ఆర్‌బీఐ తన నిర్ణయాన్ని తెలిపింది. యూనివర్సల్‌ బ్యాంక్‌లు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల ఏర్పాటుకు ఆసక్తి చూపుతూ 12  వరకు సంస్థలు దరఖాస్తు చేశాయి. ప్రైవేటు రంగంలో బ్యాంకులు, ఎస్‌ఎఫ్‌బీల లైసెన్సులకు మార్గదర్శకాలు 2016 ఆగస్టు 1,  2019 డిసెంబరు 5న జారీ అయ్యాయి.  ఇంకా రెండు దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.


4 నెలల గరిష్ఠానికి పారిశ్రామికోత్పత్తి
ఫిబ్రవరిలో 5.7% 

దిల్లీ: దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి ఫిబ్రవరిలో 4 నెలల గరిష్ఠమైన 5.7 శాతంగా నమోదైంది. గనుల రంగం రాణించడం ఇందుకు కారణం. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధిని లెక్కిస్తారు. 2023 ఫిబ్రవరిలో ఇది 6.2 శాతంగా ఉంది. గతేడాది అక్టోబరులో 11.9 శాతంగా నమోదైన ఐఐపీ, నవంబరులో 2.5 శాతానికి నెమ్మదించింది. డిసెంబరులో 4.2 శాతంగా, 2024 జనవరిలో 4.1 శాతంగా నమోదైంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) లెక్కల ప్రకారం..

  • 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 5.9 శాతంగా నమోదైంది. 2022-23 ఏప్రిల్‌- ఫిబ్రవరిలో నమోదైన 5.6 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువే.
  • తయారీ రంగ ఉత్పత్తి వృద్ధి ఈ ఏడాది ఫిబ్రవరిలో 5 శాతంగా ఉంది. 2023 ఫిబ్రవరిలోని 5.9 శాతం కంటే ఇది తక్కువ. విద్యుదుత్పత్తి వృద్ధి కూడా 8.2% నుంచి 7.5 శాతానికి పరిమితమైంది. గనుల ఉత్పత్తి వృద్ధి 4.8% నుంచి 8 శాతానికి పెరిగింది. భారీ యంత్ర పరికరాల రంగ ఉత్పత్తి వృద్ధి 11% నుంచి 1.2 శాతానికి తగ్గింది.

ఆహార పదార్థాల డెలివరీలోకి టాటా న్యూ

దిల్లీ: ఆహార పదార్థాల డెలివరీ కార్యకలాపాల్లోకి టాటా డిజిటల్‌ యాప్‌ ‘టాటా న్యూ’ ప్రవేశించింది. ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ) ప్లాట్‌ఫామ్‌ ద్వారా దిల్లీ- ఎన్‌సీఆర్‌, బెంగళూరులలో ఈ సేవలు ప్రారంభించిన సంస్థ, వచ్చే వారం కల్లా మరో 3 మెట్రో నగరాలకు విస్తరిస్తామని, మే మధ్య కల్లా దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని చెబుతోంది. వినియోగదార్లు తమ యాప్‌ను అధికంగా వినియోగించేలా చూసేందుకు ఆహార పదార్థాల డెలివరీ సేవలు తోడ్పడతాయన్నది కంపెనీ ఉద్దేశం. ఓఎన్‌డీసీకి అనుసంధానం కావడం వల్ల.. యాప్‌లోని ఇతర ఉత్పత్తులు- దుస్తులు, ఆభరణాలు, సరుకులు, ఎలక్ట్రానిక్స్‌ లాంటి అమ్మకాలూ పెరుగుతాయని టాటా న్యూ భావిస్తోంది.  ఓఎన్‌డీసీ అనుసంధానం నిమిత్తం జొమాటో పెట్టుబడులున్న మ్యాజిక్‌పిన్‌తో టాటా న్యూ కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం టాటా న్యూకు సాంకేతిక సేవలను అందించే సంస్థగా మ్యాజిక్‌ పిన్‌ ఉంది. ఇంతకుమునుపు పేటీఎం, ఓలా సంస్థలూ ఓఎన్‌డీసీకి అనుసంధానం అయ్యేందుకు మ్యాజిక్‌పిన్‌ సహకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు