వినువీధుల్లో 15.4 కోట్ల మంది విహారం

దేశంలో విమాన ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. 2022-23తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ప్రయాణికుల రద్దీ 13% పెరిగి 15.4 కోట్లకు చేరినట్లు ఇక్రా తాజా  నివేదికలో పేర్కొంది.

Published : 13 Apr 2024 03:59 IST

2023-24లో దేశీయ రద్దీలో 13% వృద్ధి
కరోనాకు ముందు స్థాయిల కంటే అధికం
కంపెనీల నికర నష్టం భారీగా తగ్గొచ్చు: ఇక్రా

దిల్లీ: దేశంలో విమాన ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. 2022-23తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ప్రయాణికుల రద్దీ 13% పెరిగి 15.4 కోట్లకు చేరినట్లు ఇక్రా తాజా  నివేదికలో పేర్కొంది. విమాన పరిశ్రమ నికర నష్టం కూడా రూ.3000-4000 కోట్ల స్థాయికి పరిమితం కావచ్చని తెలిపింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు..

  • కరోనాకు ముందు స్థాయిలను దేశీయ ప్రయాణికుల రద్దీ అధిగమించింది. 2019-20లో 14.2 కోట్ల మంది దేశీయ మార్గాల్లో ప్రయాణించారు. 2024 మార్చిలో దేశీయ విమానాల్లో 1.35 కోట్ల మంది ప్రయాణించారని అంచనా. ఫిబ్రవరిలో ప్రయాణించిన 1.26 కోట్ల మంది కంటే ఈ సంఖ్య 6.9% అధికం. ఏడాదివారీగా చూసినా 4.9% పెరిగింది.
  • దేశీయ విమానయాన పరిశ్రమ నికర నష్టం 2023-24, 2024-25లలో రూ.3,000-4,000 కోట్లకు పరిమితం కావొచ్చు. 2022-23లో రూ.17,000-17,500 కోట్ల నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.
  • 2023 మార్చితో పోలిస్తే విమాన సామర్థ్యం గత నెలలో 2% అధికంగా, ఫిబ్రవరితో పోలిస్తే 9% అధికంగా నమోదుకావొచ్చు.
  • ఫిబ్రవరితో ముగిసిన 2023-24 తొలి 11 నెలల్లో దేశీయ విమాన సంస్థల్లో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 2.7 కోట్లుగా నమోదైంది. 2022-23 ఇదే సమయంతో పోలిస్తే ఇది 25% అధికం. కరోనాకు ముందు (2020 ఏప్రిల్‌-ఫిబ్రవరి) స్థాయి అయిన 2.18 కోట్లతో పోల్చినా ఇది 24% ఎక్కువ.
  • దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో రికవరీ కొనసాగుతున్నందున విమాన పరిశ్రమపై స్థిరమైన భవిష్యత్‌ అంచనాలను ఇస్తున్నట్లు ఇక్రా పేర్కొంది. 2024-25 లోనూ స్థిర వ్యయాల  కొనసాగుతాయన్న అంచనాలుండడంతో రద్దీ పెరగొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని