స్థిరాస్తిలోకి తగ్గిన సంస్థాగత పెట్టుబడులు

జనవరి-మార్చి మధ్య స్థిరాస్తి రంగంలోకి సంస్థాగత పెట్టుబడులు వార్షికంగా 55 శాతం తగ్గి 552 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4,580 కోట్లు)కు పరిమితమయ్యాయని అంతర్జాతీయ ప్రోపర్టీ కన్సల్టెంట్‌ వెస్టియన్‌ నివేదిక వెల్లడించింది.

Published : 14 Apr 2024 03:42 IST

వెస్టియన్‌ నివేదిక

దిల్లీ: జనవరి-మార్చి మధ్య స్థిరాస్తి రంగంలోకి సంస్థాగత పెట్టుబడులు వార్షికంగా 55 శాతం తగ్గి 552 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4,580 కోట్లు)కు పరిమితమయ్యాయని అంతర్జాతీయ ప్రోపర్టీ కన్సల్టెంట్‌ వెస్టియన్‌ నివేదిక వెల్లడించింది. విదేశీ మదుపర్లు కేవలం 11 మి.డాలర్ల (సుమారు రూ.90 కోట్లు) మేర పెట్టుబడులు పెట్టడం గమనార్హం. మన స్థిరాస్తి రంగంపై వారు అప్రమత్తంగా ఉన్నారని తెలుస్తోంది. గత ఏడాది జనవరి-మార్చి సమయంలో వీరు 791.4 మి.డాలర్ల(సుమారు రూ.6,570 కోట్లు) పెట్టుబడులు పెట్టడం విశేషం. దీంతో 2023 జనవరి-మార్చి మధ్య మన స్థిరాస్తి రంగం 1238.3 మి.డాలర్ల (సుమారు రూ.10,280 కోట్లు) పెట్టుబడులను ఆకర్షించింది. దేశీయ మదుపర్లు భారత స్థిరాస్తి రంగంపై 541.1 మి.డాలర్ల (సుమారు రూ.4,490 కోట్లు) పెట్టుబడులు పెట్టారు. ఏడాది క్రితం జనవరి-మార్చి మధ్య వీరు చొప్పించిన 446.9 మి.డాలర్ల (సుమారు రూ.3,710 కోట్లు)తో పోలిస్తే ఇవి 21 శాతం అధికం.

  • వాణిజ్య ఆస్తులు (కార్యాలయాలు, రిటైల్‌, కో-వర్కింగ్‌, ఆతిథ్య ప్రాజెక్టుల వంటివి) అత్యధికంగా 231.6 మి.డాలర్ల (సుమారు రూ.1,920 కోట్లు) పెట్టుబడులను ఆకర్షించాయి. ఏడాది క్రితం జనవరి-మార్చి సమయంలో ఈ ఆస్తుల్లోకి 484.8 మి.డాలర్ల (రూ.4,020 కోట్లు) పెట్టుబడులు తరలివచ్చాయి.
  • గృహ నిర్మాణ ఆస్తుల్లోకి సంస్థాగత పెట్టుబడులు 337.7 మి.డాలర్ల (సుమారు రూ.2,800 కోట్లు) నుంచి 33 శాతం తగ్గి 225 మి.డాలర్ల (సుమారు రూ.1,865 కోట్లు)కు పరిమితమయ్యాయి.
  • పారిశ్రామిక, గిడ్డంగుల రంగంలోకి పెట్టుబడులు 215.8  మి.డాలర్ల (సుమారు రూ.1,790 కోట్లు) నుంచి 73 శాతం క్షీణించి 58.9 మి.డాలర్ల (సుమారు రూ.490 కోట్లు)కు పరిమితమయ్యాయి.
  • బెంగళూరు అత్యధికంగా 299 మి.డాలర్ల (సుమారు రూ.2,480 కోట్లు) సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించింది. దీని తర్వాత దిల్లీ-ఎన్‌సీఆర్‌ 110 మి.డాలర్ల (సుమారు రూ.910 కోట్లు)ను రాబట్టింది. ఈ రెండు నగరాలే మొత్తం పెట్టుబడుల్లో 74 శాతం వాటా కలిగి ఉన్నాయి.
  • ఎడెల్‌వైజ్‌ క్యాపిటల్‌ 300 మి.డాలర్ల (సుమారు రూ.2,490 కోట్లు) పెట్టుబడులతో అత్యంత క్రియాశీలక పెట్టుబడిదారుగా నిలిచింది.
  • ‘దేశీయ మదుపర్లు భారత వృద్ధిపై బులిష్‌ ధోరణితో ఉన్నారు. అందుకే స్థిరాస్తి రంగంపై పెట్టుబడులు పెడుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ స్థూల ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నడుమ విదేశీ మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ, గిరాకీ నేపథ్యంలో వచ్చే కొన్ని నెలల్లో భారత స్థిరాస్తి రంగంలోకి పెట్టుబడులు తరలి వచ్చే అవకాశం కనిపిస్తోంద’ని వెస్టియన్‌ సీఈఓ శ్రీనివాస రావు వెల్లడించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని