సంక్షిప్త వార్తలు(5)

మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) అనంతరం 6-9 నెలల్లో, కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో 5జీ సేవలను ప్రారంభిస్తామని వొడాఫోన్‌ ఐడియా (వీఐ) వెల్లడించింది.

Published : 16 Apr 2024 03:45 IST

ఎఫ్‌పీఓ తర్వాత 6-9 నెలల్లో వొడాఫోన్‌ ఐడియా 5జీ సేవలు!

దిల్లీ: మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) అనంతరం 6-9 నెలల్లో, కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో 5జీ సేవలను ప్రారంభిస్తామని వొడాఫోన్‌ ఐడియా (వీఐ) వెల్లడించింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించనున్న నిధుల్లో కొంతమేర 5జీ సేవల ప్రారంభానికి వినియోగిస్తామని సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అక్షయ ముంద్రా తెలిపారు. ఈ నిధులు వస్తే.. 5జీ సేవల పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వచ్చే 24-40 నెలల్లో కంపెనీ మొత్తం ఆదాయాల్లో 40% వరకు 5జీ సేవల నుంచే ఉండొచ్చనే అంచనాను వ్యక్తం చేశారు. 5జీ సేవల పనుల నిమిత్తం రూ.5,720 కోట్లు కేటాయించినట్లు ముంద్రా తెలిపారు. టెస్టింగ్‌తో పాటు వెండర్లతో చర్చలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. పోటీ సంస్థలైన భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో ఇప్పటికే దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించాయి. నిధుల కొరత కారణంగానే తాము ఇప్పటివరకు 5జీ సేవలను ప్రారంభించలేదని ముంద్రా తెలిపారు. వొడాఫోన్‌ ఐడియా ఎఫ్‌పీఓ ఈనెల 18న మొదలుకానుంది. ధరల శ్రేణిగా రూ.10-11ను నిర్ణయించారు. ప్రతిపాదిత ఎఫ్‌పీఓ ద్వారా సమీకరించాలని అనుకుంటున్న రూ.18,000 కోట్ల నిధుల నుంచి 5జీ సేవల ప్రారంభం సహా ముఖ్యమైన పెట్టుబడుల కోసం రూ.15,000 కోట్లు కేటాయిస్తామని ముంద్రా తెలిపారు.  


అక్టోబరు 1 నుంచి రిటైల్‌, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రుణాలకూ కేఎఫ్‌ఎస్‌

దిల్లీ: రిటైల్‌ రుణ గ్రహీతలతో పాటు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ విభాగ రుణాలు తీసుకునే వారికీ అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అక్టోబరు 1 నుంచి కీ ఫ్యాక్ట్స్‌ స్టేట్‌మెంట్‌ (కేఎఫ్‌ఎస్‌) అందజేయాల్సి ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సోమవారం తెలిపింది. కేఎఫ్‌ఎస్‌ అంటే రుణ ఒప్పందానికి సంబంధించిన వివరాలన్నింటినీ సరళంగా, సులభంగా అర్థం చేసుకునేలా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. తద్వారా వడ్డీ వ్యయాలు సహా మొత్తం వివరాలను అర్థం చేసుకుని, రుణంపై ఒక నిర్ణయానికి రావడానికి రుణ గ్రహీతలకు వీలుంటుంది. ప్రస్తుతం వ్యక్తిగత రుణగ్రహీతలకు వాణిజ్య బ్యాంకులు; సూక్ష్మ రుణాలు, డిజిటల్‌ రుణాలకు నియంత్రిత సంస్థలు (ఆర్‌ఈలు) కేఎఫ్‌ఎస్‌ ఇస్తున్నాయి.


అంబుజా సిమెంట్స్‌ చేతికి మై హోమ్‌ సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌

ఈనాడు, హైదరాబాద్‌: అదానీ గ్రూపులో భాగమైన అంబుజా సిమెంట్స్‌ తమిళనాడులో ఉన్న మై హోమ్‌ గ్రూపునకు చెందిన సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌ను స్వాధీనం చేసుకోనుంది. దీనికోసం రూ.413.75 కోట్లు చెల్లించనున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. 1.5 మెట్రిక్‌ టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న ఈ గ్రైడింగ్‌ యూనిట్‌ స్వాధీనానికి సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అంబుజా పేర్కొంది. దీనికి కావాల్సిన నిధులను అంతర్గతంగానే సమకూర్చుకున్నట్లు వెల్లడించింది. అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఉత్పత్తి, సరఫరాకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా డీలర్‌ నెట్‌వర్క్‌, ఉద్యోగులనూ కొనసాగిస్తామని అదానీ గ్రూపు సిమెంట్‌ బిజినెస్‌ సీఈఓ అజయ్‌ కపూర్‌ తెలిపారు. దీర్ఘకాలిక ఫ్లై యాష్‌ ఒప్పందంతో, తూత్తుకూడి (టుటికోరిన్‌) ఓడరేవు సమీపంలో 61 ఎకరాల్లో ఈ యూనిట్‌ విస్తరించి ఉంది. ఈ యూనిట్‌ స్వాధీనంతో తమిళనాడు, కేరళలలో విస్తరిస్తామని అంబుజా సిమెంట్స్‌ తెలిపింది.


గృహరుణాల కోసం బీఓఐతో ఐఎంజీసీ జట్టు

ఈనాడు, హైదరాబాద్‌: అందుబాటు ధర ఇళ్ల కొనుగోలుకు గృహరుణాలు అందించేందుకు ఇండియా మార్టిగేజ్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (ఐఎంజీసీ), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ)తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి గృహరుణం  అందించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని రెండు సంస్థలూ సోమవారం వెల్లడించాయి. దేశంలో 5,100 కు పైగా శాఖలతో ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భాగస్వామ్యంతో, గృహరుణాలను అవసరమైన వారికి అందించేందుకు వీలవుతుందని ఐఎంజీసీ భావిస్తోంది. ఇందుకు తమ నైపుణ్యాలు, హామీలూ తోడవుతాయని పేర్కొంది. బ్యాంకు రుణానికి ఐఎంజీసీ హామీ ఉంటుంది కనుక, బ్యాంకుకు నిరర్థక ఆస్తుల భయం తగ్గుతుంది. రుణగ్రహీతలకు మరింత అనుకూలమైన రుణ నిబంధనలు ఉంటాయని ఐఎంజీసీ ఎండీ, సీఈఓ మహేశ్‌ మిశ్రా తెలిపారు. గృహరుణాల మార్కెట్లో బలోపేతం అయ్యేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఏకే పాఠక్‌ అన్నారు.


వెల్త్‌మేనేజ్‌మెంట్‌, బ్రోకింగ్‌ సేవల్లోకి జియో ఫైనాన్షియల్‌

బ్లాక్‌రాక్‌తో సంయుక్తసంస్థ ప్రకటన

దిల్లీ: వెల్త్‌మేనేజ్‌మెంట్‌, బ్రోకింగ్‌ కంపెనీల ఏర్పాటు నిమిత్తం బ్లాక్‌రాక్‌తో జియో ఫైనాన్షియల్‌ ఒక సంయుక్త సంస్థ(జేవీ)ను ప్రకటించింది. ఈ జేవీలో ఇరు కంపెనీలకు చెరిసగం(50:50) వాటా ఉంటుందని జియో ఫైనాన్షియల్‌ తెలిపింది. ‘మా కంపెనీ, బ్లాక్‌రాక్‌, బ్లాక్‌రాక్‌ అడ్వైజర్స్‌ సింగపూర్‌లు ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. మా కంపెనీ, బ్లాక్‌రాక్‌లకు 50:50 నిష్పత్తిలో సంయుక్త సంస్థలో వాటా ఉంటుంది. వెల్త్‌ బిజినెస్‌ వ్యవహారాలు ఇది చూసుకుంటుంది. ఇందులో భాగంగా ఒక వెల్త్‌మేనేజ్‌మెంట్‌ కంపెనీతో పాటు బ్రోకరేజీ సంస్థను భారత్‌లో ఏర్పాటు చేస్తామ’ని జియో ఫైనాన్షియల్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. తాజా ఒప్పందంలో బ్లాక్‌రాక్‌ ఇంక్‌.తో తమ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని రిలయన్స్‌ గ్రూప్‌ సంస్థ అయిన జియో ఫైనాన్షియల్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని