టీసీఎస్‌ లాభం రూ.12,434 కోట్లు

దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) మార్చి త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను మించి రాణించింది. భారత వ్యాపారం బలమైన పనితీరు కనబరచడం ఇందుకు కారణం.

Published : 13 Apr 2024 04:01 IST

తుది డివిడెండు రూ.28
‘ప్రతిభావంతుల’కు రెండంకెల ఇంక్రిమెంటు
తగ్గిన వలసల రేటు

‘‘అంతర్జాతీయంగా స్థూల అనిశ్చిత వాతావరణం నెలకొన్నా, మెరుగైన లాభాల మార్జిన్‌ నమోదు చేశాం. రికార్డు స్థాయిలో కొత్త ఆర్డర్లు సాధించాం.  మా వ్యాపార నమూనా బలాలను  ఇవి ప్రతిబింబిస్తున్నాయి.’’

 టీసీఎస్‌ సీఈఓ, ఎండీ కె. కృతివాసన్‌


ముంబయి: దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) మార్చి త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను మించి రాణించింది. భారత వ్యాపారం బలమైన పనితీరు కనబరచడం ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.12,434 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.11,392 కోట్లతో పోలిస్తే 9% అధికం. ఏకీకృత ఆదాయాలు 3.5% పెరిగి రూ.61,237 కోట్లుగా నమోదయ్యాయి. ఆపరేటింగ్‌ మార్జిన్‌ 1.5% పెరిగి 26 శాతానికి చేరడం లాభంలో వృద్ధికి కారణంగా నిలిచింది.

 పెరిగిన దేశీయ వ్యాపార వాటా..

బీఎస్‌ఎన్‌ఎల్‌తో రూ.15,000 కోట్ల ఒప్పందం కారణంగా భారత వ్యాపారం ద్వారా కంపెనీ ఆదాయం 38% పెరిగింది. దీంతో మార్చి త్రైమాసిక ఆదాయంలో కంపెనీ దేశీయ వ్యాపార వాటా 6.7 శాతానికి చేరింది. ఏడాది కిందట ఇదే నెలలో ఇది 5 శాతంగా ఉంది. ఇదే సమయంలో ఉత్తర అమెరికా మార్కెట్‌ వాటా 52.4% నుంచి 50 శాతానికి తగ్గింది. అమెరికా ఆదాయంలో 2.3% క్షీణత నమోదు కావడం ఇందుకు కారణం.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి: 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ నికర లాభం 9% పెరిగి రూ.45,908 కోట్లకు చేరుకుంది. ఆదాయం 2022-23లోని రూ.2,25,458 కోట్ల నుంచి రూ.2,40,893 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండు రూ.28 ఇవ్వాలని ప్రతిపాదించారు.
రికార్డు స్థాయి ఆర్డర్లు: నాలుగో త్రైమాసికంలో కంపెనీ రికార్డు స్థాయిలో 13.2 బిలియన్‌ డాలర్ల కొత్త ఆర్డర్లను పొందింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద 42.7 బి. డాలర్ల ఆర్డర్లను నమోదు చేసింది.

19 ఏళ్లలో తొలిసారిగా తగ్గిన ఉద్యోగుల సంఖ్య:

  • సమీక్షిస్తున్న త్రైమాసికంలో కంపెనీ సిబ్బంది సంఖ్య 1759 తగ్గింది. మార్చి ఆఖరుకు మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,01,546కు చేరుకుంది. 2023 మార్చి 31 నాటి సిబ్బంది 6,14,795 మందితో పోలిస్తే,  13,249 మంది తగ్గినట్లయింది. 19 ఏళ్లలోనే తొలిసారిగా ఏడాదివారీగా సిబ్బంది సంఖ్య తగ్గడం ఇప్పుడే.
  • ఐటీ సిబ్బంది వలసల రేటు మాత్రం డిసెంబరు ఆఖరు నాటి 13.3% నుంచి 12.5 శాతానికి తగ్గింది. మెరుగైన పనితీరు ప్రదర్శించిన ఉద్యోగులకు రెండంకెల్లో ఇంక్రిమెంటు ఉంటుందని కంపెనీ చీఫ్‌ హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ మిలింద్‌ లక్కడ్‌ ప్రకటించారు.
  • అందరు ఉద్యోగులకు 4.5 - 7% మేర వేతన పెంపు ఉంటుందని తెలిపారు.
  • వృద్ధి పరంగా 2023-24 కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మెరుగ్గా ఉంటుందని సీఈఓ తెలిపారు.

40,000 మంది తాజా ఉత్తీర్ణులకు ఉద్యోగాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది తాజా ఉత్తీర్ణులను (ఫ్రెషర్లు) నియమించుకుంటామని మిలింద్‌ లక్కడ్‌ స్పష్టం చేశారు. నేషనల్‌ క్వాలిఫైయర్‌ టెస్ట్‌ ద్వారా 10,000 మందిని నియమించుకునే ప్రక్రియను సంస్థ ప్రారంభించిందని, ఈ నెల 26న ఈ పరీక్షలు నిర్వహించనున్నారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని