వాహన ఎగుమతులు 5.5% తగ్గాయ్‌

మనదేశం నుంచి గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 44,00,492 వాహనాలు విదేశీ విపణులకు ఎగుమతి అయ్యాయని వాహన తయారీదారుల సమాఖ్య (సియామ్‌) తెలిపింది.

Published : 15 Apr 2024 03:36 IST

దిల్లీ: మనదేశం నుంచి గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 44,00,492 వాహనాలు విదేశీ విపణులకు ఎగుమతి అయ్యాయని వాహన తయారీదారుల సమాఖ్య (సియామ్‌) తెలిపింది. 2022-23లో ఎగుమతి అయిన 47,61,299 వాహనాలతో పోలిస్తే, ఈ సంఖ్య 5.5% తక్కువ. పలు విదేశీ విపణులు  ఆర్థిక ఒత్తిళ్లలో ఉండటమే ఇందుకు కారణమని సియామ్‌ అధ్యక్షుడు వినోద్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ‘మన దేశం నుంచి వాణిజ్య వాహనాలు, ద్విచక్రవాహనాలు ఎక్కువగా ఎగుమతి అయ్యే కొన్ని దేశాలు,  విదేశీ మారకపు ద్రవ్యానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందువల్లే వాహన దిగుమతులను అవి తగ్గించుకున్నాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో పరిస్థితి కొంత మారింది.  ద్విచక్రవాహన ఎగుమతులు ఆశాజనకంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మెరుగు పడతాయని ఆశిస్తున్నాం’ అని అన్నారు. 2022-23తో పోలిస్తే, గత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహనాలు, ద్విచక్ర, త్రిచక్ర వాహన ఎగుమతులు తగ్గితే, ప్రయాణికుల వాహన (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) ఎగుమతులు స్వల్పంగా పెరిగాయి.

గత ఆర్థిక సంవత్సరంలో 2,80,712 వాహనాల ఎగుమతితో మారుతీ సుజుకీ ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. 2022-23లో ఈ సంస్థ 2,55,439 వాహనాలు ఎగుమతి చేసింది. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఎగుమతులు 1,53,019 నుంచి 1,63,155కు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో కియా ఇండియా 52,105, ఫోక్స్‌వ్యాగన్‌ 44,180, నిస్సాన్‌ 42,989, హోండా కార్స్‌ 37,589 వాహనాలను ఎగుమతి చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని