సైబర్‌ మోసాలపై ఆర్థిక శాఖ దృష్టి

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన బీఓబీ వరల్డ్‌ యాప్‌లో జరిగిన కుంభకోణం సహా ఆర్థిక మోసాలను నివారించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ మెరుగైన కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) విధానాన్ని ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Published : 15 Apr 2024 03:27 IST

దిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన బీఓబీ వరల్డ్‌ యాప్‌లో జరిగిన కుంభకోణం సహా ఆర్థిక మోసాలను నివారించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ మెరుగైన కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) విధానాన్ని ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సైబర్‌ ప్రమాదాల నుంచి ఖాతాదార్లను రక్షించడానికి ఆన్‌బోర్డింగ్‌ మర్చంట్లపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్థిక శాఖ సూచించినట్లు తెలుస్తోంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలు అందించే మర్చంట్లు, బిజినెస్‌ కరస్పాండెంట్ల (బీసీల)పై మరింత శ్రద్ధ అవసరమని పేర్కొంది. మోసాలు జరగకుండా చూడటంతో పాటు ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. డేటా భద్రత, రక్షణ ఎంతో కీలకమని.. మర్చంట్లు, బీసీల స్థాయిలోనే రాజీ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆర్థిక శాఖ గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. సైబర్‌ మోసాల హాట్‌స్పాట్‌లలో బీసీల పాత్ర, మోసాల్లో అంతర్భాగమవుతున్న మైక్రో ఏటీఎంలను స్తంభింప చేయడం వంటి వాటిని సమీక్షించాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కోరినట్లు సమాచారం. సైబర్‌ భద్రతను మరింతగా పెంచడం, ఆర్థిక మోసాలను అరికట్టడం అనే లక్ష్యంతో ఇటీవల అంతర్‌ మంత్రిత్వ శాఖ సమావేశం జరిగింది. ఇందులో పలు సూచనలు, సలహాలు వచ్చాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని