వాతావరణ మార్పులతో పరపతి విధానానికి సవాళ్లు

వాతావరణంలో తరచూ చోటుచేసుకుంటున్న మార్పులే పరపతి విధాన నిర్ణయాలకు సవాళ్లుగా మారాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) తన నివేదికలో తెలిపింది.

Published : 14 Apr 2024 02:50 IST

ఆర్‌బీఐ నివేదిక

ముంబయి: వాతావరణంలో తరచూ చోటుచేసుకుంటున్న మార్పులే పరపతి విధాన నిర్ణయాలకు సవాళ్లుగా మారాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) తన నివేదికలో తెలిపింది. అలాగే ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదించేందుకు కూడా ఇవి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని పేర్కొంది. ‘అంతర్జాతీయంగా సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆర్థిక, సామాజిక పరిస్థితులపై గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావం పెరుగుతుండటం కనిపిస్తోంద’ని తన పరపతి విధాన నివేదిక- ఏప్రిల్‌ 2024లో ఆర్‌బీఐ తెలిపింది. వాతావరణ మార్పులు పలు రూపాల్లో పరపతి విధానంపై ప్రభావం చూపే వీలుందని పేర్కొంది. ‘వాతావరణ మార్పులు వ్యవసాయ ఉత్పత్తి, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. తద్వారా ద్రవ్యోల్బణంపై నేరుగా ప్రభావం పడుతుంది. వడ్డీ రేట్ల స్వరూపాన్ని కూడా వాతావరణ మార్పులు ప్రభావితం చేస్తాయి. పరపతి విధాన నిర్ణయాల బదలాయింపునూ నెమ్మదించేలా చేస్తాయి’అని నివేదిక వివరించింది. అందువల్ల విధాన నిర్ణయాల రూపకల్పన విషయంలో వాతావరణ మార్పుల ముప్పును కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొంది. ద్రవ్యోల్బణానికి తరచూ కుదుపులు ఎదురైతే.. పరపతి విధానాన్ని కఠినం చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని ఆర్‌బీఐ తన నివేదికలో వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని