రూ.40 లక్షల కోట్లకు.. మన స్థిరాస్తి రంగం

భారతీయ స్థిరాస్తి రంగం మార్కెట్‌ పరిమాణం 2015 నుంచి 73% వృద్ధి చెంది, ప్రస్తుతం  రూ.40.48 లక్షల కోట్ల (482 బిలియన్‌ డాలర్లు) స్థాయికి చేరింది.

Published : 13 Apr 2024 03:58 IST

సీఐఐ-నైట్‌ఫ్రాంక్‌ నివేదిక

దిల్లీ: భారతీయ స్థిరాస్తి రంగం మార్కెట్‌ పరిమాణం 2015 నుంచి 73% వృద్ధి చెంది, ప్రస్తుతం  రూ.40.48 లక్షల కోట్ల (482 బిలియన్‌ డాలర్లు) స్థాయికి చేరింది. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), స్థిరాస్తి సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఉమ్మడిగా ‘ఇండియా రియల్‌ ఎస్టేట్‌: ఎ డికేడ్‌ ఫ్రమ్‌ నౌ’ పేరిట విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. 2034 నాటికి మార్కెట్‌ పరిమాణం 1,487 బి.డాలర్ల (సుమారు రూ. 123.42 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని అంచనా వేసింది. నిర్మాణ, సేవలు, నివాస, వాణిజ్య విభాగాల ఉత్పత్తుల విలువ 2015లో 279 బి.డాలర్లు (సుమారు రూ23.15 లక్షల కోట్లు)గా ఉంది. 2024 నాటికి ఇది 482 బి.డాలర్ల (సుమారు రూ.40 లక్షల కోట్ల)కు చేరింది. ‘అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ తోడ్పాటుతో, స్థిరాస్తి రంగం గణనీయంగా రాణించింది’ అని  నివేదిక వివరించింది. భారతీయ స్థిరాస్తి రంగం దాదాపు 250 అనుబంధ పరిశ్రమలతో కలిసి పనిచేస్తోందని తెలిపింది.

ఉపాధి కల్పనలో 18% వాటా: వ్యవసాయ రంగం తర్వాత దేశీయంగా అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో స్థిరాస్తి ఒకటి. ఉపాధి కల్పనలో స్థిరాస్తి రంగం వాటా 18% వరకు ఉందని నివేదిక తెలిపింది. మొత్తం ఆర్థిక వ్యవస్థలో దీని వాటా ప్రస్తుతం 7.3% కాగా, 2034 నాటికి ఇది 10.5 శాతానికి చేరుతుందని అంచనా వేసింది.

విస్తరణకు కారణాలివీ: స్థిరాస్తి మార్కెట్‌ పరిణామం పెరగడానికి ప్రధాన కారణం నివాస గృహాలకు, కార్యాలయాల స్థలాలకు గిరాకీ పెరగడం, విస్తరిస్తున్న ఆతిథ్య, రిటైల్‌ రంగాలని నివేదిక వివరించింది.

నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా రీసెర్చ్‌, అడ్వైజరీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గులామ్‌ జియా మాట్లాడుతూ.. రాబోయే దశాబ్దంలో భారత్‌ ఆర్థికంగా ఎంతో వృద్ధి సాధిస్తుందని, దీనికి స్థిరాస్తి రంగం కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. 2034 నాటికి 1,50,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.124.50 లక్షల కోట్ల) స్థాయికి ఈ రంగం విలువ చేరుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదాయంలో వృద్ధి, వినియోగదారుల ఖర్చు చేసే సామర్థ్యం పెరగడం, మౌలిక వసతుల అభివృద్ధి, భారత్‌లో తయారీ వంటివి ఈ రంగం వృద్ధికి దోహదం చేస్తాయని వివరించారు.

2034 నాటికి నివాస గృహాల మార్కెట్‌ విలువ 906 బి.డాలర్ల (సుమారు రూ.75.20 లక్షల కోట్ల)కు చేరుకుంటుందని, ఆఫీసు రంగం 125 బి.డాలర్ల (సుమారు రూ.10.38 లక్షల కోట్ల)కు చేరుకుంటుందని అంచనాలున్నాయని నివేదిక అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని