ఏడాదిలో రూ.10,000 క్లబ్బులోకి 8 షేర్లు

గత ఏడాదికాలంలో నిఫ్టీ 500 సూచీలోని 8 షేర్లు తొలిసారిగా రూ.10,000 క్లబ్బులోకి అడుగుపెట్టాయి. ఆ కంపెనీల ఆర్థిక కార్యకలాపాలకు ఇది అద్దంపట్టడమే కాకుండా, స్టాక్‌మార్కెట్లో పెట్టుబడి అవకాశాలకు ఉన్న సానుకూల పరిస్థితులను ఇది తెలియజేస్తోంది.

Published : 14 Apr 2024 03:39 IST

మదుపర్లకు భారీగా ప్రతిఫలం

గత ఏడాదికాలంలో నిఫ్టీ 500 సూచీలోని 8 షేర్లు తొలిసారిగా రూ.10,000 క్లబ్బులోకి అడుగుపెట్టాయి. ఆ కంపెనీల ఆర్థిక కార్యకలాపాలకు ఇది అద్దంపట్టడమే కాకుండా, స్టాక్‌మార్కెట్లో పెట్టుబడి అవకాశాలకు ఉన్న సానుకూల పరిస్థితులను ఇది తెలియజేస్తోంది. షేరు ధర నాలుగు అంకెల స్థాయి నుంచి ఐదు అంకెల స్థాయికి చేరడం ఏ కంపెనీ చరిత్రలో అయినా కీలక మైలురాయి అవుతుంది. ఆయా కంపెనీలపై మదుపర్లకు ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా మారుతుంది.

ఆ షేర్లు ఇవే

1) మారుతీ సుజుకీ షేరు ధర తొలిసారి 2023 ఆగస్టులో రూ.10,000ను తాకింది. ప్రస్తుతం అదే జోరును కొనసాగిస్తోంది. శుక్రవారం (ఏప్రిల్‌ 12న) ట్రేడింగ్‌ ముగిసేనాటికి మారుతీ షేరు రూ.12,274.60 వద్ద ముగిసింది. మంగళవారం (9న) రూ.12,980 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.

2) ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేరు 2023 డిసెంబరులో    రూ.10,000 మైలురాయిని అందుకుంది. ఫలితంగా కంపెనీ మార్కెట్‌ విలువ రూ.3 లక్షల కోట్లను అధిగమించింది. అయితే ప్రస్తుతం షేరు రూ.10,000 దిగువకు వచ్చింది. శుక్రవారం రూ.9,646.95 వద్ద షేరు ముగిసింది. మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయింపులు పెంచడం, అందుబాటు గృహ రంగానికి ప్రోత్సాహకాలు, పట్టణ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి బలమైన గిరాకీ లాంటివి సిమెంటు రంగానికి కలిసి రావడమే, అల్ట్రాటెక్‌ షేరు రాణింపునకు ఉపకరించింది.

3) ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ సంస్థ వోల్ట్‌యాంప్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ షేరు ఈ ఏడాది ఏప్రిల్‌ 2న రూ.10,000ను చేరింది. ఒక ఏడాది వ్యవధిలో ఈ షేరు 257% ప్రతిఫలాన్ని పంచింది. కిందటేడాది ఏప్రిల్‌లో రూ.2,900 వద్ద ఉన్న షేరు.. శుక్రవారం (12న) రూ.9,975.85 వద్ద ముగిసింది. దేశంలో పెరుగుతున్న విద్యుత్‌ గిరాకీ అవసరాలకు తగ్గట్లుగా పునరుత్పాదక, థర్మల్‌ విద్యుత్‌ సామర్థ్యాలను పెంచడం వల్ల.. వోల్ట్‌యాంప్‌ లాంటి ట్రాన్స్‌ఫార్మర్‌ తయారీ సంస్థలకు ప్రయోజనం కలుగుతోంది. ఆ ప్రభావం షేరు పనితీరులోనూ ప్రతిబింబిస్తోంది.

4) ఫౌండ్రీ పరిశ్రమలకు అవసరమైన పరికరాలను తయారు చేసే కంపెనీ డిసా ఇండియా షేరు ధర గతేడాది జూన్‌లో తొలిసారి రూ.10,000ను అందుకుంది. ఆ తర్వాతి రెండు నెలల్లో రూ.15,000 మైలురాయినీ అధిగమించింది. 2023 డిసెంబరులో రూ.17,570 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని చేరింది. అక్కడ నుంచి డీలాపడుతూ వస్తున్న షేరు శుక్రవారం రూ.13,850 వద్ద ముగిసింది. ఏడాది కాలంలో షేరు 77% మేర ప్రతిఫలాన్ని పంచింది.

5) మెషినింగ్‌ టూల్స్‌, ప్రెసిషన్‌ కాంపోనెంట్స్‌ను తయారు చేసే కంపెనీ వెంట్‌ ఇండియా షేరు కూడా గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చడమే కాకుండా.. 2023 జూన్‌లో రూ.10,000 మైలురాయిని తాకింది. ఆ తర్వాత మూడు నెలల్లోనే రూ.15,000ను చేరింది. అప్పటి నుంచి లాభాల స్వీకరణ చోటుచేసుకున్నప్పటికీ.. షేరు రూ.10,000 స్థాయిని నిలబెట్టుకోగలిగింది. ప్రస్తుతం షేరు రూ.12,193.05 (2024 ఏప్రిల్‌ 12న) వద్ద ఉంది.

6) బెనారస్‌ హోటల్స్‌ షేరు ఈ ఏడాది జనవరిలో రూ.10000 స్థాయిని అందుకుంది. అయితే ఆ తర్వాత దానిని నిలబెట్టుకోలేకపోయింది. ప్రస్తుతం షేరు రూ.8,791.95 వద్ద ఉంది. అయితే ఏడాదికాలంలో ఈ షేరు 137% పెరగడం గమనార్హం.

7) బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ బెంగాల్‌ అండ్‌ అస్సాం కంపెనీ షేరు ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.10000 మైలురాయిని తాకింది. తదుపరి ఈ షేరు కూడా ఆ స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. ఈ షేరు ఏప్రిల్‌ 12న రూ.8,220.35 వద్ద ముగిసింది. ఏడాదికాలంలో ఈ షేరు కూడా 127% మేర రాణించింది.

8) స్విచ్‌ల తయారీ సంస్థ కేసీ ఇండస్ట్రీస్‌ షేరు గతేడాది జూన్‌లో రూ.10,000 క్లబ్‌లోకి చేరింది. 2023 చివర్లో రూ.20,000 మైలురాయిని కూడా అందుకుంది. ప్రస్తుతం రూ.18,416.15 వద్ద ట్రేడవుతోంది. ఏడాదికాలంలో ఈ షేరు 133% పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని