73000-73485 శ్రేణిలో మద్దతు!

వరుసగా 3 వారాల లాభాల తర్వాత, గత వారం దేశీయ సూచీలు స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు తోడు ముడిచమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మన ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపాయి.

Published : 15 Apr 2024 03:26 IST

సమీక్ష: వరుసగా 3 వారాల లాభాల తర్వాత, గత వారం దేశీయ సూచీలు స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు తోడు ముడిచమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మన ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపాయి. దేశీయంగా ప్రభావం చూపే కీలక పరిణామాలు లేనందున,  కార్పొరేట్‌ వార్తలు, ప్రకటనలే మార్కెట్లను నడిపించాయి. ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి 4 నెలల గరిష్ఠమైన 5.7 శాతంగా నమోదైంది. మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5 నెలల కనిష్ఠమైన 4.85 శాతానికి చేరింది. బ్యారెల్‌ ముడిచమురు ధర 90 డాలర్ల ఎగువకు చేరింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులకు దిగొచ్చన్న సంకేతాలు ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.31 నుంచి 83.38కు చేరింది. అంతర్జాతీయంగా.. ఐరోపా కేంద్ర బ్యాంక్‌ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అమెరికాలో మార్చి నెల ద్రవ్యోల్బణం అంచనాల కంటే అధికంగా 3.5 శాతంగా నమోదుకావడం కలవరపెట్టింది. దీంతో జూన్‌లో వడ్డీ రేట్ల కోతలు ఉండకపోవచ్చన్న అంచనాలు పెరిగాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 74,245 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 22,519 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో లోహ, చమురు-గ్యాస్‌, స్థిరాస్తి షేర్లు లాభపడగా.. మన్నికైన వినిమయ వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, ఐటీ షేర్లు నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.6,527 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.12,233 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ఏప్రిల్‌లో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా       రూ.13,347 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 4:7గా నమోదు కావడం..
పెద్ద షేర్లలో లాభాల స్వీకరణను సూచిస్తోంది.

 ఈ వారంపై అంచనా: గతవారం సెన్సెక్స్‌ 75,124 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. గరిష్ఠ స్థాయుల్లో స్థిరీకరణతో వెనక్కి వచ్చింది. ప్రస్తుతం 73,000- 73,485 పాయింట్ల శ్రేణిలో మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ స్థాయి దిగువన ముగిస్తే, స్వల్పకాలంలో దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది.

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశీయ మార్కెట్లు సంకేతాలు తీసుకోవచ్చు. బుధవారం శ్రీరామనవమి సెలవు కావడంతో ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ఈనెల 19న జరగనున్న లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌పై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. ఈ వారం ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌ ఇన్సూరెన్స్‌, టాటా కమ్యూనికేషన్స్‌, జియో ఫైనాన్షియల్‌, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు కీలకం కానున్నాయి. టోకు ద్రవ్యోల్బణం, ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశ మినిట్స్‌, బ్యాంక్‌ రుణాల వృద్ధి, వాణిజ్య లోటు గణాంకాలపై దృష్టిపెట్టొచ్చు. అంతర్జాతీయంగా.. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలపై కన్నేయొచ్చు. యూరో ఏరియా పారిశ్రామికోత్పత్తి, అమెరికా రిటైల్‌ విక్రయాలు, చైనా జీడీపీ, పారిశ్రామికోత్పత్తి, అమెరికా తయారీ, యూరో ఏరియా ద్రవ్యోల్బణం, అమెరికా నిరుద్యోగ క్లెయిమ్‌ గణాంకాలు ప్రభావం చూపొచ్చు. రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ యుద్ధం తీవ్రరూపం దాలిస్తే.. చమురు ధరలు పరుగులు తీసి, ఈక్విటీ మదుపర్ల సెంటిమెంట్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది.

తక్షణ మద్దతు స్థాయులు: 73,485, 73,120, 72,363
తక్షణ నిరోధ స్థాయులు: 74,952, 75,300, 75,850
సెన్సెక్స్‌కు 73,000- 73,485 పాయింట్ల శ్రేణిలో మద్దతు లభించొచ్చు.

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని