బఠానీల దిగుమతులను పర్యవేక్షించాలి!

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బఠానీల దిగుమతులతో పాటు ఇతర పప్పు ధాన్యాల లభ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కేంద్ర వినియోగదారు వ్యవహారాల కార్యదర్శి నిధి ఖారే ఆదేశించారు.

Updated : 14 Apr 2024 03:47 IST

ఇతర పప్పు ధాన్యాల నిల్వలను కూడా..
రాష్ట్రాలను కోరిన కేంద్రం

దిల్లీ: అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బఠానీల దిగుమతులతో పాటు ఇతర పప్పు ధాన్యాల లభ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కేంద్ర వినియోగదారు వ్యవహారాల కార్యదర్శి నిధి ఖారే ఆదేశించారు. దిగుమతి చేసుకున్న కొన్ని రకాల పప్పులు మార్కెట్‌కు చేరడం లేదని నివేదికలొస్తున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 15 నుంచి అమల్లోకి వచ్చేలా స్టాక్‌ హోల్డింగ్‌ సంస్థలు వారానికొకసారి స్టాక్‌ల వివరాలు వెల్లడించేలా చూడాలని సూచించారు. దిగుమతిదార్లు, కస్టమ్స్‌ అధికారులు, రాష్ట్రాల అధికారులు, పప్పు ధాన్యాల పరిశ్రమలోని వాటాదార్లతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో నిధి ఖారే మాట్లాడుతూ.. ప్రధాన నౌకాశ్రయాలు, పరిశ్రమల హబ్‌లలో ఉన్న గిడ్డంగుల్లోని పప్పు ధాన్యాల నిల్వలను ఎప్పటికప్పుడు ధ్రువీకరించాలని కోరారు. ఒకవేళ స్టాక్‌ల వెల్లడి పోర్టల్‌లో తప్పుడు సమాచారాన్ని నివేదించినట్లు తేలితే, ఆయా స్టాక్‌ హోల్డింగ్‌ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కందులు, సెనగలు, మినుములు, పెసలు వంటి ప్రధాన పప్పు ధాన్యాలతో పాటు దిగుమతి చేసుకునే పసుపు బఠానీల మార్కెట్‌ లభ్యతపై రాష్ట్రాలు దృష్టి సారించాలని సూచించారు. పప్పు ధాన్యాల లభ్యతను పెంచేందుకు 2023 డిసెంబరు 8 నుంచి 2024 జూన్‌ 30 వరకు పసుపు బఠానీ దిగుమతులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే దిగుమతి చేసుకుంటున్న సరుకులో చాలా వరకు మార్కెట్లో అందుబాటులో ఉండట్లేదని వార్తలు రావడంతో నిధి ఖారే అత్యవసర సమావేశం నిర్వహించి, ఈ నెల 15 నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని