వస్తువుల ఎగుమతులు 3.11% తగ్గాయ్‌

అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు నెలకొనడం వల్ల, మన ఎగుమతులపై ప్రభావం పడుతోంది. 2023-24లో మన దేశం నుంచి వస్తువుల ఎగుమతులు, 2022-23తో పోలిస్తే 3.11% క్షీణించి 437.06 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.36.28 లక్షల కోట్ల)కు చేరాయని వాణిజ్య శాఖ తెలిపింది.

Published : 16 Apr 2024 03:48 IST

2023-24పై వాణిజ్య శాఖ

దిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు నెలకొనడం వల్ల, మన ఎగుమతులపై ప్రభావం పడుతోంది. 2023-24లో మన దేశం నుంచి వస్తువుల ఎగుమతులు, 2022-23తో పోలిస్తే 3.11% క్షీణించి 437.06 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.36.28 లక్షల కోట్ల)కు చేరాయని వాణిజ్య శాఖ తెలిపింది. ఇదే సమయంలో దిగుమతులు కూడా 715.97 బి.డాలర్ల (సుమారు రూ.59.42 లక్షల కోట్ల) నుంచి 5.41% తగ్గి 677.24 బి.డాలర్ల (సుమారు రూ.56.22 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయి. దీంతో వాణిజ్య లోటు 240.17 బి.డాలర్లు (సుమారు రూ.19.93 లక్షల కోట్లు)గా నమోదైంది. దేశ వస్తువుల ఎగుమతులు మార్చిలో కాస్త తగ్గి 41.68 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.46 లక్షల కోట్ల)కు చేరాయి. దిగుమతులు 5.98% తగ్గి 57.28 బి.డాలర్ల (సుమారు రూ.4.75 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయి.

ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు, ఔషధాలే ఎక్కువ: 2023-24లో ఎగుమతులకు ఎలక్ట్రానిక్స్‌, ఔషధాలు-ఫార్మా, ఇంజినీరింగ్‌ వస్తువులు, ముడి ఇనుము, కాటన్‌ యార్న్‌/ఫాబ్స్‌/మేడ్‌-అప్స్‌, హ్యాండ్లూమ్‌ ఉత్పత్తులు, సిరామిక్‌, గ్లాస్‌వేర్‌ తదితరాలు ఊతంగా నిలిచాయి. మొత్తం ఎగుమతులు (వస్తువులు+సేవలు) 2023-24లో 776.68 బి. డాలర్ల (సుమారు రూ.64.46 లక్షల కోట్ల)కు చేరి ఉంటాయని అంచనా. 2022-23లోని 776.40 బి. డాలర్ల (సుమారు రూ.64.44 లక్షల కోట్ల) తో పోలిస్తే స్వల్పంగా అధికం.

పశ్చిమాసియా సంక్షోభం: ‘పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితిని సమీక్షిస్తున్నాం. తగిన చర్యలు తీసుకుంటాం. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దీనిపై ఎక్కువ మాట్లాడలేమ’ని వాణిజ్య కార్యదర్శి సునీల్‌ బర్తవాల్‌ పేర్కొన్నారు.

9.67% పెరిగిన ఫార్మా ఎగుమతులు: ఔషధాలు, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.32 లక్షల కోట్ల (27.85 బిలియన్‌ డాలర్ల) స్థాయికి చేరాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సర ఎగుమతులు రూ.2.1 లక్షల కోట్ల (25.39 బిలియన్‌ డాలర్లు)తో పోలిస్తే ఇవి 9.67% అధికమని వాణిజ్య శాఖ తెలిపింది. మార్చిలో ఎగుమతులు రూ.23 వేల కోట్ల (2802.78 మిలియన్‌ డాలర్లు) మేరకు ఉన్నాయి. 2023 మార్చితో పోలిస్తే ఇది 12.73% అధికం. నియంత్రణపరమైన సవాళ్లు ఎదురైనప్పటికీ అమెరికాకు ఔషధ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో 15 శాతానికిపైగా వృద్ధి సాధించాయి. 2022-23 ఇదే కాలంలో ఎగుమతులు 6.18 శాతమే వృద్ధి చెందాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-ఫిబ్రవరిలో అమెరికా మార్కెట్‌కు ఔషధ ఎగుమతుల విలువ 7.83 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.65,000 కోట్లు)గా ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఈ మొత్తం 6.8 బి.డాలర్లే (సుమారు రూ.56,500 కోట్లు). మన దేశ ఔషధ ఎగుమతుల్లో అమెరికా మార్కెట్‌ వాటా 30% ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని