రూ.లక్ష కోట్లకు పైగా ఐఫోన్‌ ఎగుమతులు

మన దేశం నుంచి యాపిల్‌ ఐఫోన్ల ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2022-23లో 6.27 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.52000 కోట్ల) విలువైన ఐఫోన్లు ఎగుమతి కాగా, 2023-24లో ఈ మొత్తం రెట్టింపై 12.1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1,00,430 కోట్ల) విలువైనవి ఎగుమతి అయ్యాయి.

Published : 17 Apr 2024 01:50 IST

2023-24లో మనదేశం నుంచి

దిల్లీ: మన దేశం నుంచి యాపిల్‌ ఐఫోన్ల ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2022-23లో 6.27 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.52000 కోట్ల) విలువైన ఐఫోన్లు ఎగుమతి కాగా, 2023-24లో ఈ మొత్తం రెట్టింపై 12.1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1,00,430 కోట్ల) విలువైనవి ఎగుమతి అయ్యాయి. ఇదే సమయంలో దేశం నుంచి మొత్తం అన్ని కంపెనీల స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు కూడా  12 బి. డాలర్ల (సుమారు రూ. 99,600 కోట్ల) నుంచి 16.5 బి. డాలర్ల (సుమారు రూ. 1.37 లక్షల కోట్ల)కు చేరాయి. భారత్‌లో యాపిల్‌ ఫోన్ల తయారీ పెరగడం, ఎగుమతుల విలువ పెరిగేందుకు కారణమైందని ద ట్రేడ్‌ విజన్‌ ఎల్‌ఎల్‌సీ పేర్కొంది. ‘భారత్‌లో తయారీ కార్యకలాపాలను పెంచాలని యాపిల్‌ నిర్ణయించింది. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య తన సరఫరా వ్యవస్థను చైనా బయటకు విస్తరించాలని యాపిల్‌ భావించడం ఇందుకు కారణమ’ని తెలిపింది. ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకం తరహా భారత ప్రభుత్వ చర్యల వల్ల యాపిల్‌ వంటి కంపెనీలు స్థానిక తయారీ కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని ట్రేడ్‌ విజన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(సేల్స్‌, మార్కెటింగ్‌) మోనికా ఒబెరాయ్‌ అంచనా వేశారు.

భారత్‌ తయారీ ఐఫోన్లపై అమెరికన్ల మక్కువ: భారత్‌ నుంచి ఫోన్లను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అమెరికాదే తొలిస్థానం. 2023-24లో భారత్‌ నుంచి 6బి.డాలర్ల (సుమారు రూ.50,000 కోట్ల) విలువైన స్మార్ట్‌ఫోన్లను అమెరికా దిగుమతి చేసుకుంది. ఇందులో ఐఫోన్ల వాటానే 5.46 బి. డాలర్లు (రూ.45,300 కోట్లు)గా ఉంది. అంతక్రితం ఏడాది నమోదైన 2.1 బి. డాలర్ల (సుమారు రూ.17,400 కోట్ల) తో పోలిస్తే ఈమొత్తం చాలా ఎక్కువ. భారత్‌లో తయారైన ఐఫోన్లపై అమెరికా వినియోగదార్లు మక్కువ చూపడాన్ని ఇది ప్రతిఫలిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని