సంక్షిప్త వార్తలు

గేమింగ్‌ పరిశ్రమకు నియంత్రణ లాంటిది అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్దారు. అది స్వతంత్రంగానే ఉండాలని, అప్పుడే వృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

Updated : 14 Apr 2024 03:48 IST

గేమింగ్‌కు నియంత్రణ అవసరం లేదు : ప్రధాని

దిల్లీ: గేమింగ్‌ పరిశ్రమకు నియంత్రణ లాంటిది అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్దారు. అది స్వతంత్రంగానే ఉండాలని, అప్పుడే వృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గేమింగ్‌ రంగానికి నియంత్రణ అవసరం ఉందా? అని నమన్‌ మాథుర్‌ అనే ఒక గేమర్‌ అడిగిన ఓ ప్రశ్నకు పై విధంగా ప్రధాని సమాధానం ఇచ్చారు. నియంత్రణ అనేది ఇక్కడ సరైన పదం కాదు.. ఎందుకంటే ప్రభుత్వం సహజంగానే జోక్యం చేసుకుంటుందని ఆయన అన్నారు. ‘ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటేమో గేమింగ్‌ పరిశ్రమపై నియంత్రణ ఆంక్షలు విధించేందుకు ప్రయత్నించాలి. లేదంటే సంఘటిత, చట్ట విధానం కిందకు తీసుకొచ్చి దేశీయ అవసరాలకు తగ్గట్లుగా పరిశ్రమను తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. తద్వారా దాని ప్రాముఖ్యాన్ని పెంచాలి’ అని ప్రధాని వివరించారు.


గ్రాన్యూల్స్‌లో తనిఖీ.. ‘అభ్యంతరాలు’ లేవు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రాన్యూల్స్‌ ఇండియాకు విశాఖపట్నం సమీపంలోని అనకాపల్లిలో ఉన్న యూనిట్‌- 5ను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) బృందం తనిఖీ చేసింది. ఈ యూనిట్లో ఏపీఐ ఔషధాలు, ఫార్ములేషన్లు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రీ-అప్రూవల్‌ ఇన్‌స్పెక్షన్‌ (పీఏఐ), సీజీఎంపీ (గుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్రాక్టీసెస్‌) అనుమతుల కోసం దరఖాస్తు చేయగా, దానిపై యూఎస్‌ఎఫ్‌డీఏ బృందం తనిఖీ చేసింది. ఎటువంటి అభ్యంతరాలు లేకుండా తనిఖీ పూర్తయినట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా వెల్లడించింది. ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నందువల్ల ఇబ్బందులు లేకుండా తనిఖీ పూర్తయినట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా పేర్కొంది.


రూట్‌ మొబైల్‌ ఓపెన్‌ ఆఫర్‌లో రూ.2,500 కోట్ల షేర్లకు టెండర్‌

దిల్లీ: ఎంటర్‌ప్రైజ్‌ మెసేజింగ్‌ సంస్థ రూట్‌ మొబైల్‌ పబ్లిక్‌ వాటాదార్లు సుమారు రూ.2,500 కోట్ల విలువైన షేర్లను ఓపెన్‌ ఆఫర్‌లో విక్రయించేందుకు సిద్ధమయ్యారు. బెల్జియంకు చెందిన ప్రాక్సిమిస్‌ గ్రూప్‌ తన అనుబంధ సంస్థ ద్వారా రూట్‌ మొబైల్‌లో 57.56 శాతం వాటాను రూ.5,922.4 కోట్లకు నగదు లావాదేవీ ద్వారా దక్కించుకోవడంతో ఓపెన్‌ ఆఫర్‌ తెరపైకి వచ్చింది. నియంత్రణ సంస్థల మార్గదర్శకాల ప్రకారం, ఓపెన్‌ మార్కెట్‌ ఆఫర్‌లో 26 శాతం వాటాను పబ్లిక్‌ వాటాదార్ల నుంచి కొనుగోలు చేయాలి. ఎంటీఓ (మాండేటరీ టేకోవర్‌ ఆఫర్‌) వివరాల ఆధారంగా ప్రాక్సిమస్‌ ఓపల్‌ తన వాటాను సుమారు 75 శాతానికి పెంచుకునే అవకాశం ఉంది. 1,57,68,803 ఈక్విటీ షేర్లకు పబ్లిక్‌ వాటాదార్లు టెండరు వేసినట్లు రూట్‌ మొబైల్‌ తెలిపింది. టెండరు గడువు ప్రస్తుతం ముగిసింది. రూట్‌ మొబైల్‌ షేరు బీఎస్‌ఈలో శుక్రవారం 0.54 శాతం తగ్గి రూ.1,600.65 వద్ద ముగిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని