మార్కెట్లకు అమెరికా ద్రవ్యోల్బణ సెగలు

అమెరికాలో మార్చి నెల ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదుకావడంతో, జూన్‌లో వడ్డీ రేట్ల కోతలు ఉండకపోవచ్చన్న భయాలు పెరిగాయి.

Published : 13 Apr 2024 03:56 IST

రూ.2.52 లక్షల కోట్ల సంపద ఆవిరి
సమీక్ష

మెరికాలో మార్చి నెల ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదుకావడంతో, జూన్‌లో వడ్డీ రేట్ల కోతలు ఉండకపోవచ్చన్న భయాలు పెరిగాయి. ఫలితంగా మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. అక్కడి మార్కెట్లతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పైనా ఈ ప్రభావం పడింది. శుక్రవారం దేశీయ సూచీలు 1 శాతం వరకు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 83.38 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.95% పెరిగి 90.56 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో టోక్యో మినహా మిగతావి నష్టపోయాయి. ఐరోపా సూచీలు సానుకూలంగా ట్రేడయ్యాయి.

సూచీల నష్టాలతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.2.52 లక్షల కోట్లు తగ్గి రూ.399.67 లక్షల కోట్లకు పరిమితమైంది.

సెన్సెక్స్‌ ఉదయం 74,889.64 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. అమ్మకాలు స్థిరంగా కొనసాగడంతో ఏదశలోనూ కోలుకోలేకపోయిన సూచీ, 74,189.31 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 793.25 పాయింట్ల నష్టంతో 74,244.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 234.40 పాయింట్లు కోల్పోయి 22,519.40 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,503.75- 22,726.45 పాయింట్ల మధ్య కదలాడింది.

  •  రూ.8000 కోట్ల మధ్యవర్తిత్వ పరిహారం లభించే తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టడంతో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేరు పతనం కొనసాగింది. శుక్రవారం మరో 13.02% క్షీణించిన షేరు రూ.197.80 వద్ద ముగిసింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 26 నష్టపోయాయి. సన్‌ఫార్మా 4.01%, మారుతీ 3.17%, పవర్‌గ్రిడ్‌ 2.57%, టైటన్‌ 2.40%, ఎల్‌ అండ్‌ టీ 2.04%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.96%, టెక్‌ మహీంద్రా 1.91%, అల్ట్రాటెక్‌  1.76%, ఎస్‌బీఐ 1.57%, ఐటీసీ 1.56%, ఇన్ఫోసిస్‌  1.44%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.40% డీలాపడ్డాయి. టాటా మోటార్స్‌, నెస్లే, టీసీఎస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ స్వల్పంగా లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో చమురు-గ్యాస్‌ 1.28%, యుటిలిటీస్‌ 1.02%, స్థిరాస్తి 0.96%, బ్యాంకింగ్‌ 0.91%, కమొడిటీస్‌ 0.84%, ఐటీ 0.84%, ఆర్థిక సేవలు 0.81% నీరసపడ్డాయి. బీఎస్‌ఈలో 2448 షేర్లు నష్టాల్లో ముగియగా, 1405 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 90 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
  • అదరగొట్టిన భారతీ హెగ్జాకామ్‌: భారతీ ఎయిర్‌టెల్‌ అనుబంధ సంస్థ భారతీ హెగ్జాకామ్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్లలో శుభారంభం చేశాయి. ఇష్యూ ధర రూ.570తో పోలిస్తే, షేరు 32.49% లాభంతో రూ.755.20 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 54.36% దూసుకెళ్లి రూ.879.90 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 42.76% లాభంతో రూ.813.75 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.40,687.50 కోట్లుగా నమోదైంది.
  • వొడాఫోన్‌ ఐడియా రూ.18,000 కోట్ల ఎఫ్‌పీఓ: టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) ద్వారా రూ.18,000 కోట్ల వరకు సమీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఎఫ్‌పీఓ ఈనెల 18న ప్రారంభమై 22న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.10- 11 నిర్ణయించింది. 2020లో యెస్‌ బ్యాంక్‌ రూ.15,000 కోట్ల ఎఫ్‌పీఓ తర్వాత వస్తున్న అతిపెద్ద ఎఫ్‌పీఓ ఇదే కావడం గమనార్హం. వొడాఫోన్‌ ఐడియా ఎఫ్‌పీఓలో 800 మిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు జీక్యూజీ పార్టనర్స్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జీక్యూజీ 500 మి.డాలర్లు, ఎస్‌బీఐ ఎంఎఫ్‌ 200-300 మి.డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు రూ.12.96 వద్ద ముగిసింది.
  • కెప్టెన్‌ జీఆర్‌ గోపినాథ్‌కు చెందిన డెక్కన్‌ చార్టర్స్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా ఎన్‌సీఎల్‌టీ బెంగళూరు బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై జాతీ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఈ నెల 26 వరకు స్టే విధించింది. రూ.10 కోట్ల బకాయిలపై క్రోన్‌ ఫిన్‌స్టాక్‌ దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది.

జీవనకాల గరిష్ఠానికి ఫారెక్స్‌ నిల్వలు

ఏప్రిల్‌ 5తో ముగిసిన వారానికి మన విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు 2.98 బి.డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) పెరిగి జీవనకాల గరిష్ఠమైన 648.562 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.53.85 లక్షల కోట్ల)కు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. అంతక్రితం వారం ఫారెక్స్‌ నిల్వలు 645.583 బి.డాలర్లుగా ఉన్నాయి. సమీక్షిస్తున్న వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 549 మి.డాలర్లు అధికమై 571.166 బి.డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి నిల్వలు 2.398 బి.డాలర్లు పెరిగి 54.558 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు (ఎస్‌డీఆర్‌లు) 24 మిలియన్‌ డాలర్లు పెరిగి 18.17 బిలియన్‌ డాలర్లకు చేరగా, ఐఎంఎఫ్‌ వద్ద దేశ నిల్వల స్థానం 9 మిలియన్‌ డాలర్లు అధికమై 4.669 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని