సూచీలకూ యుద్ధ భయాలు!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకుల్లో చలించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యుద్ధభయాలు విస్తరించడం, వడ్డీ రేట్ల దిశపై అనిశ్చితికి తోడు.

Published : 15 Apr 2024 03:34 IST

లాభాల స్వీకరణకు అవకాశం
లోహ, యంత్రపరికరాల షేర్లకు సానుకూలతలు
విశ్లేషకుల అంచనా
17న మార్కెట్లకు శ్రీరామనవమి సెలవు
స్టాక్‌ మార్కెట్‌
ఈ వారం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకుల్లో చలించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యుద్ధభయాలు విస్తరించడం, వడ్డీ రేట్ల దిశపై అనిశ్చితికి తోడు.. ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో కొంత మంది మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపే అవకాశం ఉందని వారంటున్నారు. మ్యూచువల్‌ ఫండ్‌లలో ద్రవ్యలభ్యత అధికంగా ఉండటం వల్ల, సూచీలను కొంతవరకు ఆదుకోవచ్చని భావిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా మార్కెట్లు బుధవారం (ఈనెల 17న) పనిచేయవు. దీంతో ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితం కానుంది. సాంకేతికంగా నిఫ్టీ-50 సూచీ 22,500 పాయింట్ల కిందకు లేదా 22,750 పైకి వెళితేనే స్పష్టమైన దిశకు అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికి 22,500 వద్ద మద్దతు ఉందని.. ఈ స్థాయి కిందకు వస్తే 22,350కు పడిపోవచ్చని అంచనా. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

  • ఔషధ కంపెనీల షేర్లు స్తబ్దుగా కనిపిస్తున్నాయి. ఫలితాలకు ముందు ఎంపిక చేసిన షేర్లలో కదలికలకు ఎక్కువ అవకాశం ఉంది. అరబిందో ఫార్మా, సన్‌ఫార్మా షేర్లు మరింత ఒత్తిడికి గురికావొచ్చు.
  • చమురు-గ్యాస్‌ కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి చలించొచ్చు. పశ్చిమాసియాలో అనిశ్చితులు కొనసాగుతుండడం ఇందుకు నేపథ్యం. చమురు ధరలు పెరగడంతో బీపీసీఎల్‌, ఐఓసీఎల్‌ వంటి మార్కెటింగ్‌ కంపెనీల షేర్లపై ప్రభావం చూపొచ్చు.
  • ఫలితాల నేపథ్యంలో సిమెంటు షేర్లు ఊగిసలాడొచ్చు. మార్చి త్రైమాసికంలో కంపెనీలు అధిక విక్రయాలనే నమోదు చేశాయని అంచనా.
  • ఎక్కువ శాతం వాహన కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి కదలాడొచ్చు. వాహన సూచీకి 21,700 వద్ద మద్దతు, 22,100 వద్ద నిరోధం కనిపిస్తోంది. బజాజ్‌ ఆటో, మహీంద్రా, టాటా మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌ రాణించే అవకాశం ఉంది. హీరో మోటోకార్ప్‌, మారుతీ ఒత్తిడిలో కొనసాగొచ్చు.
  • ఐటీ షేర్లు ఊగిసలాడొచ్చు. అంచనాలను మించి టీసీఎస్‌ రాణించడం,  ఈ రంగ కంపెనీల షేర్లపై ప్రభావం చూపొచ్చు. ఇన్ఫోసిస్‌ (గురువారం), విప్రో (శుక్రవారం) ఫలితాలనూ గమనించాలి.
  • లోహ కంపెనీల షేర్లు బులిష్‌ ధోరణిలో ట్రేడవవచ్చు. సానుకూల ప్రాంతీయ, అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు నేపథ్యం. ప్రపంచ వ్యాప్తంగా కమొడిటీ ధరల్లో పెరుగుదల నుంచి ఈ రంగం ప్రయోజనం పొందొచ్చు. హిందాల్కో, హిందుస్థాన్‌ కాపర్‌, టాటా స్టీల్‌ షేర్లను గమనించొచ్చు.
  • ఎంపిక చేసిన టెలికాం షేర్లలో చలనాలను అంచనా వేయొచ్చు. కొద్ది నెలలుగా కొత్త వినియోగదార్లు పెరుగుతుండడం ఈ రంగానికి సానుకూలతను తీసుకురావొచ్చు. వొడాఫోన్‌ ఐడియా షేరు ఈ వారం రూ.14.25 దాకా వెళ్లే అవకాశం ఉందంటున్నారు.
  • నిఫ్టీ బ్యాంక్‌ ఈ వారం 50,000 స్థాయిని అధిగమించొచ్చని అంచనా. సాంకేతికంగా 48,300-48,100 స్థాయి వద్ద లాంగ్‌ ట్రేడ్స్‌లోకి అడుగుపెట్టొచ్చు. ఈనెల 20న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు వెలువడనున్నాయి.
  • బలమైన ఆర్థిక ఫలితాల అంచనాల మధ్య యంత్ర పరికరాల షేర్లు రాణించొచ్చు. అయితే షేర్లు అధిక విలువల్లో ఉన్నందున, లాభాలు పరిమితంగా ఉండొచ్చు.
  • ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. గ్రామీణ వృద్ధి స్తబ్దుగా ఉండడానికి తోడు, విక్రయాల పరిణామాల్లో ఒత్తిడి ఎదుర్కొంటుండడం ఇందుకు నేపథ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని