బోర్నవిటా సహా ఆ డ్రింక్స్‌ను ‘హెల్త్‌ డ్రింక్స్‌’ కేటగిరీ నుంచి తొలగించండి

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఇ-కామర్స్‌ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోర్నవిటా సహా ఇతర కూల్‌డ్రింక్స్‌/బేవరేజెస్‌ను ‘హెల్త్‌ డ్రింక్స్‌’ కేటగిరీ నుంచి తొలగించాలంది.

Published : 14 Apr 2024 02:52 IST

కేంద్రం కీలక ఆదేశాలు

దిల్లీ: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఇ-కామర్స్‌ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోర్నవిటా సహా ఇతర కూల్‌డ్రింక్స్‌/బేవరేజెస్‌ను ‘హెల్త్‌ డ్రింక్స్‌’ కేటగిరీ నుంచి తొలగించాలంది. ‘‘పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం, 2005 సెక్షన్‌ 3 కింద ఏర్పాటైన జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్‌ జరిపిన విచారణలో.. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ చట్టం, 2006లో ‘హెల్త్‌ డ్రింక్‌’ అని దేన్నీ నిర్వచించలేదు అని నిర్ధరణకు వచ్చింది’’ అని కేంద్రం ఏప్రిల్‌ 10న జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అన్ని ఇ-కామర్స్‌ కంపెనీలు/ పోర్టళ్లు బోర్నవిటా సహా అన్ని డ్రింక్స్‌/ బేవరేజెస్‌ను ‘హెల్త్‌ డ్రింక్స్‌’ కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. బోర్నవిటాలో అధిక చక్కెర ఉందంటూ ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఒకరు వీడియోను పోస్ట్‌ చేయడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులోని కొన్ని పదార్థాలు పిల్లలకు హాని కలిగించేలా ఉన్నాయంటూ అతడు పేర్కొన్నాడు. వీడియోను పోస్ట్‌ చేసిన వ్యక్తికి బోర్నవిటా బ్రాండ్‌ నడుపుతున్న మాండెలెజ్‌ ఇండియా అప్పట్లో లీగల్‌ నోటీసు జారీ చేసింది. దీంతో ఆ వీడియోను ఇన్‌ఫ్లూయెన్సర్‌ అన్ని ప్లాట్‌ఫారాల నుంచి డిలీట్‌ చేశారు. ఈ విషయమై తమకు సైతం ఫిర్యాదు అందడంతో కమిషన్‌ విచారణ జరిపింది. బోర్నవిటాలో అనుమతించిన దానికంటే అధికంగా చక్కెర స్థాయిలు ఉన్నట్లు గుర్తించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు మానుకోవాలని మాండలెజ్‌ ఇండియాకు నోటీసులు కూడా పంపింది. ఈనేపథ్యంలో తాజా ఆదేశాలు వెలువడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు