ఈ కంపెనీల్లో పనిచేయడం ఇష్టం

మన దేశంలో పనిచేయడానికి అనువైన కంపెనీల్లో అగ్రస్థానాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) దక్కించుకుంది.

Updated : 22 Apr 2024 14:19 IST

తొలి 3 స్థానాల్లో టీసీఎస్‌, యాక్సెంచర్‌, కాగ్నిజెంట్‌
25 కంపెనీల్లో 9 ఆర్థిక సేవల సంస్థలే: లింక్డ్‌ఇన్‌ 

దిల్లీ: మన దేశంలో పనిచేయడానికి అనువైన కంపెనీల్లో అగ్రస్థానాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) దక్కించుకుంది. ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో యాక్సెంచర్‌, కాగ్నిజెంట్‌ నిలిచాయని ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫాం లింక్డ్‌ఇన్‌ తెలిపింది. ఈ సంస్థ మంగళవారం విడుదల చేసిన ‘2024 టాప్‌ కంపెనీస్‌’ జాబితాలో అగ్రగామి 25 కంపెనీలు, అత్యుత్తమ 15 మధ్య స్థాయి కంపెనీలు ఉన్నాయి. పెద్ద కంపెనీ (500 మందికి పైగా భారత్‌లో ఉద్యోగులున్న సంస్థ)ల జాబితాలో టీసీఎస్‌ ఈ ఏడాది ప్రథమ స్థానంలో నిలిచింది.

  • టాప్‌-25 కంపెనీల్లో 9 ఆర్థిక సేవల కంపెనీలే ఉన్నాయి. ఇందులో మెక్వారీ గ్రూప్‌(4వ స్థానం), మోర్గాన్‌ స్టాన్లీ(5), జేపీ మోర్గాన్‌ చేజ్‌ అండ్‌ కో(6) ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌(సాస్‌) ప్లాట్‌ఫామ్‌ లెంట్రా మధ్య స్థాయి కంపెనీ (250-500 ఉద్యోగులు)ల జాబితాలో తొలి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో మేక్‌మైట్రిప్‌ ఉంది. ఈ జాబితాలో ఫ్యాషన్‌, బ్యూటీ రిటైలర్‌ సంస్థ నైకా, ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫాం డ్రీమ్‌11 కూడా ఉన్నాయి.

ఈ నైపుణ్యాలకు ప్రాధాన్యం: ఆర్థిక సేవల రంగంలోని కంపెనీలు ఇన్వెస్టర్స్‌ రిలేషన్స్‌, క్యాపిటల్‌ మార్కెట్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ వంటి నైపుణ్యాలున్న వారి కోసం చూస్తున్నాయి. టెక్‌ కంపెనీల విషయానికొస్తే.. ఎంటర్‌ప్రైజ్‌ సాఫ్ట్‌వేర్‌, డేటా స్టోరేజ్‌ టెక్నాలజీస్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ లైఫ్‌ సైకిల్‌ (ఎస్‌డీఎస్‌సీ), కృత్రిమ మేధ(ఏఐ) తదితర నైపుణ్యాల కోసం అన్వేషిస్తున్నాయి.

  • రెవెన్యూ అనాలిసస్‌, నాన్‌ప్రాఫిట్‌ మేనేజ్‌మెంట్‌, మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌.. తదితర నైపుణ్యాలున్న వారి కోసమూ కంపెనీలు అన్వేషిస్తున్నాయి.

బెంగళూరు, హైదరాబాద్‌పై ఆసక్తి: అగ్రగామి కంపెనీలకు ఆసక్తి ఉన్న నగరాలు లేదా అవి నియామకాల వైపు మొగ్గుచూపే ప్రాంతాల్లో బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌, ముంబయి మెట్రోపొలిటన్‌ రీజియన్‌, పుణె ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వృద్ధి చెందే సామర్థ్యం, నైపుణ్యాభివృద్ధి, కంపెనీ స్థిరత్వం, బయటి అవకాశాలు, లింగ సమానత్వం, కంపెనీతో అనుబంధం, ఎంత వరకు చదివారు, దేశంలోనే ఉద్యోగి ఉండడం వంటి 8 అంశాల ఆధారంగా కంపెనీలకు ర్యాంకులు ఇచ్చినట్లు లింక్డ్‌ఇన్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని