ఫోర్డ్‌ బ్రాంకో స్పోర్ట్‌ వాహనాల్లో గ్యాసోలిన్‌ లీక్‌ వ్యవహారంపై దర్యాప్తు

వాహన సంస్థ ఫోర్డ్‌ తయారు చేస్తున్న బ్రాంకో స్పోర్ట్‌ ఎస్‌యూవీ నుంచి గ్యాసోలిన్‌ లీక్‌ అవుతుందనే కారణంతో వాహనాలను వెనక్కి పిలిపించి, కంపెనీ మరమ్మతు చేపట్టినా.. ఆ సమస్య పరిష్కారం కాదనే భావనలు వెలువడటంతో, అమెరికా వాహన భద్రతా సంస్థ దర్యాప్తును ప్రారంభించింది.

Published : 13 Apr 2024 03:47 IST

డెట్రాయిట్‌: వాహన సంస్థ ఫోర్డ్‌ తయారు చేస్తున్న బ్రాంకో స్పోర్ట్‌ ఎస్‌యూవీ నుంచి గ్యాసోలిన్‌ లీక్‌ అవుతుందనే కారణంతో వాహనాలను వెనక్కి పిలిపించి, కంపెనీ మరమ్మతు చేపట్టినా.. ఆ సమస్య పరిష్కారం కాదనే భావనలు వెలువడటంతో, అమెరికా వాహన భద్రతా సంస్థ దర్యాప్తును ప్రారంభించింది. ఇంజిన్‌ ఇంజెక్టర్ల పగుళ్ల నుంచి గ్యాసోలిన్‌ లీక్‌ అవుతుండటం వల్ల ఇంజిన్‌ కాలిపోయే ప్రమాదం ఉందని భావించి ఈ కార్లను ఫోర్డ్‌ వెనక్కి పిలిపించింది. 2022, 2023 మోడళ్లకు చెందిన బ్రాంకో స్పోర్ట్‌ ఎస్‌యూవీలు, 2022 మోడల్‌ ఎస్కేప్‌ ఎస్‌యూవీలు కలిపి మొత్తంగా 43,000 వాహనాలను వెనక్కి పిలిచింది. ఇవ్వన్నీ కూడా 1.5 లీటరు ఇంజిన్‌తో కూడిన వాహనాలే. ‘ఇంధన లీకేజీ సమస్య పరిష్కారం కోసం చేపట్టిన మరమ్మతు సరిపోతుందా? లేదా.. తదుపరి భద్రతాపరంగా ఎలాంటి పర్యవసనాలు చోటుచేసుకోవచ్చు’ అనే అంశంపై దర్యాప్తు సాగనుందని నేషనల్‌ హైవే ట్రాఫిక్‌ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ) పేర్కొంది. ఫోర్డ్‌ కంపెనీ తన వాహనాలను రీకాల్‌ చేసిన రెండో రోజులకే, దర్యాప్తునకు ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ సిద్ధమవ్వడం గమనార్హం. లీక్‌ అయిన ఇంధనం, ఇంజిన్‌ విభాగంలోని హాట్‌ సర్ఫేస్‌కు వెళ్లకుండా ఒక డ్రెయిన్‌ ట్యూబ్‌ను అమర్చనున్నట్లు ఫోర్డ్‌ తెలిపింది. పగుళ్లు ఉన్న ఇంజిన్‌ ఇంజెక్టర్లను మార్చకుండా.. కేవలం డ్రెయిన్‌ను అమర్చడం వల్ల సమస్యకు పరిష్కారం చూపినట్లు కాదని ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ తెలిపింది. ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ చేపడుతున్న దర్యాప్తునకు సహకరిస్తున్నామని ఫోర్డ్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని