రైతులకు నేరుగా రుణాలు ఇవ్వం: నాబార్డ్‌

తాము రైతులకు నేరుగా రుణాలు అందించబోమని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌) మంగళవారం స్పష్టం చేసింది.

Published : 17 Apr 2024 01:39 IST

దిల్లీ: తాము రైతులకు నేరుగా రుణాలు అందించబోమని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌) మంగళవారం స్పష్టం చేసింది. గ్రామీణ అభివృద్ధికి తోడ్పాటును అందించే వివిధ రుణ సంస్థలు, సహకార సంఘాలకు తాము రుణ సాయాన్ని అందిస్తామని పేర్కొంది. ఆయా సంస్థల నుంచి రైతులు రుణాలు పొందుతుంటారని వివరించింది. ‘రైతులకు నేరుగా తాము రుణ సాయం అందిస్తామనే’ తప్పుడు సమాచారం విషయంలో అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని రైతులు, గ్రామీణ వ్యాపారులకు తెలియజేస్తున్నామని పేర్కొంది. ధ్రువీకరించని సమాచారాన్ని నమ్మితే ఆర్థికపరమైన ముప్పు, అపార్థాలకు దారి తీయొచ్చనే ఈ వివరాలు అందిస్తున్నట్లు తెలిపింది. సరైన సమాచారం కోసం నాబార్డ్‌ అధికారిక వెబ్‌సైట్‌ డబ్లూడబ్ల్యూడబ్ల్యూ.నాబార్డ్‌.ఓఆర్‌జీని సందర్శించి తెలుసుకోవాలని సూచించింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలనే లక్ష్యంతో, వివిధ రకాల కార్యక్రమాలు, పథకాల ద్వారా గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ ప్రోత్సాహానికి నాబార్డ్‌ కట్టుబడి ఉంటుందని వివరించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, సరైన సమాచారం మాత్రమే ప్రజలకు చేరేందుకు వాటాదార్లందరి సహకారం అవసరమని నాబార్డ్‌ తెలిపింది. మరింత స్పష్టత, విచారణల కోసం సమీప నాబార్డ్‌ కార్యాలయాన్ని సంప్రదించొచ్చని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని