25% మంది మహిళా ఉద్యోగులు అసంతృప్తిగానే

బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా రంగంలో (బీఎఫ్‌ఎస్‌ఐ) లింగ వైవిధ్యం చూపేందుకు, మహిళా నియామకాలను ప్రోత్సహించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. ప్రతి నలుగురు మహిళా ఉద్యోగుల్లో ఒకరు (25%) తమకు గుర్తింపు, వేతనం, పని ప్రదేశంలో సమానత్వం విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు ఓ నివేదిక తెలిపింది.

Published : 13 Apr 2024 03:54 IST

బీఎఫ్‌ఎస్‌ఐపై గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ ఇండియా నివేదిక

దిల్లీ: బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా రంగంలో (బీఎఫ్‌ఎస్‌ఐ) లింగ వైవిధ్యం చూపేందుకు, మహిళా నియామకాలను ప్రోత్సహించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. ప్రతి నలుగురు మహిళా ఉద్యోగుల్లో ఒకరు (25%) తమకు గుర్తింపు, వేతనం, పని ప్రదేశంలో సమానత్వం విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు ఓ నివేదిక తెలిపింది. పని ప్రదేశం మదింపు, గుర్తింపు సంస్థ గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌ ఇండియా ఈ నివేదిక రూపొందించింది. 167 సంస్థల్లోని 12 లక్షల మంది ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించి, ఈ నివేదిక నిర్వహించినట్లు సంస్థ పేర్కొంది. దీని ప్రకారం..

  • బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో ఇప్పటికీ లింగ వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి. స్త్రీ- పురుష సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు, మహిళల నియామకాలను పెంచేందుకు మరింతగా దృష్టి సారించాలి.
  • పనిప్రదేశంలో సమానత్వం విషయంలో మగవారితో పోలిస్తే మహిళా ఉద్యోగులు 5% తక్కువ సంతృప్తితో ఉన్నారు.
  • జెన్‌ జెడ్‌ (1997- 2012 మధ్య జన్మించిన వాళ్లు), మిలీనియల్స్‌ (1981- 1996 మధ్య జన్మించిన వాళ్లు) ఉద్యోగుల మధ్య అభిప్రాయాల్లోనూ వ్యత్యాసాలు ఉన్నట్లు నివేదిక గుర్తించింది. ముఖ్యంగా దీర్ఘకాలం పాటు ఉద్యోగంలో కొనసాగడం, తాము చేస్తున్న పని ఉద్దేశం, ఉద్యోగ భద్రత విషయంలో వీరి అభిప్రాయాల్లో తేడాలు ఉన్నట్లు తెలిపింది. తమ హోదాకు అర్థవంతమైన పని కోరుకుంటున్న వాళ్లు జెన్‌ జెడ్‌ ఉద్యోగుల్లో 21%, మిలీనియల్స్‌లో 15% మంది ఉన్నారు.
  • ఆర్థిక సాంకేతికత, ఆరోగ్య, సాధారణ బీమా, పెట్టుబడుల విభాగాల్లో ఉద్యోగంపై నమ్మకం తగ్గినట్లు నివేదిక తెలిపింది. మిలియనీల్‌, జెన్‌ జెడ్‌ మేనేజర్లలో వారి పదవీకాలం ప్రారంభంలోనే ఉద్యోగ నమ్మకం తగ్గడం అధికంగా ఉందని పేర్కొంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని