సంక్షిప్త వార్తలు

పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హెరిటేజ్‌ ఫుడ్స్‌, తన శీతల పానీయాలను.. ప్యాకేజింగ్‌ టెక్నాలజీ సంస్థ  ఎస్‌ఐజీ అందించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, ఎసెప్టిక్‌ కార్టన్‌ ప్యాక్‌లలో అందుబాటులోకి తెచ్చింది.

Published : 17 Apr 2024 01:36 IST

ప్రత్యేక కార్టన్‌ ప్యాక్‌లలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ శీతల పానీయాలు

ఈనాడు, హైదరాబాద్‌: పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హెరిటేజ్‌ ఫుడ్స్‌, తన శీతల పానీయాలను.. ప్యాకేజింగ్‌ టెక్నాలజీ సంస్థ  ఎస్‌ఐజీ అందించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, ఎసెప్టిక్‌ కార్టన్‌ ప్యాక్‌లలో అందుబాటులోకి తెచ్చింది. ఎస్‌ఐజీ తమకు ఫ్లెక్సిబుల్‌ ఫిల్లింగ్‌ సొల్యూషన్స్‌, వినూత్న ఎసెప్టిక్‌ ప్యాకేజింగ్‌ పరిజ్ఞానాన్ని సరఫరా చేసినందున.. వినియోగదార్ల అభిరుచులకు అనుగుణంగా శీతల పానీయాలను, ఇతర ఉత్పత్తులను విడుదల చేయగలుగుతున్నట్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌  వెల్లడించింది. ఎస్‌ఐజీ ఎక్స్‌స్లిమ్‌ 12 అసెప్టిక్‌ ఫిల్లింగ్‌ మెషీన్‌ను మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలోని తన యూనిట్లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఏర్పాటు చేసింది. ఈ యంత్రం గంటకు 12,000 కార్టన్‌ ప్యాక్‌లను నింపుతుంది. 80-200 మిల్లీలీటర్ల పరిమాణాల్లో ప్యాక్‌ చేయొచ్చు. దీనివల్ల వినియోగదార్ల అవసరాలకు అనుగుణంగా శీతల పానీయాలను అందించగలమని హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రాహ్మణి నారా తెలిపారు. విలువ జోడించిన ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవడంపైనా తాము దృష్టి కేంద్రీకరిస్తున్నామని, దీనికి నూతన సాంకేతిక పరిజ్ఞానం దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. అసెప్టిక్‌ కార్టన్‌ ప్యాక్‌లను పూర్తిగా పునర్వినియోగానికి అనువైనవని, తద్వారా పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుందని తెలిపారు.


కిమ్స్‌ హాస్పిటల్స్‌ అనుబంధ సంస్థకు ఐటీ నోటీసు 

ఈనాడు, హైదరాబాద్‌: కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) కు అనుబంధ సంస్థ అయిన ఎస్‌పీఏఎన్‌వీ మెడిసెర్చ్‌ లైఫ్‌సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఆదాయపు పన్ను శాఖ రూ.306.97 కోట్లకు ‘డిమాండ్‌ నోటీసు’ జారీ చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 156 కింద 2022-23 అసెస్‌మెంట్‌ ఏడాదికి సంబంధించి ఈ నోటీసు ఇచ్చినట్లు కిమ్స్‌ హాస్పిటల్స్‌ మంగళవారం బీఎస్‌ఈకి తెలిపింది. మార్చి 29వ తేదీతో నోటీసు జారీ అయినట్లు పేర్కొంది. ఎస్‌పీఏఎన్‌వీ మెడిసెర్చ్‌ లైఫ్‌సైన్సెస్‌ మూలధనం, షేరు ప్రీమియం ఖాతా, సెక్యూరిటీ లేని రుణాన్ని తిరిగి చెల్లించడానికి సంబంధించిన ప్రశ్నలకు తగిన వివరణ ఇవ్వలేదనే కారణంతో ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ చేసినట్లు వివరించింది. చట్ట ప్రకారం ఈ నోటీసు నిలవదని, దీనిపై ఎన్‌ఎఫ్‌ఏసీ (నేషనల్‌ ఫేస్‌లెస్‌ అప్పీల్‌ సెంటర్‌) లో అప్పీలు చేయబోతున్నట్లు కిమ్స్‌ హాస్పిటల్‌ వెల్లడించింది.


భారత్‌ తయారీ సర్వర్లు ప్రారంభించిన హెచ్‌పీఈ

దిల్లీ: భారతదేశంలోనే సర్వర్లను తయారు చేస్తామని చెప్పిన ఏడాదిలోపే, హ్యూలెట్‌ ప్యాకర్డ్‌ ఎంటర్‌ప్రైజ్‌ (హెచ్‌పీఈ) భారీ స్థాయిలో ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ సర్వర్లను తీసుకొచ్చింది. 2023 జులై లో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ప్రణాళికలను ఈ కంపెనీ ప్రకటించింది. భారత తయారీ సంస్థ వీవీడీఎన్‌ టెక్నాలజీస్‌తో కలిసి తొలి అయిదేళ్లలో 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.8300 కోట్ల) విలువైన హై వాల్యూమ్‌ సర్వర్లను తయారు చేస్తామని ఆ సమయంలో పేర్కొంది. పెరుగుతున్న భారత వినియోగదార్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, మేడ్‌ ఇన్‌ ఇండియా సర్వర్లను భారీ స్థాయిలో తీసుకొచ్చినట్లు మంగళవారం సంస్థ ప్రకటించింది. ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం ద్వారా తమ లాంటి తయారీదార్లకు ఊతమిచ్చినందుకు కేంద్రం, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు హెచ్‌పీఈ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఎండీ సోమ్‌ సత్సంగి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని